ఖమ్మం సభకు ప్రియాంక!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో  విజయం సాధించి అధికారంలో  కొనసాగుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో  కేసీఆర్ రాజకీయానికి సంపూర్ణంగా చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీలోని హస్తం పార్టీ నేతల వరకు అంతా ప్రణాళికబద్దంగా పావులు కదుపుతున్నారు.  ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన  ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. అదీకాక ఇదే ఉమ్మడి జిల్లాలోని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు వస్తారని అంటున్నారు. రాహుల్ వచ్చినా రాకున్నా  ప్రియాంకా గాంధీ మాత్రం పక్కాగా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.  ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోభాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఈ నెల 12వ తేదీన ఆమె ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టున్నారని... ఆ క్రమంలో ఖమ్మం వేదికగా జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇదే వేదికపైన .. అదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు   హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.  ఇంకోవైపు జూన్ 11 లేదా 12వ తేదీన ఢిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీ  విజయం కోసం అమలు చేయాల్సిన అంశాలు.. అలాగే ప్రజల్లోకి ఏ ఏ అంశాలు బలంగా తీసుకు వెళ్లాలి తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  తెలంగాణలో   ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియాంక గాంధీ సైతం.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది. ఇక తెలంగాణలో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. అందుకు ఆయన చేపడుతోన్న సభలు, బహిరంగసభకు భారీగా ప్రజలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. అయితే రానున్న తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారనున్నాయనేది సుస్పష్టమని తెలంగాణలోని పోటిలికల్ సర్కిల్‌లో చర్చ అయితే ఇప్పటికే ఊపందుకొంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి దక్షిణాదిలో.. అదీ తెలంగాణలో పాగా వేసి... తమ సత్తా చాటుకోవాలని బీజేపీలోని కాషాయం పార్టీ నేతలు... తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు.  అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితి పాతాళంలోకి పడిపోతోందని తెలిసినా.. తెలంగాణలో మాత్రం అధికారం నిలుపుకుంటామని.. హస్తం పార్టీ అధిష్టానం కలలు కన్నది. కానీ ఆ కలలను... నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లలు చేశారు. దీంతో తమ పార్టీ అధిష్టానం కన్న కలను సాకారం చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని అయితే హస్తం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం సత్తా చాటిన తెలుగుదేశం.. 2019 ఎన్నికల్లో మాత్రం అంతగా సత్తా చాట లేకపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా అవతరించిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ సైతం సూపర్ స్పీడ్‌తో సైకిల్ సవారీ చేస్తుంది. ఆ క్రమంలో 2022 డిసెంబర్‌లో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావ సూపర్ సక్సెస్ అయింది.  ఆ తర్వాత అంటే  2023, జనవరిలో కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ఖమ్మంలో భారీ సభ చేపట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం వేదికగా సభ నిర్వహించి.. సత్తా చాటనుంది. మరి అలాంటి వేళ.. కాషాయం పార్టీ నేతలు సైతం....ఖమ్మం వేదికగా.. సభ నిర్వహించినా నిర్వహించవచ్చుననే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్ చల్ చేస్తోంది.    అన్ని పార్టీలు ఇలా ఖమ్మం వేదికగా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఓటర్లు మాత్రం ఒకే ఒక్క పార్టీకే మేజార్టీ స్థానాలు కట్టబెతారనేది సుస్పష్టం. అలాంటి వేళ.. అదీ ఏ పార్టీ అంటే మాత్రం.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్నది సుస్పష్టం.

రామ రామ.. ఇదేం పని!?

వివాదాలు సృష్టించి సినిమా సక్సెస్ కు బాటలు వేసుకోవడమన్నది కొత్త విషయమేమీ కాదు. ఈ విషయంలో  ఆర్జీవీగా పిలవబడే రామగోపాల్ వర్మ అందరి కంటే రెండాకులు ఎక్కువే చదివాడని అంతా అనుకుంటారు. కానీ ఆదిపురుష్ బృందం తిరుమలలో చేసిన హంగామా చూస్తుంటే.. వారి నుంచి రామ్ గోపాల్ వర్మ ఇంకా నేర్చుకోవాలేమో అనిపించకమానదు.  మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ, సినిమా ఫంక్షన్లలోనూ సినిమావాళ్లు హగ్గులు, కిస్సులూ మామూలే అన్నట్లుగా అయిపోయాయి. వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సీరియస్ గా తీసుకోరు. కానీ ఎంత సినిమావాళ్లైనా వాళ్లు ఉన్నది ఎక్కడ, చేస్తున్నది ఏమిటి అన్న విచక్షణ ఉండాలి. ఉద్దేశ పూర్వకంగా వివాదం చేయడానికి జరిగిందో కాదో చెప్పలేము కానీ తిరుమలలో ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్, ఆ సినిమాలో సీత పాత్రధారిణి కృతి సనన్ ల ఆలింగనాలు, చుంబనాల వ్యవహారం అందరి విమర్శలనూ ఎదుర్కొంటోంది. తీసిందేమో రాముడి సినిమా.. ఉన్నదేమో కలియుగ వైకుంఠం అయిన తిరుమలో. అటువంటి చోట పవిత్రతకు, ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చి ఆలింగనాలు, చుంబనాలతో రెచ్చిపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. సినిమా ప్రచారానికి ఇంకా చాలా మార్గాలున్నా ఇలాంటి జుగుప్సాకర, అభ్యంతరకర మార్గాన్ని ఎంచుకోవడాన్ని సర్వులూ తప్పుపడుతున్నారు.  వారు వ్యవహరించిన తీరు హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయంటున్నారు. హిందూ సంఘాలు క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి దర్శకుడినా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలు కురిపించారంటూ ఆయనపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో రాముడి ఔన్నత్యాన్ని ఎలా చూపారు? సినిమా ఎలా ఉంది అన్నది ఆ సినిమా విడుదలైతే తప్ప తెలిసే అవకాశం లేదు. కానీ అంతకంటే ముందే  తిరుమల కొండపై తమ విన్యాసాల ద్వారా వారికి తమ సినిమా వ్యాపారం తప్ప శ్రీరామ చంద్రుడిపై కానీ, తిరుమలేశునిపై కానీ గౌరవం, భక్తి లేవని విస్పష్టంగా చెప్పేశారని జనం దుయ్యబడుతున్నారు. రాముడి సినిమా తీసేస్తే గొప్పవారు అయిపోరనీ, కనీస సంస్కారం ఉండాలని అంటున్నారు.  భక్తి సినిమాలో చూపించేసి మీ భుజాలు మీరు చరిచేసుకుని కాలరెగరేస్తే ఊరుకోమని  హిందుత్వ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.  ఇక  నెటిజన్లు కూడా ఆదిపురుష్ డైరెక్టర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

లోకేష్ డిక్లరేషన్ కు సీమ ఫిదా!

