పార్టీపై జగన్ పట్టు జారిపోయిందా?

వైసీపీ బండారం బయటపడిపోయింది.  పార్టీపై జగన్  పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నే అది పక్కాగా తేటతెల్లమైపోయింది. మూడేళ్ల పాటు గుప్పిట మూసి అంతా నేనే.. నా మాటే శాసనం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ ఒక్క సారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంతో కుప్పకూలిపోయినట్లైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఎమ్మెల్యేలూ, మంత్రిపదవుల ఆశావహులూ, పదవి కోల్పోయిన మాజీలలో వెల్లువెత్తిన నిరసన వైసీపీ బండారాన్ని బయటపెట్టేశాయి. సరే ఆ అసంతృప్తి ఎలాగో కష్టపడి బుజ్జగింపుల ద్వారా చల్లార్చుకున్నారనుకుంటే అసలు సినిమా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులకు అడుగడుగునా ప్రజా నిరసన సెగలా తగలడంతో  దానిని తూతూ మంత్రంగా చుట్టేయడానికే ఎమ్మెల్యేలూ, మంత్రులూ మొగ్గు చూపారు. దీంతో జగన్ సమీక్ష నిర్వహించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పేరు ప్రస్తావించి మరీ తీవ్ర హెచ్చరికలు చేశారు. టికెట్లు, పదవులు అన్నీ కూడా గడపగడపకూ పెర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించి పెర్ఫార్మెన్స్ బాలేని మంత్రులకు ఉద్వాసన పలుకుతాననీ, బాగున్న వారికి పదవులు కట్టబెడతాననీ విస్పష్టంగా చెప్పేశారు. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే మరో సారి సమీక్ష నిర్వహించారు. అప్పుడూ అదే ధోరణి కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ సందర్భంగానే మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ పలువురి మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సరే ఆ చర్చ అలా జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీకి ఆ ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మూడు గ్యాడ్యుయెట్ ఎమ్మెల్సీ స్థానాలలోనూ, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలోనూ అధికార వైసీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఇక ఆ తరువాత నుంచీ జగన్ నోటి వెంట హెచ్చరికలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు లేవు. రుసరుసలు లేవు. మొత్తం బుజ్జగింపుల పర్వమే. పనితీరు బాలేకపోతే వచ్చే ఎన్నికలలో నో టికెట్ అంటూ హెచ్చరికలు లేవు.  ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం అన్నీ విపక్షాల సృష్టే అంటూ గతంలో మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా జగన్ స్వరం మారిపోయింది.   ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లోనే ఇంకా పలువురు లిస్ట్ లో ఉన్నారంటూ గంభీరమైన లీకులు ఇచ్చారు. అయితే ఆ తరువాత సీన్ మారిపోయింది. ఏప్రిల్ 3న నిర్వహించిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినా కిమ్మనలేదు.  అప్పటి వరకూ ఓ హెచ్చరికలా చెబుతూ వచ్చిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట ఎత్తలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. అప్పట్లో కేబినెట్ సమావేశంలో  స్వయంగా జగన్   ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు.  అయితే తరువాత పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట కాదు కదా.. కనీసం పని చేయని మంత్రులను మందలించే ధైర్యం కూడా చేయలేనంత బలహీనంగా సీఎం మారిపోయారు. గతంలోలా సొంత పార్టీపై పట్టు లేకపోవడం వల్లనే ఆయన పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా విపక్షంపై విమర్శలు చేయడానికే అన్నట్లుగా జగన్ అజెండా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్ తీరుతో బీజేపీలో ఆందోళన!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందా? ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావేనా? అంటే కమలనాథులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి హైప్ ఇచ్చిందీ, ఇప్పుడా హైప్ ను తగ్గించేసి పార్టీని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందీ కూడా కేసీఆరే అని అంటున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీకి లేని హైప్ ను క్రియేట్ చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే  అలా చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పెరిగేదీ ఉండదు.. ఆ పార్టీకి ఒరిగేదీ ఏమీ ఉండదని ఆయన భావించారంటున్నారు. కానీ తర వైఖరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన భావించారు. చాలా వరకూ ఆయన అనుకున్నట్లే జరిగింది కానీ, కేసీఆర్ కృత్రిమంగా బీజేపీకి క్రియేట్ చేసిన హైప్ ఆసరాగా తీసుకుని ఆ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు (గతంలో టీఆర్ఎస్)కు దీటుగా ఎదిగింది. ఆయన రాష్ట్రంలో బీజేపీకి ఉద్దేశపూర్వకంగా హైప్ క్రియోట్ చేయడానికి కాంగ్రెస్ ను బలహీన పరచడమే కాకుండా తన జాతీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా దోహదపడుతుందని భావించారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఆ విషయంలో పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా ఆయన బీజేపీ వ్యతిరేకత బూమరాంగ్ కూడా అయ్యింది. ఆయన పదే పదే కేంద్రంలోని మోడీ సర్కార్ ను, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని విమర్శించడంతో.. రాష్ట్రంలో కమలం బలోపేతమైంది. బీఆర్ఎస్ ను గట్టిగా ఢీ కొనే స్థాయికి చేరింది. అదే సమయంలో ఆయన బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడాన్ని జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు నమ్మలేదు. అందుకే ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ చెప్పులరిగేలా దేశమంతా తిరిగినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఇక లాభం లేదనుకుని సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు. అందుకు ఇంత కాలం తనకు అండగా, తన అధికారానికి దండగా నిలిచిన తెలంగాణ సెంటిమెంటును కూడా వదిలేసుకున్నారు. పార్టీలోని తెలంగాణ పేరును తీసేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇలా చేయడం వల్ల ఆయనకు ఒరిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు కానీ ఇక ఏ ఎన్నికలోనూ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా తీసుకునే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు. అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ తీరు వల్లే బలోపేతమైన బీజేపీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టగలమనుకునే స్థాయికి ఎదిగింది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తన పొరపాటును గుర్తించారు. అంతే వ్యూహాత్మకంగా తన ప్రసంగాలలో బీజేపీ పేరెత్తడం మానేశారు. దీని వల్ల గతంలో  అంటే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ఆయన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ బీటీమ్ గానే వ్యవహరించారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అదే సమయంలో  రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొనేందుకు కూడా  కేసీఆర్ వెరవ లేదు. అయితే.. ఇప్పుడు బీజేపీకి ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే.. రాష్ట్రంలో తన అధికారానికే ముప్పు వస్తుందన్న భావనకు వచ్చిన కేసీఆర్ బీజేపీ పేరెత్తడం మానేశారు. ఇదే బీజేపీకి తెలంగాణలో మైనస్ అయ్యింది. కర్నాటక ఫలితాలతో దిగాలు పడిన బీజేపీకి కేసీఆర్ మారిన వైఖరి మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి కారణమైన బీజేపీ, మోడీ వ్యతిరేకతకు కేసీఆర్ నీళ్లొదిలేశారన్న ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఆయన బీజేపీయేతర పార్టీల సీఎంల భేటీకి దూరంగా ఉండటంతో  కేసీఆర్ బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉందన్న భావన బలపడుతోంది. సరిగ్గా ఇదే తెలంగాణలో బీజేపీని బలహీన పరుస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత బీజేపీపై కూడా ప్రతిఫలిస్తుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది అంతిమంగా  కాంగ్రెస్ కే ప్రయోజనం చూకూరుస్తుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

