అమిత్ షా నోట ఎన్డీయే మాట
posted on Jun 13, 2023 @ 12:28PM
ఆంధ్రప్రదేశలో ప్రధానంగా మూడు పార్టీలే క్రియాశీలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పేరుకు జాతీయ పార్టీలే అయినా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అంతంత మాత్రమే. మీడియా సమావేశాలలోనూ, ఆ పార్టీ జాతీయ నేతలు వచ్చినప్పుడు జరిగే సభల్లోనూ తప్ప ఆ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించదు. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ ఉనికి ఒకింత ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతే.
కానీ ఎన్నికలు, ఓట్లు విషయానికి వచ్చే సరికి రాష్ట్రంలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీల మధ్యే. ఇక జనసేన అయితే తెలుగుదేశంతో కలిసి ఎన్నికలలో పోటీ చేయడం అన్నది దాదాపుగా ఖరారైంది. అంతే కాకుండా ఆ పార్టీ ప్రస్తుతానికి బీజేపీతో మిత్రపక్షంగా కూడా కొనసాగుతోంది. ఎలా చూసినా ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయితే అధికారికంగా లేదనే చెప్పాలి. అటువంటి వేళ విశాఖలో జరిగిన సభలో అమిత్ షా ఏపీలో ఎన్డీయే ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకే కనీసం 20 స్థానాలు దక్కాలని ఆయన సభాముఖంగా అన్నారు. ఆయన మాటలు యథాలాపంగా అన్నవి అయితే కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగేటట్లు ఉంటే బీజేపీకి 20 స్థానాలు రావాలని పిలుపునచ్చి ఉండేవారు.
అందుకు భిన్నంగా ఎన్డీయేకు అన్నిస్థానాలు కావాలని పిలుపునివ్వడం రాజకీయ చర్చకు తెరలేపింది. ఆయన తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి సాగుతుందన్న సంకేతాలిచ్చారా? లేదా జనసేన, బీజేపీ కూటమిగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయన్న ఉద్దేశంతో అన్నారా అన్నదానిపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే అమిత్ షా ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా మాత్రం పోటీ చేయడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అదే సభలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఆయన కూడా ఏపీలో మిత్రపక్షంగా ఉన్నజనసేన చెప్పిన ప్రభుత్వ ఓటు చీలనివ్వకూడదన్న స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమౌతున్నాయన్నది మాత్రం అమిత్ షా మాటల ద్వారా తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలోనే జనసేనాని గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడతాను అన్న మాటను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.