విశ్వాసం పట్టుదల కలగలిసి సాగుతున్న నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలనూ చుట్టేసింది. మరో మూడు నాలుగు రోజులలో  సీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి అవుతుంది. అధికార వైసీపీకి పెట్టని కోటగా చెప్పుకునే సీమలో జనం లోకేష్ కు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే.. సీమలో రాజకీయం మారుతోందన్నది స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  తెలుగు దేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  విశ్వాసం ఊపిరిగా  పట్టుదల శ్వాసగా సాగిస్తున్న యువగళం పాదయాత్ర  బుధవారం ( జూన్ 7) 119 రోజులు పూర్తి చేసుకుంది.   ఈ క్రమంలో ఆయన సీమ జిల్లాల్లో  42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. పాదయాత్ర చేశారు.  ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర, అప్రతిహాతంగా, అశేష జనాదరణతో సాగుతోందనడంలో సందేహం లేదు. యాత్రను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ జీవో 1 సహా అనేకానేక అడ్డంకులు సృష్టించింది. ప్రచార రథాలను సీజ్ చేసింది. మాట్లేడేందుకు మైకు లేకుండా లాగేసుకుంది. నిలుచున్న స్టూల్ ను సైతం లాగేసింది. దాడులయత్నాలు జరిగాయి. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయి. ఇక పోలీసుల ఓవరేక్షన్ గురించి చెప్పనే అవసరం లేదు. అయితే ఎక్కడా లోకేష్ ఆగలేదు.. వెనకడుగు వేయలేదు.   వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక, దుర్మార్గ పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు  ముఖ్యంగా యువతకు వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో.. గత తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పోలిస్తే జగన్ చెబుతున్న సంక్షేమంలోని డొల్ల తనాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలా జనం బలంతో, జనం ఆదరణతో సాగుతున్న లోకేష్ పాదయాత్ర సీమ జిల్లాలను చుట్టేసింది. కడపలో అయితే జగన్ పునాదులు కదిలిపోతున్నాయా అన్నట్లుగా జనం లోకేష్ కు స్వాగతం పలికేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు పోటెత్తారు.  పాదయాత్రలో లోకేష్ తొలి అడుగు పడక ముందే చిత్తూరు జిల్లాలో  ప్రచార రథం. మైకు, సౌండ్ సిస్టం ఇతర ప్రసార సాధనాలు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి తంబళ్ళపల్లి మధ్యలో సగటున ప్రతి 20 కిలోమీటర్లకు  ఒక కేసు పెట్టారు.  అయినా లోకేష్  ముందడుగేశారు. వేస్తూనే ఉన్నారు. అంతే కాదు, పాద యాత్రతో పాటుగా లోకేష్ ఎక్కడి కక్కడ వివిద వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశ మవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారు. వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే, ప్రజలు తమ ముందుంచిన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా  సహా ప్రజల ముందుంచుతున్నారు. చర్చకు సిద్దమని సవాలు విసురుతున్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన సంస్థలు, అన్న కాంటీన్ల ముందు సెల్ఫీలు దిగుతూ ...జగన్ రెడ్డి సర్కార్ కు సెల్ఫి సవాళ్ళు విసురుతున్నారు.  దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు  పరుగెడుతున్నాయి. అందుకే యాత్ర ప్రారంభంలో అవహేళన చేసిన వైసేపీ నాయకులు, ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.జన ప్రభంజనమై సాగుతున్న యువగళం గర్జనలకు భీతిల్లి పోతున్నారు. అన్నిటికీ మించి కడప నడిబొడ్డున  కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద మిషన్ రాయలసీమపై నిర్వహించిన సదస్సు  నిజంగా చాలా చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ సదస్సుకు రాయలసీమ నలుమూలల నుంచి  మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు. అందరి సమక్షంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన లోకేష్ మేధావుల మన్నన పొందారు. సీమ ప్రగతి కోసం లోకేష్ ప్రకటించిన డిక్లరేషన్ చిత్తశుద్ధితో అమలు చేస్తే సీమ అభివృద్ధి ఖాయమని, వెనకబాటు తనం మటుమాయమౌతుందని వారు అంటున్నారు. అమలు విషయంలో సందేహాలు అనవసరమనీ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సీమ రూపురేఖలు మార్చేస్తామని చెప్పిన లోకేష్.. ఇందు కోసం అవసరమైతే తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడేందుకైనా తను సిద్ధమని ప్రకటించారు.   కర్నూలు జిల్లాలో వ్యవసాయ పరికరాల తయారీ హబ్, బెంగళూరు – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కేంద్ర బిందువుగా కర్నూలును మార్చి పరిశ్రమల్ని ఆకర్షించడం అలాగే వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువుగా కర్నూలును మార్చడం,  జాతీయ, అంతర్జాకీయ క్రీడాకారులను తీర్చి దిద్దే స్పోర్ట్స్ యూనివర్శిటీ హబ్‌గా కడప ,  ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా చిత్తూరు,  అనంతపురం నుంచి ఆటోమోబైల్ తయారీ రంగం హబ్‌ వంటివి లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ లో ఉన్నాయి.  అలాగే  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి,  ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం వంటివి కూడా లోకేష్ డిక్లరేషన్ లో ఉన్నాయి. 

తెలంగాణా ఊపిరి పీల్చుకో ప్రియాంక వస్తున్నారు!

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి సినిమాలో  ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు దాదాపుగా ఇలాంటి డైలాగ్ నే నినాదంగా మార్చుకున్నారు. తెలంగాణా ఊపిరి పీల్చుకో.. సోనియమ్మ బిడ్డ వస్తోంది. ప్రియాంక గాంధీ వస్తోంది అంటున్నారు. హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ  ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు  వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ బాగా బలోపేతం అయ్యింది. ఆ రెండు రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం ఖాయమన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తమౌతోంది. రాజస్థాన్ లోనూ పార్టీ బలంగా ఉన్నా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్న, మాజీ ఉపముఖ్యమంత్రి రాజేష్ పైలట్ మధ్య విభేదాలు ఆ పార్టీని ఒకింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అదలా ఉంచితే.. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం ఇంకా బకాయిపడే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న భావన అధిష్ఠానంలో ఉంది. అందుకే ఈ సారి  తెలంగాణపై కాంగ్రెైస్ హై కమాండ్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.   రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందు కోసం ఆమె ఉత్తర ప్రదేశ్ బాధ్యతల నుంచి  వైదొలిగారు.  ఇక నేడో రేపో ఆయన తెలంగాణ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొంత కాలం నుంచీ ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తన నాయనమ్మ ఇందిరాగాంధీ లాగే రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారన్న వార్తలు కూడా పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలన్నీ ఇటీవల కాలంలో ఆమె వద్దకే వెడుతున్నాయి. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడకుండా కట్టడి చేయడంలోనూ.. తన అసమ్మతిని, అసంతృప్తిని పక్కన పెట్టి టీపీసీసీ చీఫ్ తో కలిసి పని చేసేలా ఒప్పించడంలోనూ ప్రియాంక గాంధీ పాత్ర కీలకంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇటీవల కొద్ది రోజుల కిందటే రాష్టరానికి వచ్చిన ప్రియాంక గాంధీ స్వల్ప వ్యవధిలోనే అంటే ఈ 9, 10 తేదీలలో ప్రియాంకా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర నేతలకు సమాచారం అందిందనీ చెబుతున్నారు. అంతే కాకుండా ఈ నేలాఖరులో లేదా జులై మొదటి వారంలో ప్రియాంక తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయనీ చెబుతున్నారు. అన్నిటికీ మించి ఒకటి రెండు రోజులలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో భేటీ కానున్న ప్రియాంక ఈ భేటీలో  పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించి.. వచ్చే ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో ప్రియాంక చురుకుగా వ్యవహరిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలలో వేరే లెవెల్ లో ఉంటుందని పార్టీ నాయకత్వం గట్టిగా చెబుతోంది. త్వరలో తెలంగాణ బాధ్యతలను ఆమె అధికారికంగా చేపట్టనున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె అనధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారనీ, పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే తమ సమస్యలను నేరుగా ప్రియాంక దృష్టికే తీసుకువెడుతున్నారని చెబుతున్నారు.  ఇక అమె పూర్తి సమయం తెలంగాణపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అవుతుందన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. 

బాబు వస్తేనే బాగు

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. సంబురాలు చేసుకుంటోంది. మరి  అవశేషఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి?  ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది. అవశేషా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సెక్రటేరియట్  నిర్మించుకోవడం కాదు.. అసలు రాజధానే లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రభుత్వం, ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజదాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి  ప్రభుత్వం అటకెక్కించింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచన పేరుతో  అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా  రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో నాలుగేళ్ళు గడిచిపోయాయి.  సెక్రటేరియట్ కాదు, అసలు రాజధానే లేని రాష్ట్రంగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది.  మరోవంక, నిధులు,  నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగణ రాష్ట్రం ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అందులో ఏమి మతలబుంది, ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన  పెడితే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంది. పంటలు పెంచుకుంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మరోవంక అవశేష ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం   ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతానికిపైగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి, రెండు రాష్త్రాల మధ్య ఎంత తక్కువ పోలిక తెస్తే, ఏపీ ఆబోరు ఆమేరకు మిగులుతుంది.  ఇలా తొమ్మిదేళ్లలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని విషయాల్లోనూ వెనకబడిన రాష్ట్రంగా మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నాటిన ఐటీ విత్తనాలు ఇప్పుడు మహా వృక్షాలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంఐటీ రంగంలో దూసుకు పోతోంది. అనేక దిగ్గజ  సంస్థలు హైదరాబాద్ లో  తమ సంస్థలు తెరిచాయి. ఫలితంగా, తెలంగాణ రాష్త్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగంలో 31.44 శాతం అభివృద్ధి సాధించింది. తెలంగాణలో ఐటీఎగుమతులు రూ3904.55 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  బుధవారం(జూన్ 7)  సగర్వంగా ప్రకటించారు. మరి ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇక్కడ అదే కథ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారి పోయింది. రాష్ట్రం ఐటీ అంటే మీటలు నొక్కడమే అనుకునే  పాలకుల పాలైంది.  అందుకే ఏపీలో ఐటీ శాఖ ఒకటుందని, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారని ఆయన  పేరు గుడివాడ అమరనాద్ అని  చాలా మందికి తెలియదు. అమర్నాథ్   మాటకు ముందొకసారి. వెనకోకసారి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్తోత్రం చదువుతారు.  అన్ని విషయాలు మాట్లాడతారు, కాన , ఐటీ .. అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగవద్దని తప్పుకుంటారు.  నిజమే కావచ్చును.. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా అదే అన్యాయాన్ని కొనసాగిస్తోంది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్  అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అంతకు ముందు   ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానాన్ని దారి మళ్ళించారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారం కలబోసి అభివృద్ధిని అటకెక్కించారు.   ఈరోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు  అనుకునే దయనీయ స్థితికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అందుకే  రాజకీయ విశ్లేషకులు, మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుదు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన తెచ్చుకోవడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు.

జగన్ లో ఎన్నికల భయం

నిండా మునిగిన వాడికి చలేమిటంటారు. అయితే ఈ నానుడి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తున్నట్లు లేదు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఎన్నికల భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మాటల్లో ఈ విషయం  తేటతెల్లమైంది. గడపగడపకూ వైఫల్యంపై మంత్రులపై ఆగ్రహం లేదు. టికెట్ ఇవ్వబోనన్న హెచ్చరికల్లేవు. పని తీరుపై సమీక్షలు లేవు. ఇవేమీ లేకపోగా బాబ్బాబు ఓ తొమ్మిది నెలలు కష్టపడి పని చేయడం చాలు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామన్న వినతులు, విజ్ణప్తులే కనిపించాయి. ఇక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే 2019 ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే కొత్తగా 2024 ఎన్నికల ముందు మరోసారి వల్లెవేయడం వినా మరో కొత్త వ్యూహాలు కానీ, కార్యాచరణ ప్రణాళికలు కానీ ఉన్నట్లు కనిపించలేదు. ప్రభుత్వ వ్యవహారాలు, రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించే సమయమే కరవైన జగన్ కు  ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వినా మరో గత్యంతరం లేదన్న విశ్లేషణలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తాయి. అసలు బుధవారం (జూన్ 7) నాటి కేబినెట్ భేటీ ముందస్తు ప్రకటన కోసమేనని కూడా ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాజకీయ పరిశీలకులు కూడా ముందస్తే జగన్ కు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం అన్న రీతిలో విశ్లేషణలు చేశారు. అసలు ముందస్తు ముచ్చట తీసుకు వచ్చింది కూడా స్వయంగా జగనేనని తెలిసిందే. అలాగే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎప్పటికప్పుడు ముందస్తు ముచ్చటను సజీవంగా ఉంచడంలో తన వంతు ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయన నోటితోనే జగన్ ముందస్తు యోచనలో ఉన్నారని కూడా చెప్పారు. సరే వీటన్నిటినీ పక్కన పెడితే ఇటీవల హస్తిన పర్యటనకు వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అర్ధరాత్రి భేటీ తరువాత.. అక్కడి నుంచే కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేయడంతో ఇక ముందస్తే అని అంతా భావించారు. అయితే వారం రోజుల వ్యవధిలో అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.   ముందస్తుకు వెడితే ముందే మునిగిపోవడం ఖాయమన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. ముందస్తైనా కాకున్న మునక ఖాయమని తేలిపోయిన తరువాత ముందుగా అధికారం కోల్పోవడమెందుకన్న భావనతోనే ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు గడపగడపకూ ఉద్దేశమే చేసిన పనులు చెప్పుకుని విపక్షానికి ఎన్నికల ప్రిపరేషన్ కు సమయం లేకుండా చేసి ముందస్తుకు వెళ్లడమే. అయితే గడపగడపకులో వెల్లువెత్తిన నిరసన సెగలు, పార్టీలో రోజురోజుకూ తీవ్రమౌతున్న అసంతృప్తి చూసిన తరువాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా మొదటికే మోసం తప్పదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే జగన్  కూడా ముందస్తు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేయాలని ప్రణాళికలు కూడా రచించారు. ఇందుకు హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లకుంటే రాష్ట్రంలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు..   మోడీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి మొత్తానికే మోసం వస్తుందన్న భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు కూడా ముందస్తు తథ్యమనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే అనూహ్యంగా ముందస్తు విషయంలో జగన్ వెనకడుగు వేశారు. ఇందుకు ఓటమి భయమే కారణమని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  రాజమహేంద్రవరం మహానాడులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడంతో.. జగన్ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవడం అన్న విషయంలో మైండ్ బ్లాంక్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకపోవడంతో  జనం కూడా ఫిక్సైపోయారనీ, ఓటమి తప్పించుకోవాలంటే.. మిగిలిన తొమ్మిది నెలల కాలంలో  జగన్ సర్కార్ అద్భుతాలు చేయాల్సి ఉంటుందని జగన్ నియమించుకున్న ఐప్యాక్ సర్వేలే తేటతెల్లం చేయడంతో జగన్ ముందస్తు విషయంలో వెనక్కు తగ్గారని అంటున్నారు. ముందస్తుగా అధికారం కోల్పోవడమెందుకు చివరి వరకూ అధికారంలో ఉండి ఈ తొమ్మది నెలల కాలంలో మళ్లీ ఉచితాలు, వాగ్దానాలతో ప్రజలను మరోసారి మాయ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఎవరేమన్నా ఏమనుకున్న పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. అటు మోడీ ప్రభుత్వ యాంటీ ఇంకంబెన్సీ కూడా తోడై జగన్ పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో  జగన్ ముందస్తు యోచన చేసినా ముందస్తైనా వెనకస్తైనా ఫలితం ఒకటే కదా.. అన్న భావనతో జగన్ వెనకడుగు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేసీఆర్ కు బాబు భయం?

తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నసభలకు జనం పోటెత్తుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదనే విషయం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్ధమైంది.   ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోరు పెంచేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన చర్చ సాగుతోంది.   ఓ వేళ కేసీఆర్.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే.. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు తెలంగాణలో  తన ప్రతాపాన్ని ప్రదర్శించడమే కాకుండా..  అటు కాంగ్రెస్ కు లేదా     ఇటు బీజేపీకి కానీ మద్దతు ఇస్తే.. భారీగా ఓట్లు చీలిపోయే ప్రమాదం  ఉందని.. ఇఅదే జరిగితే కారు టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. దీంతో  సైలెంట్‌గా ఉండి.. తెలంగాణలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకొంటే.. ఆ తర్వాత  సంగతి తరువాత చూసుకోవచ్చుననే  ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో  హల్‌చల్ చేస్తున్నది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైనా,  ఆ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కూడా కారణం అదేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు. అయితే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టకపోవడం వెనుక పెద్ద తతంగమే ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది.  ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సొంతంగా... పలు సర్వేలు  చేయించుకొన్నారని.. ఆ వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే.. వచ్చే అనుకూల ఫలితాల కంటే.. తెలంగాణలో ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారం కూడా చేజారే అవకాశాలు మెండుగా ఉన్నాయని... అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్... ఆంధ్రులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ఇంకా వారి మనస్సు పొరల్లో భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో  బీఆర్ఎస్ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సదరు నివేదికలు క్లియర్‌కట్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు రాష్ట్ర విభజనతో రాజధాని హైదరాబాద్‌ని ఆంధ్రులు కోల్పోయారని.. ఆ సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారని.. అంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయని.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఆ తర్వాత.. ఆయన ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించడంతో.. రాజధాని అమరావతిని సైతం కోల్పోయిన పరిస్థితికి దాదాపుగా వచ్చేశామని.. దీంతో రాష్ట్ర విభజనకే కాదు. గత ఎన్నికల్లో వైయస్ జగన్‌ గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు పాత్ర పోషించారని... ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సైతం వ్యక్తమవుతోందనే చర్చ సైతం సదరు సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అటువంటి వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసి.. ఆ తర్వాత ఎప్పటిలాగా లోక్‌సభ ఎన్నికలపై దృషి సారించే అవకాశాలు ఉన్నాయని కారు పార్టీలో ఓ ముచ్చట అయితే ముచ్చటగా సాగుతోంది.

ఆల్ ఫ్రీ.. బట్ కండీషన్స్ అప్లై !

ఆయన ఏమన్నారు? ఇలా ప్రమాణ స్వీకారం  చేయడం, అలా ఫైవ్ గ్యారెంటీలకు పచ్చ జెండా ఊపడం, అని కదా, అన్నారు. అవును, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ప్రతి సభలో  అక్షరం పొల్లుపోకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే  తొలి మంత్రి వర్గ భేటీలోనే ఐదు గ్యారెంటీల అమలుకు పచ్చ జెండా ఊపుతామని కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ  ఏమి జరిగింది. ఏమి జరుగుతోంది.  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనో మరో అనామక నేతో కాదు. ఏకంగా పార్టీ అగ్రనేత, కీలక నేత, పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. రాహుల్ గాంధీ నిర్ణయించిన ఉమ్మడి  ముహూర్తం పక్కన పెట్టేసింది. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ముహూర్తం నిర్ణయించింది. అయినా తొందరేముంది, ఐదేళ్ళు సమయం వుంది.  అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెపుతున్నాం కదా..  ఇంకేం కావాలని, దబాయింపులు మొదలు పెట్టింది. ఐదింటిలో ఒకే ఒక్కటి ‘శక్తి’ పథకానికి మాత్రమే  తొలి నెలలో (జూన్ 11) పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించింది. అయితే ఆ ఒక్క పథకం విషయంలోనూ  కండీషన్స్ అప్లై  అంటూ, కొర్రీలు పెట్టింది సిద్దరామయ్య సర్కార్. ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళు.. ఎక్కడి కెళ్ళినా మహిళలలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పడు ఫ్రీ యే  కానీ.. అన్ని బస్సుల్లో కాదు.. ఓన్లీ   ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు (ఎర్ర’)బస్సుల్లో మాత్రమే ఫ్రీ.. అని మెలిక పెట్టింది. అంతే కాదు  ఈప్రయోజనం పొందాలంటే సేవ సింధు రిజిస్ట్రేషన్ అవసరమని, అందుకు అదార్, రేషన్ కార్డు ఇంకా అనేక ఇతర గుర్తింపు కార్డులు కావాలని కొత్త షరతు విధించారు. అలాగే  భవిష్యత్ లో మరిన్ని మెలికలు పెట్టేందుకు వీలుగా ఆదాయ  పరిమితులు ఇతరత్రా షరతులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి ఇంకా ఇతర కారణాలు లేవని కాదు ఉన్నాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్  లెక్కలను కూడా తప్పు చేస్తూ కాంగ్రెస్ పార్టీ   భారీ మెజారిటీ తో గెలవడానికి మాత్రం ఆ ఐదు గ్యారెంటీలే కారణం. అందులో సందేహం లేదు. అయితే అంతటి భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య...ఇప్పుడు తీరిగ్గా ఆ ఐదు పథకాల అమలును వాయిదా వేయడమే కాదు  పథకాలకు కోతలు పెడుతున్నారు.  ముఖ్యంగా అన్నివర్గాల ప్రజలను హస్తం గుర్తుకు ఓట్లు గుద్దేలా చేసిన ఫ్రీ పవర్ ప్రామిస్ (ఉచిత విద్యుత్ హామీ) విషయాన్నే తీసుకుంటే  ఆ పథకం రాహుల గాంధీ వాగ్దానం చేసిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ఆగష్టు నుంచి మొదలవుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. అంతే కాదు  ఎన్నికల  ప్రచార సమయంలో గృహ జ్యోతి పథకం పరిధిలో 200 యూనిట్ల వరకు ముఖ్యమంత్రి సహా అందరికీ ఫ్రీ అని స్వయంగా సిద్దరామయ్యే ప్రకటించారు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఉత్తర్వులలో  అందరికీ  200 యూనిట్లు ఉచితం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత సగటు వినియోగానికి అదనంగా మరో పది శాతం వినియోగం వరకు మాత్రమే ఉచితం ఆపైన, ఎంత ఎక్కువ వాడుకుంటే అంతకు చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఒక కుటుంబం 70 యూనిట్లు వినియిస్తుంటే, ఆగష్టు తర్వాత ఆ కుటుంబం 77 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ఆపైన  ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించుకున్నా అదనపు వినియోగం వాగ్దానం చేసిన 200 యూనిట్ల లోపలే ఉన్నా, ఆ అదనపు వినియోగానికి బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ మరో కొస మెరుపు ఏమంటే ఉచిత  విద్యుత్ ఆగష్టు నుంచి అమలవుతుంది కానీ అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ( యూనిట్ కు రూ.2.89)   విద్యుత్ చార్జీలు మాత్రం వెంటనే  అమలులోకి వచ్చాయి. ఇదలా ఉంటే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే సేవ సింధు పోర్టల్లో ఎన్రోల్ కావాలని విధ్యత్ శాఖ మంత్రి ప్రకటించారు. నిజానికి మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రామిస్ చేసిన శక్తి పథకం, అలాగే ఉచిత్ విద్యుత్ పథకం అదే విధంగా ఇతర పథకాలు అన్నిటికీ  కూడా  సేవా సిందు పోర్టల్ లో ఎన్రోల్ తప్పనిసరి చేశారు. అయితే సేవాసిందు పోర్టల్ రిజిస్ట్రేషన్  తప్పనిసరి చేయడంతో పథకం ప్రయోజనాలు పేద ప్రజలకు అందకుండా పోతాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఈ ఐదు పథకాలు కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించదమే కాదు, రానున్న రోజుల్లో తెలంగాణ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ హస్తం పార్టీని అందలం ఎక్కిస్తాయని లెక్కలు వేస్తున్నారు. అయితే, కర్ణాటకలో ఈ పథకాలకు బ్రేకులు పడితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉంటుందని అంటున్నారు.