వివేకా హత్య కేసులో ఎ9 ఎవరు?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి  జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, పదే పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అరెస్టును వాయిదా వేయించుకుంటున్న తీరు తీవ్ర చర్చనీయంశమైంది. ఇక తెలంగాణ హై కోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిలుపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పక్కన పెడితే.. ఈ కేసులో సీబీఐ అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో నూ, భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫడివిట్ లోనూ జగన్ పేరు ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావడం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమౌతున్నాయి. సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిస్తే చాలు జగన్ ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ వేగం మందగించేలా కార్యం చక్కబెట్టుకు వచ్చేవారని స్వయంగా వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  వివేకా హత్య కేసులో జగన్ కూడా విచారణకు హాజరు కాక తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం, అందరికంటే ముందే జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు. ఆయనకు ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే చేరవేశారన్నది తమ అనుమానంగా సీబీఐ చెబుతోంది. అందుకే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు స్పష్టంగా చెప్పింది.  ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనాల్సి రావడం అనివార్యమన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమౌతోంది.   కేసు ఇంత వరకూ రావడానికీ, జగన్ పేరు సీబీఐ ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడడానికీ వివేకా కుమార్తె  సునీత  అలుపెరుగని న్యాయపోరాటమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అసలు సునీత పట్టుబట్టి తన తండ్రి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సాధించినప్పటి నుంచే వైసీపీ పునాదులు కదలడం ప్రారంభమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల వరకూ దర్యాప్తు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారం చేపట్టగానే జగన్ సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.   అందుకే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ.. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే కేసులో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని పట్టించుకోకుండా ఒక్క అవినాష్ రెడ్డి విషయంలోనే జగన్ అతి శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక ఎంపీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఏ ముఖ్యమంత్రైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా కలగ జేసుకోకుండా ఉంటారని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టైతే కేజ్రీవాల్ ఆ అరెస్టును ఆపడం కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా జగన్ మాత్రం అవినాష్ కు ఇలా సీబీఐ నోటీసులు అందితే.. అలా హస్తిన  పర్యటనకు వెళుతున్నారనీ, అర్ధరాత్రి సమావేశాలతో  అవినాష్ ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు కచ్చితంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజలలో వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు సీబీఐ వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్ రెడ్డిని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఎ9 ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కోణం, కుట్ర ఉందని కూడా సీబీఐ పేర్కొనడంతో ఇప్పుడు అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపు మళ్లడంతో ఎ8 అవినాష్ రెడ్డి అయితే ఎ9 ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  ఆ చర్చలో ఈ కేసులో కీలక సాక్షులైన గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రస్తావనకు వస్తోంది. అలాగే  ఈ కేసు విచారణ ఏపీలో జరుగుతున్న సమయంలో సీబీఐ అధికారులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రస్తావనకు వస్తున్నాయి.  

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు జగన్?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆయన బెయిలు కోసం తన కుమారుడు అవినాష్ రెడ్డిలా తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించక తప్పదు. ఆయన ఏ హెల్త్ గ్రౌండ్స్ లో అయితే సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్  వేశారో.. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే తన కుమాడురు అవినాష్ రెడ్డికి మాత్రం హైకోర్టు తల్లి అనారోగ్య కారణంగా బెయిలు ఇచ్చింది. దీంతో భాస్కరరెడ్డి కూడా తన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ లో భాస్కరరెడ్డి అత్యంత ప్రభావమంతమైన వ్యక్తి అనీ బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారనీ పేర్కొంది. అంతే కాకుండా సాక్షులను బెదరించే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొంది. అలాగే ఈ కేసులో సునీత తరఫు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. కాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్  వాదనల సమయంలో కూడా సీబీఐ, సునీత ఇవే వాదనలు వినిపించారు. అయినా అక్కడ అవినాష్ కు ఊరట లభించింది. దీంతో భాస్కరరెడ్డి  బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారని పరిశీలకులు అంటున్నారు. కాగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంను ఆశ్రయించారు. సునీత పిటిషన్ సుప్రీంలో మంగళవారం (జూన్ 13)న విచారణకు రానుంది. దీంతో అవినాష్ విషయంలో  సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. ఆరోగ్య కారణాలు, అయితే  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కూడా వివేకా హత్య కేసులో అవినాష్ ఏ గ్రౌండ్ మీద అయితే యాంటిసిపేటరీ బెయిలు సంపాదించారో  అవే గ్రౌండ్స్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి మధ్యంతర బెయిలు పొందారు. అయితే ఈడీ రాఘవ బెయిలును సవాల్ చేయడంతో పై కోర్టు మధ్యంతర బెయిలు రద్దు చేసి రాఘవను లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో అవినాష్ కు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందని, ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ న్యాయ నిపుణులు అంటున్నారు. అదలా ఉంచితే.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు సందర్భంగా తెలంగాణ హైకోర్టులోనూ, ఆ తరువాత భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టులోనూ  సీబీఐ తన అఫిడవిట్లలో ఏపీ ముఖ్యమంత్రి  జగన్ పేరును ప్రస్తావించింది.  వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి  ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ రెండు సందర్భాలలోనూవివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి  అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ప్రయత్నాలన్నిటినీ వివేకా కుమార్తె వైఎస్ సునీత తన అసమాన న్యాయపోరాటంతో అడ్డుకున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఆమె తన సోదరుడు జగన్ పై పై చేయి సాధించారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో జగన్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందనీ, సీబీఐ తన అఫిడవిట్లలో జగన్ పేరు ప్రస్తావించడమంటే ఆయనను విచారిస్తామని చెప్పడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టు అనివార్యమని చెబుతున్నారు. అలాగే  ఆయన తండ్రి భాస్కరరెడ్డి బెయిలు కోసం  హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా  పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు. 

బతకనివ్వను.. ఛస్తే ఊరుకోను!

ఎప్పుడూ.. దిమ్మ తిరిగే ఆలోచనలు..శాశనాలతో కొరియన్లు ఊదరగొట్టే కిమ్ జోంగ్ మరో శాశనంతో.. జనాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల కిమ్ కుమార్తె పేరును ఎవరికి ఉండొద్దు అంటూ నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె 'జు ఏ' పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  కిమ్ మరో ఆదేశాలతో ఆయన చర్చనీయాంశంగా మారారు. అదేంటో గాని... ఉత్తర కొరియాలో ఆత్మహత్యలపై ఆయన నిషేధం విధించారు. ఈ మేరకు సీక్రెట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   ఆత్మహత్య అనేది సోషలిజానికి వ్యతిరేకంగా దేశద్రోహంగా భావించిన కిమ్... ఆత్మహత్యను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా నివేదికలో పేర్కొంది. ఉత్తర కొరియాలో గత ఏడాది కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యలు పెరిగాయని తెలుసుకున్న కిమ్ జోంగ్... ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియాలో.. ఆత్మహత్యల కేసులు 40 శాతం పెరిగాయి. అక్కడి అధికారులను ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించలేదు. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిమ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. అందుకోసం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... ఈ ఆదేశాలు జారీ చేశారనే వాదన వినిపిస్తోంది.  ఈ సమావేశంలోనే ఆత్మహత్యకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో పెరుగుతున్న అంతర్గత అశాంతి ప్రజల సమస్యలకు కారణమని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఉత్తర కొరియా దేశంలో హింసాత్మక నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని సమాచారం. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ఏడాది మాత్రమే చోంగ్జిన్ సమీపంలోని క్యోంగ్సాంగ్ కౌంటీలో 35 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయట. ఈ సంఖ్యను నార్త్ హమ్గ్యోంగ్ సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఈ కేసులలో చాలా వరకు మొత్తం కుటుంబాలు కలిసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఆత్మహత్యలపై నిషేదం విధించారు. మీరవరూ బతకడానికి వీలగలేదు..అలా అని ఛస్తే మాత్రం..నేనూరుకోను అన్నట్టుంది సదరు కిమ్ ల వారి వ్యవహారం. నిత్యం..కొత్త కొత్త శాశనాలతో..కొరియన్లను భయభ్రాంతులకు గురిచేసే ఆయన వైఖరికి జనం ఇప్పటికే సగం చచ్చారు. ఇప్పడు .. ఆత్మహత్య లపై నిషేధంతో.. వారి పరిస్థితి..బతకాలేము..చావలేము అన్నట్టుగా ఉంది. ఇలాంటి నేతతో.. ఉత్తర కొరియా ప్రజలను ఆ దేవుడే రక్షించాలి.

