.హవ్వా..ఇంత అవమానమా..? ఏపీలో ఆ మంత్రి చాంబర్ కు తాళం..!
posted on Jun 13, 2023 @ 11:06AM
ఏపీలో ఓ మంత్రి కి ఘోర పరాభవం ఎదురైంది. జీతాలు చెల్లించడం లేదంటూ ఏకంగా మంత్రి ఛాంబర్ కు సిబ్బంది తాళాలు వేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. విషయం తెలిసి అధికార వైసీపీలోని కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. బిల్లులు చెల్లించలేదంటూ గ్రామాల్లోని సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, సిబ్బంది తమ నిరసన తెలపడం అప్పుడప్పుడు జరిగే విషయం. కానీ, జీతాలు చెల్లించ లేదంటూ ఏకంగా ఒక మంత్రి కార్యాలయానికి అక్కడ పనిచేసే సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో చోటు చేసుకోగా, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పిఆర్ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఈ పరాభవం ఎదురయింది. ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీకి సిబ్బంది తాళం వేసి మూసి వేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ పని చేయడం గమనార్హం.
ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేసి తమ నిరసనను తెలియజేశారు. సాధారణంగా మంత్రి పేషీ రోజూ తెరిచేవారు. అధికారులు సిబ్బంది వచ్చి తమ విధులను నిర్వర్తించేవారు. అయితే, ఎనిమిది నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి చాంబర్ కు తాళం వేశారు. జీతాలు విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్థాపానికి గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఉద్యోగులు బావురుమంటున్నారు.జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తాము మరో దారి లేక విధులకు హాజరు కావడం మానేశారు సదరు ఉద్యోగులు. డ్యూటీకి రాని సంగతి తెలిసినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మంత్రి చాంబర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పని చేయడానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహించే పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతపడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ వ్యవహారంపై మంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.