స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము

ప్రపంచములోనే అత్యంత సుందరమైన దేశాలలో స్కాట్లాండ్ ఒకటి. బ్రిటన్ లో ఉన్నవారికి మాత్రమే కాకుండా ఐరోపా మరియు ఇతర దేశాల వారికి అదొక యాత్రాస్థలం.  స్కాట్లాండ్ లో జులై 9 న మొట్టమొదటిసారి ఒక గొప్ప అష్టావధానమును తలపెట్టి, ఆ కార్యక్రమములో తెలుగు ఔత్సాహికులు (ప్రసాద్ మంగళంపల్లి, రంజిత్ నాగుబండి, శైలజ గంటి, సాయికుమారి దొడ్డ, హిమబిందు జయంతి, విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిలేష్ వడ్డిపర్తి, పండరి జైన్ పొలిశెట్టి, మమత వుసికల, అనంత రామానంద్ గార్లపాటి, సత్య శ్యాం జయంతి, నిరంజన్ నూక) ఇలా 12 మంది  పృచ్ఛకులుగా పాల్గొనబోతున్నారు. అవధానిగా త్రిభాషా మహాసహస్రావధాని, శ్రీ ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ “వడ్డిపర్తి పద్మాకర్” గారు వ్యవహరించబోతున్నారు. ప్రార్థనా గేయాన్ని స్కాట్లాండ్ లో గాయకుడుగా ప్రఖ్యాతి చెందినటువంటి బాలుడు అనీష్ కందాడ ఆలపించబోతున్నాదు.  ఈ కార్యక్రమ నిర్వాహకులైన శ్రీ విజయ్ కుమార్ రాజు గారు అందరినీ రాజధాని ఎడింబర్ఘ్ కు ఆహ్వానిస్తున్నారు. అవధాని మరియు పృచ్ఛకుల మధ్యన జరుగబోతున్న ఈ ఆసక్తికరమైన, రసవత్తరమైన సాహితీ ప్రక్రియను జరుపుటకు ఎడింబర్ఘ్ హిందూ మందిర్ నందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అంతే కాకుండా రోజంతా మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు (ప్రవచనాలు, ధర్మ సందేహాలు, భోజన ప్రసాదం, పాదపూజలు) నిర్వహించబడుతున్నాయి. మరిన్ని విశేషాలకొరకు ఆహ్వాన పత్రికను చూడగలరు. ప్రత్యక్ష ప్రసారాన్ని అనేక వెబ్ సైట్ల ద్వారా చేయడానికి సన్నాహాకాలు జరుగుతున్నట్లు కార్యనిర్వాహకులు చెబుతున్నారు.  కావున అందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆధ్యాత్మికత యందు  మునిగి తేలాలని ఆశిద్దాం. 

ప్రభాస్ ను రాముడిగా అంగీకరిస్తారా?

సీటు వదులుతారు సరే.. ప్రభాస్  రాముడంటే హనుమంతుడు నమ్మాలిగా! శ్రీరాముడు అనగానే మన తెలుగువారికి, అందునా సినీ ప్రియులకు ముందుగా నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారు. అంతలా శ్రీరాముడి పాత్రలో పరకాయప్రవేశం చేశారు ఎన్టీఆర్. ఆయన సుందర రూపం, సుమధుర స్వరం ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాముడంటే ఇలాగే ఉంటాడు అనుకునేలా చేశాయి. మనకు రాముడంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు రావడం ఎంత సహజమో.. నీలి వర్ణంలో మీసాలు గడ్డాలు లేని సుందర రూపంలో ఉన్న రాముని ముఖం కళ్ళముందు కదలాడటం కూడా అంతే సహజం. రాముడి రూపం ఇలాగే ఉంటుందని మన హృదయాల్లో బలమైన ముద్ర పడిపోయింది. అందుకే ఎన్టీఆర్ అనే కాదు.. రాముని పాత్ర ఎవరు పోషించినా మీసాలు గడ్డాలు లేకుండా నీలి వర్ణంలో సాధ్యమైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించారు. అయితే వారెవరూ ఎన్టీఆర్ని మైమరిపించలేకపోయారు. అలా అని వారు వేషధారణ విషయంలో విమర్శలు ఎదుర్కోలేదు. కానీ మొదటిసారి ఆ విమర్శలకు ఆస్కారం ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ ఆరడుగుల అందగాడు. అయితే ఆరడుగులు ఉండి, అందంగా ఉన్నంత మాత్రాన శ్రీరాముడు అయిపోరు. ఆహార్యంలో, వాచకంలో, ఆంగికంలో అణువణువునా రాముడు కనిపించాలి. ప్రభాస్, శ్రీరాముడి పాత్ర పోషించిన 'ఆదిపురుష్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆ మూవీ ట్రైలర్స్ చూస్తుంటే నిజంగా ప్రభాస్, శ్రీరాముడి పాత్రే పోషించాడా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఆయన మీసాలు, గడ్డాలతో ఓ రాజులా, ఓ యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రజలు రాముడిని రాజుగా కంటే దేవుడిగా చూడటానికే ఇష్టపడతారు. ఈ భూమ్మీద రాముడంత అందంగా మరెవరూ ఉండరనే భావన చాలామందిలో ఉంది. అదే ప్రభాస్ పాలిట శాపంగా మారింది. ట్రైలర్స్ లో చూస్తుంటే ఏదో బాహుబలి సెట్స్ నుంచి డైరెక్ట్ గా ఆదిపురుష్ సెట్స్ కి వచ్చి.. కాస్ట్యూమ్ మార్చుకొని విల్లు పట్టుకున్నట్టుగా ఉంది కానీ, రాముడి రూపంలో కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించట్లేదు. పైగా డైలాగ్ డెలివరీ కూడా ఏదోలా ఉంది. స్వరంలో ఉండాల్సిన మాధుర్యం, సున్నితత్వం కరువయ్యాయి. ఏదో బాహుబలి ఊపిరి బిగబట్టి డైలాగ్ లు చెప్పినట్టుగా ఉంది.  గతంలో రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా హంగు ఆర్భాటాలకు పోలేదు. పాత్రల ఆహార్యం, చిత్రీకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. ఆ గాధలో ఉన్న గాఢతను అర్థంచేసుకొని భావోద్వేగాల మీద చిత్రాలను నడిపిస్తూ అద్భుతంగా నడిపించారు. కానీ 'ఆదిపురుష్' ట్రైలర్స్ చూస్తుంటే ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా అని స్వయంగా ప్రభాస్ చెప్పినా నమ్మలేకపోతున్నాం. ఏదో హాలీవుడ్ నుంచి యానిమేషన్ సినిమానో, సూపర్ హీరో సినిమానో తెలుగులో డబ్ అవుతుంది అనిపిస్తోంది. అలా అని గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనుకుంటే పొరపాటే. శాకుంతలంకి ఎక్కువ, బాహుబలికి తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. రూపం రాముడిలా లేదు. హంగు ఆర్భాటాలు తప్ప ఇది రామాయణం అనే భావన కలగట్లేదు. మరి ఇలాంటి సినిమాతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. పైగా ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు వదులుతాం అంటున్నారు. అసలు హనుమంతుడు థియేటర్ కి రావాలంటే అది రామాయణం అని, అతను రాముడు అని హనుమంతుడుకి అనిపించాలిగా. మీసాలు, గడ్డాలతో ఉన్న బాహుబలి రూపాన్ని చూసి ఈయన మా రాముడు కాదనుకొని థియేటర్ దాకా వచ్చి వెనక్కి వెళ్లినా ఆశ్చర్యంలేదు.

అలుపెరుగని పోరాటానికి చిరునామా!

గత నాలుగున్నరేళ్లుగా  వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకుంటున్నారు.  అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నాలుగున్నరేళ్లుగా ఎందుకు సాగుతూ వస్తోంది. ఆ కేసు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా సాగడానికి కారకులెవరు అన్న విషయంలో కూడా సందేహాలు నివృత్తి అయిపోయాయి. కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులో ఇంకా పూర్తిగా తేలకపోయినా.. ప్రజలలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.   రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో  ఎలాంటి సందేహాలూ లేవు. అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతోండడానికి కారణం మాత్రం ఒకే ఒక్కరు. ఆమె హతుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టిన కారణంగానే వివేకా  హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.   అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ  అధికార వైసీపీ ఈ నాలుగున్నరేళ్లలో సిద్ధహస్తురాలిగా మారిపోయింది. ఆ కారణంగానే కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే  కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎంతగా ప్రయత్నించిందో. సరే కేవలం సునీత న్యాయపోరాటం కారణంగానే కేసు సీబీఐ చేతికి వెళ్లి .. రాష్ట్రం దాటి తెలంగాణలో విచారణకు వచ్చింది. ఇక్కడా కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ఇందుకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరవ్వడాన్ని సమర్ధిస్తూ వీలైనప్పుడు వస్తారు? ఆయనేమైనా ఉగ్రవాదా? అంటూ మీడియా ముఖంగా  ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాటలే నిదర్శనం.  ఇక తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ఇప్పుడు అందరి దృష్టీ సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్నదానిపై ఉంది. 