బాలయ్య.. ప్రజాసేవ, సినిమా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుల్లో  ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. నేటికీ ఆ వారసత్వాన్ని కొసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. అది నందమూరి బాలకృష్ణ అన్నది సుస్పష్టం. అలాగే ఎమ్మెల్యేగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అనుసరిస్తున్న మార్గం.. పలువురికి సర్వదా అనుసరణీయం. అలాంటి బాలయ్య జన్మదినం శనివారం (జూన్ 10). ఈ ఏడాది ఆయన 63వ సంవత్సరంలోకి అడుగు పెడతారు.   నందమూరి బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమా విడుదలవుతోందంటే.. ఆయన అభిమానులకు నిజంగా పండగే పండగ. ఆయన డైలాగ్ డెలివరీ అయినా.. డ్యాన్స్ సెప్ట్‌లు వేసిన.. ఛేజింగ్ సీన్స్‌లో దూసుకెళ్లినా బాలయ్యకు బాలయ్య బాబే సాటి. అలాగే పౌరాణికం, సాంఘికం, రాజకీయం ఏ సినిమా అయినా.. అది ఒక కళాఖండమే. అలాగే ఓటీటీ వేదికగా వచ్చిన.... వస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం సైతం సూపర్ డూపర్ హిట్టే.  ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అటు అన్నా క్యాంటీన్లను   బాలయ్య బాబు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో.. నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలను   అందిస్తున్నారు. ఇక బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాలయ్య బాబు.. అందిస్తున్న సేవలు అపూర్వం, అనితర సాధ్యం. ప్రముఖ మ్యాగజైన్ అవుట్ లుక్ నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో రోగులకు సేవలందిస్తున్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా ఈ బసవ తారకం ఆసుపత్రి రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. దీంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బాలకృష్ణ ఎంత అంకితబావంతో సేవలందిస్తున్నారో  అర్థమవుతోంది. అలాగే ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ సైతం నిర్వహిస్తున్నారు.   ఆయనకు 23 ఏళ్ల వయస్సులో తండ్రి ఎన్టీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. గత 39 ఏళ్లలో 22 ఏళ్ల ముఖ్యమంత్ర పీఠం ఆ ఇంటిదేనన్నది సుస్పష్టం.  ఇద్దరు బావలు ఎమ్మెల్యేలు అయినా.. సొంత సోదరుడు నందమూరి హరికృష్ణ పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నా.. రక్తం పంచుకు పుట్టిన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా చక్రం తిప్పినా.. మొత్తంగా చూస్తే.. గత 40 ఏళ్ళుగా.. మధ్యలో 1989 నుంచి 1994 వరకూ తప్ప అధికారం ఆయనింటి గడప దాటలేదన్న విషయం తెలిసిందే. ఇంతగా ఇంతలా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో ఉన్నా.. ఈ రోజు వరకు ఒక్క అణా పైసా అవినీతి ఆరోపణ కానీ,  అధికార దుర్వినియోగం చేసినట్లు విమర్శలు కానీ లేక పోవడం గమనార్హం.  ఎక్కడో దూరపు చుట్టం, వరుసకు సోదరుడు,  వేలు విడచిన బామర్ది రాజకీయాల్లో ఉంటేనే ఈ రోజుల్లో వాళ్ళు హడావిడి, వాళ్ల సంపాదన ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాగే చిన్న చిన్న హీరోలు కూడా బౌన్సర్లను పెట్టుకుని వీర బిల్డప్‌తో చలామణి అవుతోన్న ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా తిరిగే ఏకైక అగ్ర హీరో..   నందమూరి బాలకృష్ణ. వృత్తి, రాజకీయాలు, బాధ్యతతో కూడిన సమాజ సేవ మధ్య స్పష్టమైన సమన్వయంతో ముందుకు సాగుతూ సమకాలీన హీరోల్లో ముందుండే ఒకే ఒక్క పేరు బాలయ్య బాబు. అయితే బాలయ్య బాబు చేత్తో చెంపమీద కొడతారేమో గాని కడుపు మీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతం చెబుతుంటారంటే ఆది ఆయన మంచితనానికి అసలు సిసలు నిదర్శనం.    ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 108వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భగవంత్ కేసరి అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ టాక్ ఆప్ ది టాలీవుడ్‌గా మారింది.  అలాగే బాలయ్య బర్త్ డే జూన్ 10వ తేదీ. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఘనంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణి చేయనున్నారు. అలాగే పేదలకు అన్నదానంతోపాటు ఫ్యాన్స్ రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు.  ఇక బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఒకటైన ‘నరసింహనాయుడు’ చిత్రాన్ని ఆయన జన్మదినం సందర్బంగా 4కె టెక్నాలజీలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల జన్మదినం సందర్భంగా.. వారు నటించిన హిట్ చిత్రాల్లో ఒక చిత్రాన్ని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా మలిచి.. రీ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. ఆ క్రమంలో ‘నరసింహనాయుడు’ చిత్రం విడుదల కానుంది. ఈ నందమూరి నటసింహాన్ని టాలీవుడ్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా పిలుచుకొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో బాలయ్య మరిన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూనే.. ఎమ్మెల్యేగా ప్రజా సేవలో దూసుకుపోవాలని ఆయనకు ఫ్యాన్స్ .. బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

చేరికలు తెలంగాణ బీజేపీకి వాపా.. బలమా?

సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి  ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు అస్సలు పొసగడం లేదు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో  పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమించారు. అసలు బీజేపీలో చేరిన నాటి నుంచీ ఈటలకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరడం లేదని అంటున్నారు.  ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది. వారలా ఖరారు చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు ఈటల వారితో రహస్య భేటీ కావడం.. ఆ భేటీ తరువాత ఈటల స్వయంగా పొంగులేటి, జూపల్లిలు బీజేపీలో చేరే అవకాశం లేదని ప్రకటించడం, అంతటితో ఊరుకోకుండా వారే తనకు బ్రెయిన్ వాష్ చేశారని చెప్పడంతో ఈటల కూడా జంపై పోతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అసలు ఈటల తెరాస నుంచి బయటకు వచ్చేసిన తరువాత.. ఆయనంతట ఆయన రాలేదనుకోండి.. కేసీఆర్ బయటకు పంపారు అది వేరే విషయం. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ శిబిరంలో ఇమడగలరా అన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్త మయ్యాయి. సరే  ఆయన బీజేపీలో చేరడమే కాదు.. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్థిగా రంగంలో  నిలిచి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆ విజయం పూర్తిగా ఈటల వ్యక్తిగత విజయంగా అప్పట్లో పరిశీలకులు అభివర్ణించారు. అయితే ఎలా గెలిచినా ఆ స్థానం బీజేపీ ఖాతాలోనే పడింది అది వేరే సంగతి. ఆ విజయంతో రాష్ట్రంలో ఈటల ఎంత ప్రభావం చూపగలరో బీజేపీ హై కమాండ్ కు బాగా అర్ధమైంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు పొసగకపోయినా.. విభేదాలు పలుమార్లు రచ్చకెక్కినా.. ఈటల ప్రాధాన్యత బీజేపీల ఇసుమంతైనా తగ్గలేదు.  అయితే అప్పటి నుంచీ కూడా బండి, ఈటల మధ్య సమన్వయం కుదిర్చే విషయంలో బీజేపీ హై క మాండ్ మల్లగుల్లాలు పడుతూనే ఉంది.  బండి సంజయ్ ను మార్చాల్సిందేనని బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలు గట్టిగా పట్టుబడుతుండటంతో బీజేపీ అగ్రనాయత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. ఎవరిపైనైనా చర్య తీసుకుంటే.. కర్నాటక ఎన్నికల ముందు రాలినట్లు తెలంగాణ కమలంలో కూడా చాలా రేకలు రాలిపోతాయన్న భయం వారిని పట్టి పీడిస్తోంది.  అందుకే మరోసారి  ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది.  మరి ఈ సారి ఈటలను ఎలా సముదాయిస్తారో చూడాల్సి ఉంది. మొత్తం మీద గెలుపు ధీమా  బీజేపీలో సన్నగిల్లిందనడానికి ఇటీవలి పరిణామాలు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అవినాష్ చేజారిన కడప?!

ఎంపీ అవినాష్ కు కపడ చేజారిపోయిందా? ఆయనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదా? ఒక వేకడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైసీపీ దూరం పెట్టేస్తుందా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. అలా పెట్టకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నుంచి అవినాష్ కే పార్టీ టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు అనుమానమేనని, అనుమానమేమిటి.. ఆయన ఓటమి తథ్యమని అంటున్నాయి. ఇందుకు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే కారణమని చెబుతున్నాయి. అవినాష్ తల్లి అనారోగ్యం పేరుతో కర్నూలు ఆస్పత్రి వద్ద చేసిన హంగామా తరువాత  జిల్లా వ్యాప్తంగా అవినాష్ రెడ్డి ప్రతిష్ట దిగజారిందనీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ టికెట్  విషయమే కారణమని జనం గట్టిగా నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. అవినాష్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న బంధుత్వం. బాబాయ్ వివేకానందరెడ్డితో జగన్ కు ఉన్న విభేదాలు. జగన్ తండ్రి వైఎస్ బతికి ఉన్న సమయంలోనే జగన్ కు కడప ఎంపీ టికెట్ కోసం పంచాయతీ జరిగింది. ఆ సందర్భంగా జగన్ వివేకాతో దురుసుగా ప్రవర్తించిన విషయం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరకూ వెళ్లింది. అదలా ఉంచితే..  వైఎస్ వివేకా మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. బంధుత్వం కారణంగా వివేకాను సొంత పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ జగన్ ఆయనను దూరంగా ఉంచుతూనే వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో వివేకా ఎమ్మెల్సీగా పరాజయం కావడం వెనుక అవినాష్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అవన్నీ పక్కన పెడితే..కడప ఎంపీ సీటు విషయంలో  వివేకా గట్టిగా పట్టుబట్టారనీ, అయితే షర్మిల లేదా తాను పోటీ చేయాలి తప్ప అవినాష్ కు వైసీపీ టికెట్ ఇస్తే సహించేది లేదని కరాఖండీగా చెప్పడంతోనే ఆయన ఎలిమినేషన్ కు కుట్ర జరిగిందని చెబుతారు. జగన్ సోదరి షర్మిల అయితే బాబాయ్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటు విషయంలో గట్టిగా నిలబడ్డారని బహిరంగంగానే చెప్పారు. ఇక సీబీఐ కూడా వివేకా హత్యకు రాజకీయకారణాలున్నాయని విస్పష్టంగా పేర్కొంది. కడప వాసులు కూడా వివేకా హత్య విషయంలో అవినాష్ ప్రమేయం ఉందనే విశ్వసిస్తున్నారు. అందుకే అవినాష్  2024 ఎన్నికలలో అవినాష్ పోటీ చేస్తే ఓడించడం తధ్యం అని చెబుతున్నారు. వైఎస్ కుమారుడిగా జగన్ కు కపడపై ఎంత పట్టు ఉన్నప్పటికీ... వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కఃను కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను మాత్రం కడపవాసులు తప్పుపడుతున్నారు. దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.  

మాగుంట మధ్యంతర బెయిలు రద్దు.. 12న లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

ఊరట దక్కిన ఆనందం రోజులైనా నిలువలేదు.  మాగుంట రాఘవకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.  ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ తన అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదంటూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే అమ్మమ్మ బాత్ రూంలో జారిపడిన కారణంగా బెయిలు మంజూరు చేయడం సబబు కాదని ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమ్మమ్మను రాఘవ ఒక్కరు మాత్రమే చూసుకోవలసిన అవసరం లేదని ఈడీ సుప్రీం కోర్టులో వాదించింది. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న రాఘవ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు  రెండు వారాల మాత్రమే బెయిలు ఇచ్చిందని పేర్కొన్నారు.   అంతే కాకుండా ఒక సారి నాయనమ్మ అనీ, మరో సారి అమ్మమ్మ అనీ, ఇంకో సారి భార్య ఆత్మహత్యా యత్నం చేశారనీ రాఘవ బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదోపవాదాలు విన్న అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా మాగుంట రాఘవ మధ్యంతర బెయిలుపై రెండు రోజుల కిందట విడుదలయ్యారు.  దీంతో ఈ నెల 12న లొంగిపోవాలని రాఘవకు ఆదేశించింది. 

