బండికి ఉద్వాసన.. ఈటలకు పగ్గాలు?
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీలో ఇదే హాట్ టాపిక్. అయితే ఇది నిజమా అంటే అవుననో కాదనో చెప్పే పరిస్థితి లేదు. నిజం ఒకప్పుడు బీజేపీలో కేవలం బీజేపీ గోత్రీకులే ఉన్నప్పుడు ఇలాంటి లీకుల సంస్కృతీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు పూర్తిగా మారిపోయింది. బీజేపీలో కాషాయ గోత్రీకులే కాదు, నానావర్ణ గోత్రీకులు వచ్చి చేరారు. అందులో కొందరిలో పూర్వాశ్రమ వాసనలు పూర్తిగా పోలేదు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ .. అంతే కాదు ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బయటి వాసనలు లోపలికి చేరుతున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన నేతలకు కూడా ఆ వాసనలు అంటుతున్నాయి. అందుకే ముందెన్నడూ లేని లీకులు చిట్ – చాట్ చప్పుళ్ళు ఇప్పుడు బీజేపీలోనూ వినిపిస్తున్నాయి.
అలాగని బీజేపీలో ఏమీ జరగడం లేదని కాదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో, ముఖ్యంగా అధికారం ఆశించి కమల గూటికి చేరిన నాయకులలో పునరాలోచనలు మొదలయ్యాయి. అలాగే కర్ణాటక ఫలితాలను సమీక్షించుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాదిలో కథ అడ్డం తిరిగిందనే వాస్తవాన్ని గుర్తించింది. ఒక అంచనాకు వచ్చింది. అందుకే దక్షిణాదిలోనే కాదు, ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లతో పాటుగా తెలంగాణపైనా ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. మార్పులు చేర్పుల గురించి పునరాలోచన చేస్తోంది. ఏమి చేస్తే ఎన్నిక గండం గట్టెక్కగలం అనే ఆలోచనలకు పదును పెడుతోంది. అందులో భాగంగా, కర్ణాటక ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే తెలంగాణలో నాయకత్వం మార్పుతో సహా ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో, విభిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ని ఆ పదవి నుంచి తప్పించి హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనపై బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చ జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని అంటున్నారు. అలాగే ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదివి ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అలాగే మరో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, ఈటలకు ప్రచార కమిటీ,బాధ్యతలు అప్పగించడం ద్వారా బండి, ఈటల, అరుణ త్రిముఖ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ పైవేవీ కాదు ..యథాతథ స్థితి కొనసాగుతుందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
ఒక విధంగా చూస్తే 2014ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో పార్టీలో చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మరో కొందరు ముఖ్య నాయకులు మోడీని పీఎం అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో అభ్యతరం వ్యక్తం చేశారు. అయితే , చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకులం దరూ ఒకే తాటిపై నడిచారు. బీజేపీ 30 ఎల్లా చరిత్రను తిరగరాసింది. సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం ( 283) సీట్లు గెలుచుకుంది.
అదలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి పార్టీ కూడా పరిస్థితిని సమీక్షించు కుంటుంది . అవసరమైన మేరకు వ్యూహాలను మార్చు కుంటుంది. అదే పని బీజేపే చేస్తోంది. అవసరం అయితే, నాయకత్వాన్ని మార్చుకుంటుంది. అనేక రాష్టాలలో ముఖ్యమంత్రులనే మార్చిన సందర్భాలున్నాయి. ఇది అన్ని పార్టీలలో ఉన్నదే. ఇప్పుడు తెలంగాణలో అదే పని కాంగ్రెస్ చేస్తోంది. అదే పని బీఆర్ఎస్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద ఒంటి కాలు మీద లేచిన బీఆర్ఎస్ నాయకత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్టీ హై కమాండ్ ను ఢిల్లీనుంచి బెంగుళూరుకు మార్చుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్న పొంగులేటి , జూపల్లి వంటి నాయకులు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు జరుతున్నారు. సో .. మీడియా ఫోకస్ బీజేపీ మీద ఉన్నా, తెలంగాణ రాజకీయాలలో పార్టీలతో ప్రమేయం, లేకుండా అంతర్మథనం సాగుతోంది. చివరకు, ఏమి జరుగుతుంది? బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? కాంగ్రెస్ కథేంటి? బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడే తేలేది కాదు.