వారాహి వచ్చేస్తోంది.. ఇది సినిమా కాదు గురూ!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త కాదు. రాజకీయ యాత్రలకూ కొత్త కాదు. కానీ ఇంతవరకు ఆయన సాగించిన రాజకీయ యాత్రలకు  జూన్  14 నుంచి  చేపట్టనున్న వారాహి యాత్రకు మధ్యన చాలా చాలా తేడా వుంది. ఇంతవరకు ఆయన  రాజకీయ కార్యకలాపాలలో భాగంగా ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేందుకు జిల్లాల వారీగా కౌలు రైతు భరోసా యాత్ర చేశారు. అంతకు ముందెప్పుడో  శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు అలాంటి  యాత్రే  చేశారు. అలాగే ఇటీవల అకాల  వర్షాల వలన నష్ట పోయిన రైతులను పరామర్శించేందుకు పరామర్శ యాత్ర చేశారు. అంతకు ముందు తర్వాత కష్టాల్లో ఉన్న విభిన్న వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఆయన యాత్రలు చేశారు.  అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ సాగించిన యాత్రలు ఒక నిర్దిష్ట లక్ష్యంతో సాగించిన యాత్రలు. ఒక విధంగా చూస్తే పవన్ యాత్రలు చాలావరకు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా చేసినవే కానీ  నిర్దుష్ట రాజకీయ లక్ష్యంతో చేసినవి కాదు. కానీ ఇప్పుడు జూన్ 14 నుంచి ప్రారంభిస్తున్న ‘వారాహి’ యాత్ర  గతంలోలా పరిమిత లక్ష్యంతో ప్రారంభిస్తున్న యాత్ర కాదు. అందుకు పూర్తిగా భిన్నమైన యాత్ర. ఒక విధంగా ఎన్నికల సంగ్రామ యాత్ర. సహజంగానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రోడ్డెక్కితే  జనం ఆయన్ని చూడడానికే అయినా తండోపతండాలుగా వస్తారు. అందులో ఇప్పుడు రాజకీయం కూడా తోడైంది కాబట్టి  పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జన సంద్రంగా సాగుతుంది. అందులో సందేహం లేదు. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ సాగించిన చైతన్య రథయాత్ర సాగిన (నేలా ఈనిందా, ఆకాశం నెలకు దిగివచ్చిందా) రీతిలోనే పవన్ వారాహి యాత్ర కూడా జనసంద్రంగా సాగుతుంది. అనుమానం లేదు. అయితే ఎన్టీఆర్ కు వచ్చిన పొలిటికల్ మైలేజి పవన్ కళ్యాణ్ కు  వస్తుందా? అంటే, అరక్షణం ఆలోచించకుండా, నో  అన్న సమాధానమే వస్తుంది. అయినా పవన్  కళ్యాణ్ వారాహి యాత్రకి ఎంతో కొంత పొలిటికల్ మైలేజి వస్తుంది అయితే, ఎంతవరకు వస్తుందనేది  మాత్రమే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే. అందుకే ఇప్పుడు   పొలిటికల్ సర్కిల్స్ లో వారాహి యాత్ర హాట్ టాపిక్ అయింది.  నిజమే ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర ఒక చరిత్ర. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో తెలుగునాట తిరుగులేని వటవృక్షంలా పాతుకు పోయిన కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా పెకిలించి పారేసిన చారిత్రక యాత్ర.. ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర. ఆ యాత్రతో మరొక యాత్రను పోల్చడం దుస్సాహసమే అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే నిస్సందేహంగా రేపటి ఎన్నికల్లో వారాహి ప్రభావం  ఉంటుందనే అంటున్నారు. అలాగే పొత్తులను ఖరారు చేయడంలోనూ వారాహి యాత్రకు వచ్చే ప్రజా స్పందన ప్రభావం ఉంటుందని  పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమి జరుగుతుంది అనేది పక్క పెడితే  వారాహి యాత్ర రాజకీయ వర్గాల్లో హీట్  పెంచుతోంది. ఇప్పటికే జనసేన మిత్ర పక్షం (?) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సాగిస్తున్న యువగళం పాద యాత్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడప సహా  ఎక్కడికెళితే అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తోడైతే, అధికార వైసేపీ పరిస్థితి దబిడి దిబిడే అంటున్నారు. కాగా  పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి ‘వారాహి’ యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుంటూరులో  వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన యాత్ర వివరాలను తెలియ చేశారు. జూన్ 14న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని పవన్ కళ్యాణ్ కలిసేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని వివరించారు. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తారని పేర్కొన్నారు.  జనసేన బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా వారాహి యాత్ర   సక్సెస్ విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అంచనాలను అందుకుంటుందా లేదా అన్న సందేహాలకు సమాధానంగా  ఇది సినిమా కాదు గురూ ..అంటున్నారు. 

తెలంగాణలో పొత్తు ఖరారైనట్లేనా?

ఒక్క భేటీ తెలంగాణలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందా? ఒక్క భేటీ తెలంగాణలో  తెలుగుదేశం ప్రాధాన్యతను, ప్రాముఖ్యతనూ అమాంతంగా పెంచేసిందా? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిష్టను, బలాన్ని మరోసారి రాజకీయ తెరపైకి బలంగా తీసుకువచ్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జరిపిన భేటీ తెలంగాణలో తెలుగుదేశం ప్రతిష్టను అమాంతంగా పెంచేసింది. ఆ భేటీలో చంద్రబాబుతో బీజేపీ అగ్రనేతలు ఏం చర్చంచారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణలో తగ్గిన బీజేపీ జోష్ ను కాంపన్ సేట్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీతో కలిసి నడవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని మాత్రం  బీజేపీ హై కమాండ్ గుర్తించిందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  చంద్రబాబుతో అమిత్ షా, నడ్డాల భేటీకి ఈ నేపథ్యమే కారణమని చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి వెళ్లేందుకు బీజేపీ హై కమాండ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసిందని అంటున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా చంద్రబాబును హస్తినకు పిలిపించుకుని మరీ చర్చించారని అంటున్నారు. ఈ భేటీపై పరిశీలకులు కూడా ఉభయ తారకంగా ఇరు పార్టీల మధ్యా ఏదో ఒప్పందం కుదిరే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో  బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉన్నట్లుగా, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం ఏమంత లేదు. అదీ గాక ఆ పార్టీకి ఎంత దూరంగా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీకి అంత ప్రయోజనం చేకూరే పరిస్థితులు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో ఎన్నికల సమయంలో వైసీపీ అరాచక మూకలు చెలరేగిపోతాయన్న అనుమానాలు ప్రస్తుతం ఏపీలో బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఏపీలో బీజేపీ తటస్థంగా ఉంటే.. తెలంగాణలో ఆ పార్టీకి మద్దతుపై తనకు అభ్యంతరం లేదన్న ప్రస్తావన తెచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. పరిశీలకుల విశ్లేషణలకు తగ్గట్టుగానే భేటీ అనంతరం రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ కు వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ తెలంగాణ కీలక నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం హస్తినకు పిలిచింది. వాస్తవానికి తెలంగాణ అర్బన్ ప్రాంతాలలో బీజేపీకి కొంత పట్టు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుకులాడుకోవలసిన పరిస్థితిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి తెలంగాణలో తెలుగుదేశం వంటి బలమైన పార్టీ అండ అవసరం. అందుకే చంద్రబాబు ప్రతిపాదనకు బీజేపీ హై కమాండ్ సానుకూలంగా స్పందించే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ తరువాతే తెలుగుదేశం, బీజేపీలలో చర్చల ప్రక్రియ జోరందుకుంది. ఇరు పార్టీల రాష్ట్ర నాయకులూ కూడా క్యాడర్ తో, జిల్లాల నాయకత్వంతో చర్చలు షురూ చేశారు. దీంతో తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశంల మధ్య సయేధ్య కుదిరినట్లేనని అంటున్నారు. 

