బీజేపీ.. వైసీపీ లవ్ బ్రేకప్!?
posted on Jun 13, 2023 @ 11:53AM
నాలుగేళ్లకు పైగా అవిచ్ఛన్నంగా సాగుతున్న బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వైసీపీ, బీజేపీ బంధం తెగిపోయిందా అంటే ఔనని కానీ, కాదని కానీ చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరు పార్టీల బంధం పరస్పర ప్రయోజనాలతో కూడుకుని ఉన్నదని, ఆ ప్రయోజనాలు సిద్ధించవని నిస్సందేహంగా తేలిపోతే తప్ప ఆ బంధం తెగిపోయే అవకాశాలు లేవనీ చెబుతున్నారు.
అసలు బీజేపీ, వైసీపీల మధ్య లవ్..లవ్ జిహాద్ వంటిదేనని పరిశీలకులు అంటున్నారు. తనపై కేసుల నుంచి రక్షణ కోసం జగన్.. రాజ్యసభలో వైసీపీ మద్దతు కోసం బీజేపీ ఒకరికొకరు అండగా ఉంటున్నారే తప్ప అందులో ప్రజలకు సంబంధించిన అంశమేదీ లేదని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. ఈ పరస్పరాధార బంధం వెనుక అనేక విచిత్రాలు ఉన్నాయి. జగన్ పార్టీ వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాదు. అలాగే ఏపీలో ఆ రెండూ మిత్ర పక్షాలు కావు. వైసీపీని గట్టిగా వ్యతిరేకించే జనసేన ఏపీలో బీజేపీకి మిత్ర పక్షం. అయినా సరే మిత్రపక్షానికి మించిన ప్రాముఖ్యతను కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఇస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పులు తీసుకునే అవకాశం లేకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు మాత్రం కావాలని కోరిన ప్రతి సందర్భంలోనూ అప్పులకు అనుమతి ఇచ్చేస్తొంది. అభివృద్ధి అనే మాటే లేకుండా అప్పులు చేసి మరీ బటన్ లు నొక్కి ఎన్నికల ప్రయోజనాల కోసం సోమ్ములు పందేరం చేస్తున్న జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ఖండించని కేంద్ర సర్కార్.. బహిరంగ వేదికలపై మాత్రం ఉచిత హామీలు అనుచితం అని ప్రసంగాలు దంచుతూ ఉంటుంది.
మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో చాలా గట్టిగా వినిపించిన క్విడ్ ప్రోకో..యే వైసీపీ, బీజేపీ బంధానికి కూడా కారణమన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటి వరకూ రెండు పార్టీల మధ్యా ఎప్పుడైనా విమర్శలు చోటు చేసుకున్నా అవన్నీ కూడా ప్రేమికుల మధ్య వచ్చే చిలిపితగవుల వంటివేనని అంటున్నారు. అయితే అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో తాజాగా అమిత్ షా, నడ్డాల ఏపీ పర్యటన బ్రేకప్ చేప్పేసిందా అన్న స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. షా నడ్డాలు గతంలో అంటే ఈ నాలుగేళ్ల పైచిలుకు కాలంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కార్ అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలే లక్ష్యంగా ఏపీ గడ్డపై నుంచే తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై విమర్శలేంటి అంటూ మొహమాటంతో ప్రసంగ అనువాదాన్ని ఒకంత తీవ్రత తగ్గించి చేసిన జీవీఎల్ ను అయితే అమిత్ షా వేదికమీదే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ, బీజేపీ లవ్ కు బ్రేకప్ పడిపోయిందా అన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇందుకు ఇటీవల అమిత్ షా, నడ్డాలతో హస్తినలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీని ఒక కారణంగా చూపుతున్నారు. నిజమే చంద్రబాబు తనంత తానుగా హస్తిన వెళ్లి నడ్డా షాలతో భేటీ కాలేదు. అమిత్ షా నివాసంలో చంద్రబాబుతో నడ్డా షాలు భేటీ అయ్యారు. ఆ భేటీలో చర్చలు ఏమిటి? నిర్ణయాలు ఏమిటి? అన్నది పక్కన పెడితే.. బీజేపీ, వైసీపీల బంధం బ్రేక్ కావడానికి అదీ ఒక కారణమేనని అంటున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల బ్రేకప్ విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదంటున్నారు.