బీజేపీని లెక్క చేసేదేమిటంటున్న జగన్?
posted on Jun 13, 2023 @ 10:09AM
ఒక్క రెండు సభలు.. బీజేపీ- వైసీపీ బంధాన్ని తెంచేశాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయమని తాజా పర్యటనలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చేసిన విమర్శలు.. ఆ పార్టీతో వైసీపీకి ఉన్న నాలుగేళ్ల బంధాన్ని పుటుక్కున తెంచాశాయి.
అయితే ఈ తెగదెంపులు వ్యూహాత్మకమా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఉంటే కలిసి మునిగిపోవడం కంటే.. వేరువేరుగా ఉంటే కనీసం ఒకరైనా మిగులుతామన్న ఉద్దేశంతోనూ అమిత్ షా నడ్డాలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారని విశ్లేషిస్తున్నారు. నడ్డాపై వైసీపీ మంత్రులు బూతులతో విరుచుకుపడటం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బీజేపీ లేక్కేమిటన్నట్లు మాట్లడడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ నేతలూ, మంత్రులు, సలహాదారుల చేత మాట్లాడించి తాను మౌనం పాటించే జగన్ సోమవారం (జూన్ 12) పిల్లలకు స్కూలు బ్యాగులూ, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్క సారిగా బీజేపీపై తన వాగ్ధాటిని మరీ అంత పదునుగా కాకున్నా ప్రదర్శించారు.
రాష్ట్రంలో తమకు బీజేపీ అండ అవసరం లేదన్నారు. ఆ పార్టీ సహకారం లేకున్నా గెలుస్తామంటూ ధీమాను ప్రదర్శించారు. జగన్ నోటీ వెంట బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట రావడం దాదాపుగా ఇదే తొలిసారి. రాష్ట్రం ఏ గంగలో మునిగినా ఫరవాలేదు.. కేంద్రం అండతో కేసుల నుంచి గట్టెక్కితే చాలన్నట్లుగా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లూ వ్యవహరించిన జగన్ చివరికి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ఈ సమయంలో బీజేపీ లేక్కేమిటి అన్నట్లు మాట్లాడటం మామూలు విషయం కాదంటున్నారు.
అయితే బీజేపీ అంటే లెక్క చేయడం, చేయకపోవడం జగన్ ఇష్టం. కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన ఎంచుకున్న వేదికే అభ్యంతరకరం. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులూ పంచే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమేమిటన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి. అయితే అటువంటి విమర్శలను సీఎం పెద్దగా పట్టించుకోరన్నది ఇప్పటికే పలు సార్లు రుజువైంది. ప్రభుత్వ కార్యక్రమంలో తప్ప జగన్ మాట్లాడేందుకు మరో వేదికే లేని పరిస్థితి గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో నెలకొని ఉంది.
జగన్ తన రాజకీయ విమర్శలకు ప్రభుత్వ కార్యక్రమాలనే వేదిక చేసుకుంటున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు అదే సరైన వేదికగా ఆయన ఫిక్సైపోయారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఫిక్సైపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బెదిరించో, బామాలో, ప్రలోభపెట్టో తీసుకు వచ్చిన జనాలే ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లి పోతున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే గడపగడపకూలో జరిగిన మర్యాదే తనకూ జరుగుతుందన్న విషయాన్ని ఆయన ఆకలింపు చేసుకోవడంతో తన వెర్షన్ చెప్పుకోవడానికి ఆయన బటన్ నొక్కుడు సభలనూ, ఇలా పందేరాల సభలనే వేదిక చేసుకుంటున్నారు. బీజేపీని తాను లెక్క చేయనని గంభీరంగా చెప్పిన జగన్ అదే సమయంలో తన ప్రభుత్వంపై బీజేపీ అగ్ర నేతలు చేసిన ఆరోపణలు, విమర్శల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి విమర్శలను కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేదు.
షా, నడ్డాలు తన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై విమర్శలతో సరిపెట్టకుండా దూషణల పర్వానికీ దిగారు. బీజేపీ అండగా లేకపోవచ్చు..మీడియా సహకారం అందక పోవచ్చు..దత్తపుత్రుడు అండ దండలు లేకపోవచ్చు…కానీ తన ధైర్యం ప్రజలేనని చెప్పుకున్నారు. మరి ఆ ప్రజల ముంగిటకు వెళ్లకుండా పరదాలెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని చెప్పుకొచ్చారు. తాను పేద ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని… అది కూడదంటూ విపక్షాలు పోరాటం చేస్తున్నాయనీ ఆరోపించారు.
జగన్ ఇటీవలి ప్రసంగాలు విపక్షాల సంగతేమో కానీ సొంత పార్టీ వైసీపీ శ్రేణులనే తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఇంకా ఎన్నికల సమరం మొదలు కాకముందే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్న నాయకుడిని జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ అండ అవసరంలేదన్న మాటతో తన నెత్తిన తానే చేయిపెట్టుకున్నట్లైందని, మునక ఖాయమని అంగీకరించేసినట్లేనని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.