అవినాష్ ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం విచారణ ఎప్పుడంటే?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అవినాష్‌ ప్రధాన కుట్రదారు అని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచారు. అవినాష్‌కు కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి సహాయసహకారాలు అందుతున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ డాక్టర్ సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  ఏపీ సర్కార్ కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే  ముందస్తు బెయిలు విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని  సునీత పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 24 తర్వాత సీబీఐ నాలుగుసార్లు సమన్లు జారీ చేసిందని.. అవినాష్‌ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సునీత పిటిషన్ పై సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ పై వాదనల సందర్భంగా సీబీఐ కీలక అంశాలను వెల్లడించింది. తొలి సారిగా అవినాష్ ను వివేకా హత్య కేసులో నిందితుడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు రద్దు కోసం సునీత పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

సీమలో బాలయ్య యాత్ర

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీమ యాత్రకు రెడీ అవుతున్నారు.   రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలో  ఈ ఏడాది చివరలో ప్రారంభమైయ్యే బాలయ్య యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపురం నియోజకవర్గం రాయలసీమలోనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయనను  ఆ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. సీమలోని మొత్తం అన్ని జిల్లాల్లో బాలయ్య యాత్ర చేసే విధంగా ప్రణాళికలు సిద్దమైనట్లు సమాచారం.  అదీకాక రాయలసీమలో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.. ఆయన నటించిన అన్ని చిత్రాలూ ఇక్కడ రికార్డులు బద్దలు కొట్టిన విషయం విదితమే. అలాంటి రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి.  2019 ఎన్నికల్లో  ముచ్చటగా.. మూడంటే మూడు స్థానాలు మాత్రమే తెలుుదేశం ఖాతాలో పడగా మిగిలిన 49 స్థానాల్లో   జగన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.    ప్రస్తుతం వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నది సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను  పార్టీ వైపునకు.. అదీ కూడా బలంగా తిప్పుకోవాలంటే.. బాలయ్య లాంటి మాస్ క్రేజీ ఉన్న హీరోతో యాత్ర చేస్తే తెలుగుదేశం విజయం  నల్లేరు మీద నడకే అవుతుందన్న విశ్వాసం పార్టీ అధిష్ఠానంల  ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇప్పటికే యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను చుట్టేసి... ప్రస్తుతం సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో సాగుతొంది. ఈ జిల్లాలో లోకేష్ యాత్ర.. మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.  నారా లోకేష్ పాదయాత్రకు.. సీమలోని అన్ని జిల్లాలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్న విషయ విదితమే. ఆ క్రమంలో ఎన్నికలకు ముందు అంటే ఈ ఏడాది చివరలో అంటే.. నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో బాలయ్య బాబు .. సీమలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం.         అయితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని సవారీ తీయించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో పార్టీని గెలిపించి.. అధికారం చేపట్టడం కోసం ఆయన తన చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. అందులోభాగంగా వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో గళం విప్పుతోన్నారు. ఆ క్రమంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆయన నిర్వహిస్తుండగా... వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం విదితమే. అలాగే మీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అటు ప్రజలకు, ఇటు యువతకు భరోసా ఇచ్చేందుకు మరో కార్యక్రమాన్ని సైతం చంద్రబాబు చుట్టనున్నారు. ఓ వైపు నారా లోకేశ్, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇలా తలా వైపు నుంచి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతూ... ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు.  అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్యకృష్ణ, రామకృష్ణలు, నందమూరి సుహాసిని తదితరులు సైతం వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనే అంశంపై తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

వైఎస్ బ్రాండ్ కు అవినాష్ గండం

తెలుగు రాజకీయాలను మ ూడు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఎదుగురి సందింటి రాజశేఖరరెడ్డి వైఎస్ఆర్ గా ప్రసిద్ధులు. 1978లో తొలి సారి అసెంబ్లీ మెట్లు ఎక్కిన రాజశేఖరరెడ్డి అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా  రెండు సార్లు పని చేశారు. తెలుగు రాజకీయాలలో వైఎస్ఆర్ ఒక పెద్ద బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మసక బారింది.   తమ్ముడి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి, తన కొడుకు వైఎస్ జగన్ లు పదవులతో ప్రత్యక్ష  రాజకీయాలలో ఉండగా భార్య వైఎస్ విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలలు రాజకీయాల్లో పని చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరిలో వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ఆర్ మరణానంతరం పులివెందుల అసెంబ్లీ  స్థానం నుంచి గెలుపొంది తదననంతరం కుమారుడు ప్రారంభించిన వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగారు. అనంతర పరిణామాలలో ఆమె ఆ  పదవిని కూడా  త్యాగం చేయాల్సి వచ్చింది.  సెప్టెంబరు 2, 2009న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన తరువాత ఆయన బ్రాండ్ ఇమేజ్ ను వాడుకునేందుకు జగన్ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైసీపీ పేరుతో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జగన్ మరో ఐదేళ్లు వేచి ఉండక తప్పలేదు. ఈ ఐదేళ్లలో వైఎస్ బ్రాండ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు జగన్ కుటుంబం కష్టపడింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ప్రతి గ్రామంలో , ప్రతిపట్టణ, నగర కూడళ్లలో వైఎస్ఆర్ విగ్రహాలు వెలిశాయి. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ విగ్రహాల సంఖ్య 20 వేలు దాటింది.  ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహాత్మాగాంధీ, బీఆర్ అండేడ్కర్, నెహ్రూ వంటి జాతీయ నేతల విగ్రహాల కన్నా చాలా ఎక్కువ. ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకున్న వైఎస్ బ్రాండ్ 2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఒక్క సారిగా పాతాళానికి దిగిపోయింది.  కడప జిల్లాలో వైఎస్ వంశీయుల అనుమతి లేకుండా గాలి కూడా ఒక వైపు నుంచి మరో వైపుకు వీచదు అంటూ చెప్పుకుంటారు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి స్వంత తమ్ముడిని  పులివెందులలో ఆయన స్వంత ఇంట్లో అత్యంత దారుణంగా నరికి చంపడంతో  కడప జిల్లా ఉలిక్కిపడింది. తొలుత వివేకా మరణం గుండెపోటుతో6 జరిగిందన్న అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు వైఎస్ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  వివేకా కూతురు స్వతహాగా డాక్టర్ కావడంతో ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు వైఎస్ కుటుంబం  దగ్గర సమాధానాలు దొరకలేదు. పులివెందులలో వైఎస్ పెద్దయనగా పెరు సంపాదించిన వివేకా హత్యతో అవినాష్ పై కడప వాసులు కోపం పెంచుకున్నారు. గత కొంత కాలంగా హైకోర్టు, సుప్రీం కోర్టు, సీబీఐ ఇంటరాగేషన్ తో వైఎస్ బ్రాండ్ కు బీటలు వారాయి. వైఎస్ విజయలక్ష్మిని పార్టీ నుంచి సాగనంపి, వైఎస్ షర్మిలను తెలంగాణకు పరిమితం చేయడంతో కడప ప్రజలు జగన్ పై గుర్రుగా ఉన్నారు. వివేకా హత్య కేసులో తమ్ముడిని వెనకేసుకు రావడం కూడా కడప వాసులకు నచ్చడం లేదు. ఇప్పటికి 11 సీబీఐ కేసులలో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్ పై ఉన్న సానుభూతి ఇప్పడు కనబడడం లేదు. వైఎస్ కుటుంబ కంచుకోటగా  పేరున్న కడపలోనే బ్రాండ్ డామేజి అవుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడపలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ యువగళం ద్వారా జగన్ పాలనను తూర్పారపడుతున్నారు. ఏది ఏమైనా రాజశేఖరరెడ్డి పెంచుకున్న వైఎస్ బ్రాండ్ కు గడ్డు రోజులు వచ్చాయని చెప్పక తప్పదు. 

మోడీ ఇమేజ్ ముంచేస్తుంది జాగ్రత్త!