నల్లారి ఎక్కడున్నా అంతేనా?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఏపీ రాజకీయాలలో గట్టిగానే వినిపించింది. పేరైతే వినిపించింది కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ విభజనను వ్యతిరేకించారు. అప్పట్లో సొంత పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి మరీ హస్తినలో విభజనకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. బెర్లిన గోడ కూల్చేసిన సందర్భంగా అందుకు సంబంధించిన అవశేషం అంటే ఓ రాయి ముక్కను చూపించి.. ఏపీ విభజన జరిగినా మళ్లీ రెండు రాష్ట్రాలూ కలిసిపోవడమే జరుగుతుందంటూ  అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగాలు కూడా చేశారు. అయితే విభజనను అడ్డుకోవడంలో విఫలమై.. కాంగ్రెస్ నుంచి వీడి సమైక్య ఆంధ్రప్రదేశ్ పేర సొంత పార్టీ పెట్టుకుని 2014 ఎన్నికలలో పోటీ చేశారు. ఘోర పరాజయం పాలయ్యారు.  ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరూ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇది పాత సంగతే. ఇక ప్రస్తుతానికి వస్తే.. 2014 ఎన్నికల పరాజయం తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా రాజకీయ అజ్ణాత వాసం చేశారు.  ఆ తరువాత తన సమైక్య ఆంధ్ర పార్టీ గురించి ప్రస్తావించకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హస్తిన వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక రాజకీయంగా ఆయన క్రియాశీలం అవుతారని అప్పట్లో అంతా భావించారు. కానీ ఆయన మాత్రం అజ్ణాతాన్ని వీడలేదు. తాజాగా ఇటీవల ఆయన కమలం గూటికి చేరారు. ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను బీజేపీ ఆయనకు అప్పగిస్తుందని అప్పట్లో అంతా భావించారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ జరగలేదు. పోలీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయినా బీజేపీ  కార్యక్రమాలలో ఏమైనా చురుకుగా పాల్గొంటున్నారా అంటే అదేమీ లేదు. పార్టీలో చేరినా ఇప్పటి వరకూ ఆయన హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కాలు బయటపెట్టిన దాఖలాలు లేవు. మధ్యలో ఏదో విదేశీ పర్యటన అంటూ వెళ్లారనీ, తిరిగి వచ్చిన తరువాత తడాఖా చూపుతారనీ వార్తలు వచ్చాయి. కానీ అదీ జరగలేదు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా హైదరాబాద్ లోని  నల్లారి కిరణ్ నివాసానికి వెళ్లి  కేంద్రంలో మోడీ సర్కార్ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా కోరినా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి స్పందన లేదని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఆయన భాష మౌనమేననీ, ఆయన అజ్ణాత వాసేననీ సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి.  మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హఠాత్తుగా ఆయనను సోము వీర్రాజు హైదరాబాద్ ఇంట్లో కలిసి మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తున్నామని.. తమకు కూడా రావాలని ఆహ్వానించారు. అయితే కిరణ్ రెడ్డి మాత్రం హైకమాండ్ ఎలాంటి బాధ్యతలిచ్చినా చేస్తానని రొటీన్ డైలాగ్ చెప్పి పంపేశారు. ఆయన ఉద్దేశం.. హైకమాండ్ తనకు అర్జంట్ గా ఏదో ఓ పదవి ప్రకటించడం. కానీ కిరణ్ గురించి పట్టించుకునే తీరికలో ప్రస్తుతం హైకమాండ్ లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సొంత పార్టీపెట్టుకుని కొన్నాళ్ల తర్తా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలా చేరిన తర్వాత ఆయన బయట కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిపోయారు. ఆయన పార్టీలో చేరినప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆయన పాత్ర దగ్గర్నుంచి చాలా ప్రచారాలు జరిగాయి. కానీ జరిగింది మాత్రం శూన్యం. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో దక్షిణాదిన బీజేపీ పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ నిర్ణయాల విషయంలో తననే కామెడీ చేసుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఏపీలో జనంలోకి వెళ్లేందుకు మాత్రం ఆయన వెనుకడుగు వేస్తున్నారు. బీజేపీ తరపున ప్రచారానికి కూడా సిద్ధపడటం లేదు. పైగా ఏపీ బీజేపీలో ఉన్న వర్గాల కారణంగా ఆయనను కలుపుకునిపోవడం కూడా డౌటే. హైకమాండ్ సూచనల మేరకు సోము వీర్రాజు కలిసి ఉంటారని.. వాస్తవంగా అయితే ఆయన కూడా పట్టించుకోరని అంటున్నారు.

కేసీఆర్ నోట ఏపీలో చిమ్మ చీకట్ల మాట!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తమ గొప్పలు చెప్పుకోవాలంటే ఏపీలో నెలకొన్న అధ్వాన పరిస్థితులను ప్రస్తావించడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ పనిని ఇప్పటి  వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే చేశారు. ఇప్పుడు ఏపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా కేసీఆర్ కూడా గీత దాటేశారు. ఏపీలో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని ఏకంగా బహిరంగ సభలో చెప్పేశారు. పొరుగు రాష్ట్రం గురించి,  ఆ రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఏకంగా ముఖ్యమంత్రే చెప్పారంటే ఏపీ పరువు ఏ గంగలో కలిసినట్లో ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇవ్వాలి.  ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీలో చిమ్మ చీకట్లు నెలకొన్నాయని బహిరంగ సభ వేదికగా చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ వెలుగుజిలుగులతో విరాజిల్లుతుంటే.. ఏపీ మాత్రం చిమ్మ చీకట్లో మగ్గిపోతోందని అన్నారు. ఈ మాట ఏదో ఇష్టాగోష్టిగా తమ పార్టీ నాయకులతోనో, మంత్రివర్గ సహచరులతోనో మాట్లాడుతూ కాదు.. ఒక బహిరంగ సభా వేదిక మీద నుంచి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆగ్రహం ఏపీ వాసుల నుంచి వ్యక్తం కావడం లేదు. ఆయన చెప్పింది వాస్తవమే కదా అన్న వ్యాఖ్యలే జనం నుంచి వినవస్తున్నాయి. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీలో విద్యుత్ పరిస్థితి గురించి, రోడ్ల దుస్థితి గురించి ఏకంగా ఇన్వెస్టర్ల సదస్సులోనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఐదేళ్ల పాటు ప్రతి అంశంలోనూ, ప్రతి విషయంలోనూ తెలంగాణను అధిగమించిన ఏపీ.. ఆ తరువాత ఇలా అన్ని రంగాలలోనూ వెనుకబడిపోవడానికీ, పొరుగు రాష్ట్రం నేతలు ఏపీ పరిస్థితుల గురించి చులకనగా వ్యాఖ్యలు చేసినా ఏపీ సర్కార్ ఖండించలేని దుస్థితిలో ఉండడానికీ కారణమేమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ నిర్విరామంగా అందుతుంటే.. ఏపీలో మాత్రం అడ్డగోలు కోతలతో  జనం ఆగమాగం అయిపోతున్నారు. జూన్ మొదటి వారం గడిచిపోయినా ఎండల తీవ్రత ఇసుమంతైనా తగ్గకపోవడం, డిమాండ్ కు సరపడా విద్యుత్ సరఫరా చేయలేక ఏపీ చేతులెత్తేయడాన్ని కేసీఆర్ ఎత్తి చూపారు తప్పేముందని ఏపీ జనమే అంటున్నారు.  అయితే కేసీఆర్  ఆంధ్రప్రదేశ్ లో అద్వాన పరిస్థితుల గురించి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు.   అలాగే తెలంగాణ, ఏపీ మధ్య పాలన సామర్ధ్యంలో తేడాల గురించి చెప్పడంలో మంత్రలు కేటీఆర్, హరష్ రావు  కీలకమైన పెట్టుబడులు ఇతర సమావేశాల్లో  ప్రస్తావించి ఏపీలో ఏపీలో అన్ని రకాల పరిస్థితుల్ని చూపించి భూతల నరకం అంటే ఏపీయే అని చెబుతున్నారు. ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఖండించే ధైర్యం కూడా  లేకుండా పోయింది. మొదటి సారి కేటీఆర్ ఏపీలో అద్వాన పరిస్థితుల గురించి విమర్శించిన సందర్భంగా  ఏపీలో కొంత మంది మంత్రులు నామ్ కే వాస్తే ఖండించి ఆ తరువాత సైలంట్ అయిపోయారు. జగన్ కేసీఆర్ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధమే ఏపీ మంత్రుల సైలెన్స్ కు కారణమని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ పాలనలో ఏపీ అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నా.. ఏపీ సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ నోరెత్తకపోవడాన్ని కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలే కారణమని ఎవరైనా ఎలా సరిపెట్టుకోగలరు?  

