తెలుగుదేశం గూటికి కమేడియన్ సప్తగిరి
posted on Jun 13, 2023 @ 2:29PM
సినిమాలలో పాపులారిటీ సంపాదించుకుంటే అది రాజకీయ ఎంట్రీకి ఒక షార్ట్ కట్ 2019 ఎన్నికలకు ముందు వరకూ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలన్న ఉత్సాహం ఉత్సుకత చూపిన నటులు చాలా మందే ఉన్నారు. అలా 2019 ఎన్నికల ముందు రాజకీయాలలోకి వచ్చిన వారిలో ప్రముఖంగా ఇద్దరు కమేడియన్లను చెప్పుకోవాలి. వారిలో ఒకరు అలీ అయితే మరొకరు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్. పోసాని కూడా ఉన్నారనుకోండి.. కానీ ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే రాజకీయాలలోకి వచ్చారు. సో ఇక్కడ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలో రాజకీయ ప్రవేశాల జాబితాలోకి ఆయన రారు. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఆయన రాజకీయ ప్రవేశం ఉత్సాహంతో నేల విడిచి సాము చేశారు. వైసీపీ తరఫున ప్రచారంలో నేల విడిచి సాము చేశారు. తన రాజకీయ ప్రవేశానికి బాట పరిచిన సినీ పరిశ్రమపైనే విమర్శలు గుప్పించారు. పరిశ్రమలో అగ్రనటులుగా వెలుగొందుతున్న వారిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా తీవ్ర విమర్శలు చేశారు. సరే ఆయన ఏం చేసినా చివరకు ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. జగన్ కూడా పృధ్వీ శ్రమను గుర్తించారు. ఎస్వీబీసీ పదవి ఇచ్చి సముచిత స్థానమే కల్పించారు. కానీ ఓ వివాదంలో చిక్కుకున్న పృధ్వీని ఆ తరువాత పార్టీ పట్టించుకోలేదు. కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఇచ్చిన పదవినీ ఊడబీకేసింది. ఆ తరువాత పృధ్వి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది. ఎన్నికల ప్రచార
సమయంలో ఆయన సినీ ఇండస్ట్రీపై గుప్పించిన విమర్శల కారణంగా సినిమా అవకాశాలూ కోల్పోయారు. రాజకీయంగా ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోయారు. ఇప్పుడిప్పుడే తేరుకుని మెల్లిమెల్లిగా సినిమాల్లోనూ, టీవీషోల్లోనూ కనబడుతున్నారు. రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అనుకూలంగా గళమెత్తుతున్నారు. ఆ పార్టీలోకి ఆయన ప్రవేశానికి జనసేనాని తలుపులు తెరుస్తారా లేదా అన్నది అనుమానమే.
ఇక అలీ విషయానికి వస్తే ఆయన రాజకీయ అడుగులు వేయడానికి ముందు అన్ని పార్టీలనూ చుట్టేశారు. ఎక్కడ తనకు గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందా అని గాలించారు. చివరకు ఆయనకు వైసీపీలో అయితే తనకు మంచి భవిష్యత్ ఉంటుందని నిర్ణయించుకుని ఆ పార్టీ గూటికి చేరారు. ఇందు కోసం ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇండస్ట్రీలో ఆయనకు అత్యంత ఆత్మీయుడిగా భావించే పవన్ కల్యాణ్ ను దూరం చేసుకున్నారు. అలీ వైకాపా గూటికి చేరిన తరువాత ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో మననుంచి సహాయ సహకారాలు పొందిన వారు కూడా హ్యాండిచ్చారు అని పరోక్షంగా అలీపై వ్యాఖ్యలు చేశారు.
సరే అదలా ఉంచితే.. వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టాలన్న అలీ కల నెరవేరలేదు. పోనీ వక్ఫ్ బోర్డు చైర్మన్, రాజ్యసభ అంటే వేరే ఆశలు పెంచుకున్నా అవీ నెరవేరలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత వందల సంఖ్యలో ఉన్న సలహాదారుల పోస్టులలో ఒక అనామక పోస్టును అలీకి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు జగన్. సరే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. చిరంజీవి వంటి మెగాస్టార్ నుంచి అందరూ తన వద్దకు రావాల్సిందే.. తాను చెప్పింది వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు.
ధియేటర్ల టికెట్ల ధరలు తగ్గించేసి మొత్తం పరిశ్రమ అంతా నువ్వే దిక్కు అని ఆయన వద్దకు వాలిపోయేలా చేసుకున్నారు. దీంతో సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కూడా రాజకీయ ప్రవేశం చేయడానికి ముందుకు రావడానికి వెనుకాడే పరిస్థతి ఏర్పడింది. అందుకే గతంలో పోలిస్తే రాజకీయ ప్రవేశం చేయాలని ఉత్సాహం చూపు నటుల సంఖ్య గనణీయంగా తగ్గింది. పరిశ్రమ నుంచే వచ్చి రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలోకి వచ్చి చేరేందుకు కూడా నటులు జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఒక యువ నటుడు, కమేడియన్, హీరో..తన విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి అలియాస్ సప్తగిరి ప్రసాద్ తన రాజకీయ అరంగేట్రంను ప్రకటించారు. అభివృద్ధి, దార్శనికతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రకటించి త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి పార్టీ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడ నుంచైనా ఎన్నికల బరిలోకి దిగుతానంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులేశాననీ, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాననీ చెప్పిన సప్తగిరి సినిమాలలో ఎలాగైతే నిజాయతీగా, చిత్తశుద్ధితో కష్టపడ్డానో తెలుగుదేశం పార్టీలో కూడా అలాగే చిత్తశుద్ధి, నిజాయితీతో పని చేసి ప్రజాసేవలో నిమగ్నమౌతానని చెబుతున్నారు. మహామహులుగా పేరొందిన సీనియర్ దిగ్గజాలు కూడా రాజకీయాల వైపు చూడడానికి కూడా భయపడుతున్న ఈ సమయంలో ధైర్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలో చేరతానంటూ ముందుకు వచ్చిన సప్తగిరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి.