డాక్టర్ గారంటేనే ముద్దు.. కోడెల శివరాం మాకొద్దు!
posted on Jun 12, 2023 @ 4:14PM
కోడెల శివరామ్.. ఇప్పుడు తెలుగుదేశం రెబల్ గా తన తండ్రి సేవలను పార్టీ గుర్తించడం లేదంటూ రోడ్డెక్కారు. అయితే ఆయన తండ్రి సెంటిమెంట్ సత్తెనపల్లిలో వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఇసుమంతైనా లేవని ఆ నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. కోడెల శివప్రసాద్ పట్ల నియోజకవర్గ ప్రజలలో అపార గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన ప్రజా సేవానిరతి, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటారు.
అయితే అదే సమయంలో ఆయన కుమారుడి పట్ల మాత్రం నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దౌర్జన్యాలను ఇప్పటికీ జనం నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణను నియమించిన నేపథ్యంలో శివరాం పార్టీపై తిరుగుబాటు చేసినా ఆయనకు జనం నుంచి మద్దతు కరవవ్వడానికి ఆయన తీరే కారణమని అంటున్నారు. అంతే కాకుండా తండ్రి పేరు చెప్పుకుని సెంటిమెంట్ పంపడించి సానుభూతిని సంపాదించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన ప్రయత్నాలకు విరుగుడుగానా అన్నట్లు.. గుంటూరు జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో ఆయనపై ఉన్న కేసుల గురించి జనం చర్చించుకుంటున్నారు. అలాగే ఆయన బాధితులంతా ఒకే వేదికమీదకు వచ్చి శివరాంకు వ్యతిరేకంగా నిరసనగళం ఎత్తేందుకు సమాయత్తమౌతున్నారు.
నియోజకవర్గ ఇన్ చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించడాన్ని తప్పుపడుతూ రోడ్డుకెక్కిన కోడెల శివరామ్ ను నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ విస్మరిస్తోంది. ఆయనకు అండగా కదిలేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాకుండా నియోజకవర్గంలోని ఆయన సామాజిక వర్గీయుల మద్దతు కూడా శివరాంకు దక్కడం లేదు.
ఇప్పుడు శివరాంకు నియోజకవర్గంలో అండగా నిలబడుతున్న వారెవరైనా ఉన్నారా అంటే గత ఎన్నికల సమయంలో కోడెలపై చేయి చేసుకున్న వైసీపీ వర్గీయులేనని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. కోడెల తలపెట్టిన ర్యాలీలో కనిపించిన వారంతా వైసీపీవారేనని చెబుతున్నారు. అదీ కాక కోడెల శివప్రసాద్ జీవించి ఉన్న సమయంలో పలు సందర్భాలలో తన వారసులెవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన సంగతిని ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకుంటున్నారు.