రాజస్థాన్ కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు

రాజస్థాన్ కాంగ్రెస్ లో విభేదాలు మరో సారి రచ్చకెక్కాయి. ఈ సారి పార్టీ హైకమాండ్ కలగ జేసుకున్నా పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. రాజస్థాన్ కాంగ్రెస్ లో గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి గెహ్లాట్, పార్టీ యువనేత సచిన్ పైలట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ సచిన్ పైలట్ కీలెరిగి వాత పెట్టిన చందంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ షాక్ రాష్ట్ర కాంగ్రెస్ కే పరిమితమయ్యే అవకాశాలు స్వల్పం. సచిన్ పైలట్ తీసుకోబోతున్న నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇక విషయానికి వస్తే.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో సచిన్ పైలట్ కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఈ నెల 11న అంటే తన తండ్రి రాజేష్ పైలట్ వర్థంతి రోజునే కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఎన్నికలలో రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం వెనుక కీలక శక్తి సచిన్ పైలటేననడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల సమయంలో పీసీపీ చీఫ్ గా ఉన్న సచిన్ పైలట్ తన సర్వశక్తులూ ఒడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.  అయితే ఆయన ఆశించిన విధంగా సీఎం పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు. సీనియర్ అన్న ఒకే ఒక్క కారణంతో సిచిన్ పైలట్ ను కాదని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పట్లో అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అప్పటి నుంచీ అంటే ఈ నాలుగున్నరేళ్లుగా సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.  గతంలోనే పార్టీ నుంచి బయటకు రావడానికి, లేదా పార్టీలో చీలిక తీసుకురావడానికి సిద్ధమైన సచిన్ పైలట్ అధిష్ఠానం జోక్యంతో వెనక్కు తగ్గారు.  ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వారిద్దరినీ పిలిపించి.. సయోధ్య చేసి పంపింది. అంతా సద్దుమణిగందని అనుకునే లోపు  సచిన్ పార్టీని వీడేందుకు డిసైడయ్యారు.   లేదా ‘రాజ్ జన సంఘర్ష పార్టీ పేర కొత్త పార్టీని స్థాపించాలని సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ వైరాగ్యం ఎందుకంటే?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠాత్తుగా రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పాలనిపిస్తోందంటూ  వేదాంత ధోరణిలో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలలో వ్యాపారాత్మక ధోరణి ప్రబలిపోయిందని ఈ పరిస్థితుల్లో రాజకీయాలలో కొనసాగడం కష్టమని, మరీ ముఖ్యంగా తనలాంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే మేలని  ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. వ్యాపారాత్మక రాజకీయాలు తనకు సెట్ కావన్న ఉత్తమ్ పోలిటికల్ రిటౌర్మెంట్ గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం సృష్టించాయి. ఏదో ఒక మంచి రోజు చూసుకొని రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తాననీ, మరీ ముఖ్యంగా 2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియలైజ్ అయ్యారనీ ఉత్తమ్ అంటున్నారు. అందుకే గౌరవంగా రాజకీయ రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నానని ఉత్తమ్ అన్నారు. తాను రాజకీయాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని.. అనుభవించిన పదవులు, పొందిన గౌరవం తనకు సంతృప్తినిచ్చాయనీ ఉత్తమ్ చెప్పుకున్నారు. అయితే ఇక వ్యాపారాత్మక రాజకీయాలలో కొనసాగే  ఆసక్తి, ఉత్సాహం లేవంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ సన్యాసం ప్రకటిస్తానని వెల్లడించారు. రాజకీయ సన్యాసం ప్రకటిస్తానంటూ వైరాగ్యం మాట్లాడిన ఆయన మోడీ ఛరిష్మా తగ్గుతోందంటూ మరో రాజకీయ ప్రకటన కూడా ఇదే సందర్భంగా చేశారు.  ఆయన ఏం మాట్లాడినా, ఎంతగా తనను తాను రాజకీయాలలో ఎనలేని సేవలు చేశానని చెప్పుకున్నా, ఆయన ప్రస్తుత  రాజకీయ వైరాగ్యానికి కారణం కాంగ్రెస్ లో ఆయన ప్రాముఖ్యత నామమాత్రపు స్థాయికి పడిపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ శ్రేణులూ అదే అంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్లే కాదు, జూనియర్లు సైతం ఇప్పడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి పార్టీలో కనిపించడం లేదు.  

జాతీయ రాజకీయాలకు విరామం.. తాత్కాలికమేనా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావుకు తత్వం బోధపడినట్లుంది. జాతీయ రాజకీయాలలో రాణించాలంటే.. తెలంగాణ మోడల్ ప్రచారం ఒక్కటే సరిపోదన్న విషయం తెలిసి వచ్చినట్లుంది. అందుకే ఆ ఎన్నికల తరువాత ఆయన కేంద్రంపై విమర్శలను బంద్ చేశారు. రాష్ట్రంలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలు, ఆరునెలలలోగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత పార్టీలో ఇబ్బందులను పరిష్కరించుకునే ప్రయత్నాలలో పడ్డారు. అన్నిటికీ మించి ఇంత కాలం ఆయన ఏకైక అజెండాగా తీసుకున్న బీజేపీ వ్యతిరేక స్టాండ్ కు కూడా ఫుల్ స్టాప్ లేదా కామా పెట్టేశారు.  రాష్ట్రంలో బీజేపీలో సమస్యలు తక్కువ ఏమీ లేవు. సిట్టింగులకు టికెట్ల విషయంలో పార్టీలో  తలెత్తిన అసంతృప్తి ఇప్పటిలో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే.. కేసీఆర్ వ్యూహ వైఫల్యమో, యాంటీ ఇంకంబెన్సీ ఫలితమో తెలియదు కానీ తెలంగాణలో  కాంగ్రెస్, బీజేపీలు బలంగా పుంజుకున్నాయి. రెండు పార్టీలూ కూడా వేటికవి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళుతున్నాయి. బీజేపీ  రాష్ట్రంలో ఈ స్థాయిలో బలోపేతం కావడానికి కేసీఆరే కారణమని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. కాంగ్రెస్ ను విస్మరించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ అంతా బీజేపీపై పెట్టడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయిలో బలోపేతం అయ్యిందన్న వాదన పరిశీలకుల నుంచి కూడా వస్తోంది. కేసీఆర్ ఈ వైఖరి కారణంగానే గతంలో అంటే టీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ గా మారడానికి ముందు నుంచే తెలంగాణలో కేసీఆర్ పార్టీ బీజేపీకి బి.టీమ్ అన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే ఆ తరువాత ఆ విమర్శల జోరు క్రమంగా తగ్గి కనుమరుగైపోయింది. అయితే ఇటీవలి కాలంలో అంటే కర్నాటక ఎన్నికల తరువాత నుంచి కేసీఆర్ ధోరణి కారణంగా మళ్లీ అవే అనుమానాలూ, విమర్శలూ తెరమీదకు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కోసం కేసీఆర్ బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి. ఆశ్చర్యకరంగా కేసీఆర్ నోట మోడీకి కానీ, బీజేపీకి కాని వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రావడం లేదు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకు ప్రకటించిన విరామం తాత్కాలికమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.