జగన్ సర్కార్ కు ఆగస్ట్ డెడ్ ఎండ్?
posted on Jun 12, 2023 @ 3:09PM
జగన్ అధికారానికి కేంద్రం చరమగీతం పాడబోతోందా? అంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఔననే అంటున్నారు. జగన్ ముందస్తుకు వెనకడుగు వేసినా ఆయన ప్రభుత్వం ఆగస్టు తరువాత అధికారంలో కొనసాగేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయని రఘురామకృష్ణం రాజు విశ్లేషిస్తున్నారు. ఆయన మాటల ప్రకారం ఆగస్టు నాటికి ఏపీలో జగన్ సర్కార్ ను రద్దు అవుతుంది. జగనే తనంతట తాను అందుకు ముందుకు వస్తారు.
ఏపీలో తాజాగా పర్యటించిన నడ్డా మాటలను తార్కానంగా చూపుతున్నారు. నడ్డా మాటలను బట్టి చూస్తే జగన్ సర్కార్ కు ఇక ఏ వైపు నుంచీ అప్పుపుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు. అలా అప్పు పుట్టక పోతే జగన్ సర్కార్ ఒక్క పూట కూడా నడిచే అవకాశం లేదు. ఈ కారణాన్ని చూపుతూనే రఘురామకృష్ణం రాజు అగస్టు తరువాత జగన్ సర్కార్ కొనసాగే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే ఆగస్టులో జగన్ సర్కార్ ను రద్దు చేసి తెలంగాణ ఎన్నికలతో పాటుగానే ముందస్తుకు సమాయత్తమౌతారని ఆయన గట్టిగా చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లడం జగన్ కు సుతరామూ ఇష్టం లేకపోయినా.. చివరి క్షణం వరకూ అధికారాన్ని అంటిపెట్టుకునే ఉండాలన్నది జగన్ అభిమతమే అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు ఏ మాత్రం సహకరించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
వారి విశ్లేషణలకు తగినట్టుగానే రఘురామకృష్ణం రాజు తన రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించడానికి శ్రీకారం చుట్టిందని, ఆర్థిక వెసులు బాటు కేంద్రం నుంచి అందకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమని జగన్ కు స్పష్టంగా తెలుసును కనుకనే ఒక వైపు ముందస్తు లేదని అంటూనే మరో వైపు అందుకు అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖ తూర్పులో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, వైసీపీకి చెందిన వారి కుటుంబాలలో లేని వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్పించడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. ముందస్తు ముచ్చట ఎత్తిందీ వైసీపీయే, ఇప్పుడా ముచ్చట లేదంటున్నదీ ఆ పార్టీయే అన్నది ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నారు. విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఎన్నికలలో లబ్థి పొందాలన్నదే జగన్ వ్యూహంగా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ముందస్తు లేదన్న భావనతో విపక్షాలు ప్రమత్తంగా ఉండడాన్ని జగన్ అవకాశంగా మలచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే జేపీ నడ్డా, అమిత్ షాల విమర్శలు జగన్ సర్కార్ పై, జగన్ పాలనపై క్షిపణి దాడుల్లా ఉన్నాయన్నారు. ఆ విమర్శలపై వైపీసీ నేతలు తమ సహజసిద్ధమైన బూతుల పంచాగంతో విరుచుకుపడుతుండటం చూస్తుంటే.. కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఇంకెంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు లేవని అవగతమౌతోందన్నారు.