బీజేపీ డబుల్ ఇంజిన పవర్ అంటూ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంటే ప్రగతి స్పీడందుకుంటుందని ఊదరగొట్టేస్తోంది. పేరుకు డబుల్ ఇంజిన్ అంటున్నా కేంద్రం ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు మనుగడ సాగిస్తున్నది మోడీ ఇమేజ్ తోనే అని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కర్నాటక ఎన్నికలలో పరాభవం ఎదురయ్యే వరకూ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరికీ మోడీ మ్యాజిక్ పై వీసమెత్తు అనుమానం కూడా రాలేదు. అయితే కర్నాటక ఫలితాల తరువాత ‘మోడీ’ ఇమేజ్ పైనే ఆధారపడి సార్వత్రిక ఎన్నికలకు వెడితే మునిగిపోవడం ఖాయమన్న భయం బీజేపీలో మొదలైంది. ఆ భయం ఆ పార్టీ మెంటార్ ఆర్ఎస్సెస్ వరకూ చేరింది. దీంతో ఇంత కాలం మౌనంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీకి సుద్దులు చెప్పడం మొదలెట్టేసింది. కర్నాటక ఫలితాలను ఉటంకిస్తూ.. కేవలం మోడీ ఇమేజ్ బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కించే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేసింది. కర్నాటక ఫలితాల తరువాత పార్టీలో మోడీ వ్యతిరేక గొంతులు సవరించుకుంటున్నాయి. వాటికి ఆర్ఎస్ఎస్ అండ లభిస్తోందన్న అనుమానాలు కూడా పార్టీలో వ్యక్తమౌతున్నాయి. పార్టీలో మోడీ వ్యతిరేక గళం అనగానే మొదటిగా ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు గడ్కరీ.  ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో  2018లోనే మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ధైర్యంగా పార్టీ పవర్ సెంటర్ నే ప్రశ్నించారు. నాగపూర్ ఆశీస్సులతోనే గడ్కరీ అంత ఘాటు విమర్శలు చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. అయితే అప్పడు గడ్కరీకి ఆర్ఎస్ఎస్ ఏ మాత్రం అండగా నిలవలేదు. కానీ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా అప్పట్లో గట్టిగా గళమెత్తడంతో మోడీకి ఆయనే ప్రత్యామ్నాయమన్న చర్చ కూడా జరిగింది. ఇంతకీ అప్పుడు ఆయన ఏమన్నారంటే.. 2014 ఎన్నికలలో బీజేపీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.  ఎందుకంటే అప్పుడు అధికారంకి రాగలమన్న నమ్మకం బీజేపీలో లేదు. అందుకే ప్రజాకర్షక హామీలను గుమ్మరించేయమని పార్టీ హైకమాండ్ నిర్దేశించింది.  సరే అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు నాడు మేం ఇచ్చిన హామీలను నెరవేర్చమని జనం డిమాండ్ చేస్తున్నారు.  మేం నవ్వి ఊరుకుంటున్నామని అప్పట్లోనే గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నికలలో విజయం కోసమే హామీలిచ్చాం కానీ వాటిని నెరవేర్చాలన్న ఉద్దేశమే లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆ తరువాత ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ఆయన నాగపూర్ సంబంధాలు కూడా దానిని ఆపలేకపోయాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని కూడా కోల్పోయారు. 2019 ఎన్నికలలో కూడా మోడీ ఫేస్ బీజేపీని గెలిపించడంతో పార్టీలో, ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర నామమాత్రమైపోయింది. కేంద్ర మంత్రిగా ఉత్సవ విగ్రహంగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఇప్పడు 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ ఇమేజ్ మసకబారుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ సారి ఆర్ఎస్ఎస్ ఘాటు వ్యాఖ్యలే చేసింది. మోడీ ఇమేజ్ ని మాత్రమే నమ్ముకుంటే మునక ఖాయమని హెచ్చరించింది. బీజేపీ మెంటార్ గా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను డబుల్ ఇంజిన్ లెక్క చేసినా చేయకపోయినా బీజేపీ క్యాడర్ కచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుందన్నది పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలోనే మరోసారి అందరి దృష్టీ గడ్కరీ వైపు మళ్లింది. ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి ఫలితాలు బీజేపీలో మోడీ భవిష్యత్ కు లిట్మస్ టెస్ట్ గా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పు తెలుసుకుని బీజేపీ కనుక తన దారిని మార్చుకుని బీజేపీ లో సమష్టి నాయకత్వానికి పెద్ద పీట వేయడం లోకల్ లీడర్ షిప్  ని డెవలప్ చేయడం కేవలం హిందూత్వనే పట్టుకోకుండా మొత్తంగా ప్రజల కు అవసరం అయిన వాటిని అందిపుచ్చుకుని వాటి మీద పనిచేయడం మొదలు పెట్టాలని సూచించింది. మెంటార్ సూచనలను డబుల్ ఇంజిన్ పట్టించుకుంటుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 

విజయసాయికి చేయడానికి పనేది?

విజయసాయి రెడ్డి.. చాలా కాలం తరువాత అమరావతిలో  వైపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పడు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిల్స్ లోనూ ఓ రేంజ్ లో  చర్చకు తావిచ్చాయి. అంతే కాదు.. విజయసాయి నిజం చెప్పేశారంటూ సోషల్ మీడియాలో ఆయన మాటలు తెగ ట్రోల్ అవుతున్నాయి. ఇంతకీ విజయసాయి కొత్తగా ఏమీ చెప్పలేదు.  రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు ఏం చేప్పారో.. విజయసాయి ఇప్పుడు అదే విషయాన్ని అనుబంధ సంఘాలకు చెప్పారు. నాలుగేళ్లుగా రిలాక్స్ డ్ గా ఉన్నారు. పని చేయకుండా పబ్బం గడిపేసుకున్నారు. ఇక ఈ తొమ్మిది నెలలైనా పని చేయండంటూ విజయసాయి అనుబంధ సంఘాల సమావేశంలో చెప్పారు.  బలే కోయిన్సిడెన్స్ అంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే కాదు.. పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఈ నాలుగేళ్లు అధికారం, పెత్తనం చెలాయించేస్తూ గడిపేశారనీ, ఇక ఎన్నికలకు తొమ్మిది నెలలో మిగిలి ఉండటంతో పని చేయండ అని మంత్రులను సీఎం బతిమలాడుకుంటుంటే.. విజయసాయి తాను ఇన్ చార్జ్ గా ఉన్న పార్టీ అనుబంధ సంఘాలను బతిమలాడుకుంటున్నారు. ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు.. ఇక నుంచి 24 గంటలూ పార్టీ కోసం పని చేయాలని ఆయన వైసీపీ విద్యార్థి, యువత, మహిళా విభాగాలకు దిశా నిర్దేశం చేశారు.   విజయసాయి అంటే ఇటీవల అయితే పార్టీలో అనామకుడిగా మిగిలిపోయారు కానీ, వైసీపీ ఆవిర్బావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన నేత. సలహాదారు అన్న పదవి లేదు కానీ, ప్రస్తుతం సజ్జల అనుభవించిన హోదాను, ఆధిపత్యాన్నీ పార్టీలో విజయసాయి అనుభవించారు. ఆయన మాటే వేదవాక్కుగా పార్టీ పై నుంచి కింది వరకూ అందరూ శిరసావహించేవారు. అలాంటి విజయసాయికి పదవులన్నీ పీకేసి కేవలం అనుబంధ సంఘాల ఇన్ చార్జి పదవిని నామమాత్రంగా మిగిల్చింది పార్టీ. మళ్లీ ఇక్కడ కూడా ఆయన అధికారాలు అంతంత మాత్రమే. పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జ్ లందరూ సజ్జల కంట్రోల్ లో ఉంటారు. ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను ఈ అనుబంధ సంఘాలకు సంబంధం లేకుండా సజ్జల కుమారుడు మానిటర్ చేస్తున్నారు. అంటే అలంకారప్రాయమైన పదవిలో ఉన్న విజయసాయి.. అనుబంధ సంఘాల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు ఇక పని చేయండంటూ దిశానిర్దేశం చేయడం వెనుక ఆయన ఉద్దేశమేమిటని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను సజ్జల కుమారుడి చేతికి పార్టీ అధినేత అప్పగించిన తరువాత పార్టీలో విజయసాయికి పనే లేకుండా పోయింది. ఇంత కాలం ఆయన హస్తినకు పరిమితమై.. మౌనాన్ని ఆశ్రయించారు. చంద్రబాబు జన్మదినానికి ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం, మెడీని పొగుడుతూ పోస్టులు పెట్టడం వినా ఆయన ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కనిపించలేదు కూడా. ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ వర్గాలనే విస్మయపరిచినట్లుంది. చేయడానికి పార్టీలో ఆయనకే ఏ పనీ లేదు.. ఇక ఆయన చెబితే అనుబంధ సంఘాలు వింటాయా? ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వైసీసీ వర్గాలలోనే  వ్యక్తమౌతున్నాయి.  

ఢిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందన్న కోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ ఆకాంక్షలను వదులుకుని మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించినా కుమార్తెకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇసుమంతైనా ఊరట కలిగించలేకపోయారు. బీజేపీ  వ్యతిరేక వ్రతం స్వయంగా భగ్నం చేసుకున్నా.. అందకు ఆయనకు ఆ పార్టీ నుంచి ఫలం దక్కలేదంటూ కేసీఆర్ విమర్శకులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఔను వరుస విచారణలతో ఇక కవిత అరెస్టే తరువాయి అన్న స్థాయి నుంచి అనూహ్యంగా కవితను కనీసం ఈడీ విచారణకు కూడా పిలవకుండా పక్కన పెట్టేసే వరకూ జరిగిన పరిణామాలలో కేసీఆర్ మౌనమే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ గా మారిపోయిందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. రాజకీయంగా ఎంతగా రాజీ పడినా, సర్దుకు పోయినా కేసు కోర్టు వరకూ వెళితే.. లాజికల్ ఎండ్ కు చేరాల్సిందే అన్నట్లుగా తాజాగా హస్తిన మద్యం కుంభకోణంలో కోర్టే ఈ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ  ఈడీ, సీబీఐ ల నుంచి ఇటువంటి ఆరోపణలు వచ్చాయి కానీ.. ఈ సారి    న్యాయమూర్తే ఆధారాలున్నాయని చెప్పడం నిస్సందేహంగా కవితకు పెద్ద షాక్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన  లాభాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం ఆస్తులు కొనుగోలు చేశారనడానికి   ఆధారాలున్నాయని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు విస్పష్టంగా పేర్కొంది నిధులు బదిలీ ,ఆస్తుల క్రయవిక్రయాలు, క్రియేటివ్‌ డెవలపర్స్‌ వాంగ్మూలాలు అన్ని కూడా కవిత ఆదేశాలనుసారమే జరిగినట్లు  కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కోర్టు  పిళ్లై బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో చేసింది.   ఈడీ సమర్పించిన  ఆధారాల మేరకు ఈ కేసులో అరుణ్‌ పిళ్లై ప్రధాన నిందితుడని  కోర్టు స్పష్టం చేసింది.   ఈ సందర్భంగా కవిత ప్రమేయంపై కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇక మద్యం కేసులో కవిత పూర్తిగా ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేశినేని నాని పొగపెట్టుకున్నారా? పెట్టారా?

తెలుగుదేశం పార్టీతో కేశినేని నాని తెగతెంపులు ఖాయమైనట్లే కనిపిస్తున్నాయి. అయితే నాని ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీయే పొమ్మనలేక పొగపెట్టిందా? లేక పార్టీలో తమ్ముడు చిన్ని ఎదుగుదలను ఓర్వలేక తానే పొగపెట్టుకున్నాడా అంటే.. వేళ్లన్నీ కేశినేని నానివైపే చూపుతున్నాయనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ హవాలో సైతం తాను గెలిచానని చెప్పుకుంటున్న నాని.. విజయవాడలో తెలుగుదేశం బలంతోనే తాను విజయం సాధించగలిగానన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో  తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పుకుంటున్న నాని విజయం విషయంలో వ్యక్తం చేస్తున్న ధీమాపై మాత్రం పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాని తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదనీ, అలాగే బెజవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికీ పిలవలేదని అంటున్నారు. తెలుగుదేశం ఎంపీ అయిన కేశినేని నాని ఆహ్వానం అందలేదనడమేమిటన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉన్నట్లు కనిపించడం లేదు. బొట్టు పెట్టి పిలవడానికి ఆ రెండు కార్యక్రమాలూ ఎవరింట్లోనో జరిగిన పెళ్లిళ్లూ, పేరంటాలూ కావు. పార్టీ కార్యక్రమాలు. పార్టీ కార్యక్రమానికి పార్టీ ఎంపీకి ఆహ్వానం ఏమిటి? స్వచ్ఛందంగా వెళ్లి చురుకుగా ఆ కార్యక్రమంలో నిమగ్నం కావాలి. అలా కాకుండా తనకు పార్టీతో ఏం సంబంధం లేదన్నట్లు దూరంగా ఉండి ఆహ్వానం అందలేదంటూ రాగాలు తీయడం ద్వారా ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో చెప్పకనే చెప్పినట్లైంది. గత కొంత కాలంగా అంటే తమ్ముడు చిన్ని పార్టీలో చురుకుగా పాల్గొనడం మొదలెట్టినప్పటి నుంచీ కేశినేని నాని తీరులో తేడా వచ్చింది.  తమ్ముడా, తానా తేల్చుకోవాల్సింది పార్టీయే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక వైసీపీ వత్తాసు ఉందన్న అనుమానాన్ని తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.   ఏది ఏమైనా నాని తీరు వల్ల ఆయన తనంత తానుగా తెలుగుదేశం పార్టీకి దూరం కావాలనే నిర్ణయించుకున్నారన్నది విస్పష్టంగా తేలిపోతోంది. గుర్రాన్ని ఎవరైనా చెరువు వరకూ తీసుకు వెళ్లగలరు కానీ, నీళ్లు తాగించలేరుగా. నాని పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారైంది. పార్టీలో ఉండటం, ఉండకపోవడం ఆయన ఇష్టం. పార్టీ మాత్రం పని చేసే వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాట కేశినేని నానికి కూడా వర్తిస్తుంది.  

ఓ వైపు బిగింపు..మరో వైపు సడలింపు.. అవినాష్ విషయంలో సీబీఐ విచిత్రాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తొలిసారిగా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఆయన ను ఎ8 గా చేర్చింది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై గురువారం (జూన్8) సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా, ఎ8గా పేర్కొంది. అదే సమయంలో అవినాస్ విషయంలో మరో బ్రహ్మాండమైన ట్విస్ట్ వెలుగులోనికి వచ్చింది.  సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, బెయిలుపై విడుదల చేయడం అన్నీ జరిగిపోయాయని బయటకు వచ్చింది.   అయితే ఈ విషయాన్ని అటు అవినాష్ రెడ్డి.. ఇటు సీబీఐ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు.  తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు ముందస్తు బెయిలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెయిలు సందర్భంగానే కోర్టు సీబీఐ  అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలన్న షరతు విధించిన సంగతి విదితమే.   ఆ ప్రకారమే కోర్టు ఆదేశాల మేరకు  విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచికత్తు తీసుకుని విడుదల  చేసింది. ఇదేంటి కోర్టుకు ఇవ్వాల్సిన పూచీకత్తును అవినాష్ సీబీఐకి ఇవ్వడమేంటి? సీబీఐ వాటిని అంగీకరించి విడుదల చేయడమేమిటి? అన్న అనుమానాలు వస్తే అది అమాయకత్వమే. ఎందుకంటే సీబీఐ అవినాష్ విషయంలో గతంలో ఎన్నడూ ఎవరి విషయంలోనూ చూపనంత ఉదారత చూపుతోంది. ఒక వైపు కోర్టుల్లో అవినాష్ వివేకా హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంటూనే.. అరెస్టు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంలేదు.  అవినాష్ అరెస్టు బెయిలుపై విడుదల వ్యవహారం ఎంత రహస్యంగా ఉంచారంటే.. ఈ కేసులో సీబీఐ కంటే చురుకుగా, చొరవగా తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. కేసు ఇంత వరకూ రావడానికి కారణమైన వివేకా కుమార్తె సునీతకు కూడా తెలియలేదు. అందుకే ఆమె అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ శుక్రవారం (జూన్ 9) సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పుడు అవినాష్ ను సీబీఐ అల్ రెడీ అరెస్టు చేసి బెయిపుపై విడుదల చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిలుపై కాకుండా బెయిలును రద్దు చేయాలన్న అంశంపై విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు అవినాష్ ను ఉపయోగం లేని అరెస్టు చేసి బెయిలిచ్చి విడుదల చేసిన సీబీఐ, ఇదే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టులో గట్టిగా వ్యతిరేకించింది.  ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అవినాష్ రెడ్డిని ఎ8గా పేర్కొంది. మరో సారి ఏపీ సీఎం జగన్ పేరునూ ప్రస్తావించింది. తొలి సారిగా అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.   హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో తండ్రీ కొడుకులు భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డీ చాలా కీలకంగా వ్యవహరించారని, కేసు వద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం అవసరంల ేదనీ సీఐ శంకరయ్యకు అవినాష్ గట్టిగా చెప్పారని సీబీఐ ఆ అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐకి ఏం చెప్పొదని దస్తగిరిని బెదరించడంలోనూ, ప్రలోభపెట్టడంలోనూ అవినాష్ పాత్రే కీలకమని స్పష్టం చేసింది.  వివేకా హత్య కేసులో భారీ కుట్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ భాస్కర్ రెడ్డికి బెయిలు ఇవ్వొద్దంటూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది.  భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై సీబీఐ కోర్టు శుక్రవారం (జూన్ 9) తీర్పు వెలువరించనుంది. 

బీఎస్ఎన్ఎల్ నెత్తిన భస్మాసుర హస్తం

ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు. అది కూడా అత్యంత ఖరీదైన వస్తువుగా తెలుసు. అప్పట్లో వీధికి ఒక్క ఫఓన్ మాత్రమే ఉండేది.  గ్రామాలలో పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఇలాంటి సమాచార వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఫోన్ల స్థానంలో మొబైల్ ఫోన్లను తెచ్చాయి. ఇప్పడు ప్రతి ఇంట్లో కనీసం అరడజను ఫోన్లు. టెలికాం విప్లవం మొబైల్ ఫోన్లతో ఆగిపోలేదు.  జనరేషన్ల పేరుతో తన సేవలను పెంచుకుంటూ ఇప్పుడు 5జీగా కొనసాగుతోంది. అలాంటి సమాచార విప్లవంలో భారత ప్రభుత్వం కూడా తన స్వంత సంస్థగా కోటి రూపాయల మూలధనంతో భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ప్రారంభించింది.  ప్రయివేటీకరణలో భాగంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తూ వచ్చిన భారత ప్రభుత్వం క్రమంగా బీఎస్ఎన్ఎల్ ను పక్కన పెట్టేసింది. భారత దేశంలో డిఫఎన్స్, రైల్వేస్ తరువాత అ త్యధిక మంది ఉద్యోగులను, ఆస్తులను కలిగిన బీఎస్ఎన్ఎల్ దివాళా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. చివరికి బీఎస్ఎన్ ఎల్ అభివృద్ధి 3జి దగ్గరే ఆగిపోయింది.  మిగిలిన కార్పొరేట్ టెలికాం సంస్థలు లాభాల బాటలో నడుస్తుంటే భారత ప్రభుత్వంలోని బీఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలో చిక్కుకుంది.  తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ కు 89వేల కోట్ల రూపాయల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది.  దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి.  ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 89 వేల కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీలో పలు కీలక అంశాలపై దేశంలో చర్చ సాగుతోంది.  బీఎస్ఎన్ఎల్ ను పలు రకాలుగా నష్టాలలోకి నెట్టి అప్పడప్పుడూ ప్యాజేపీలు ప్రకటించడాన్ని టెలికాం రంగ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒకటిన్నర శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత టెలికాం రంగానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం మితిమీరిన కార్పొరేట్ పలుకుబడే కారణమని విమర్శలు వస్తున్నాయి.  స్పెక్ట్రం లకు బీఎస్ఎన్ఎల్ ను దూరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడుు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం, వాటిని దొడ్డి దారిన కార్పొరేట్ల చేతుల్లోకి పంపడానికే అని విమర్శలు ఉన్నాయి.  దేశంలో  సుమారు 36శాతం మంది గ్రామీణ ప్రజలు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ బ్రాడ్ బాండ్ లలో అధిక లాభాలు రావు కాబట్టి కార్పొరేట్లు ఆ వైపు చూడటం లేదు.  అయినా బీఎస్ఎన్ఎల్ ఇంత వరకూ 4జి సేవలను పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది.  లాభాలు తెచ్చే సేవలో పోటీ పడే కార్పొరేట్లు దేశంలోేని పేదల కోస నెట్ వర్క్ లు నడపడం లేదు.  సేవల ఏర్పాట్లపై టీసీఎల్ కు 15వేల కోట్లు చెల్లిస్తున్న బీఎస్ఎన్ఎల్, టాటాలను పెంచి పోషిస్తోంది. 4జి సేవల కోసం అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతికను కొర్పొరేట్లు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటే, చైనాపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇక్కడి పారిశ్రామిక వేత్తల నుండే టెక్నాలజీని కొనాల్సి వస్తోంది.  దీంతో సేవలు అంతరాయానికి గురవుతున్నాయి. టెక్నాలజీ కొనుగోళ్ల పేరుతో దేశంలోని కార్పొరేట్లు ఆ డబ్బును కూడా దిగమింగుతున్నారు. దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికీ బీఎన్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 89వేల కోట్ల ప్యాకేజీ అటూ, ఇటూగా తిరిగి దేశీయ కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లబోతోంది అన్నది అక్షర సత్యం.