అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..జీవీఎల్ బోల్తాపడ్డాడు!
posted on Jun 13, 2023 @ 10:37AM
ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్నది సామెత. బీజేపీ ఎంపీ జీవీఎల్ పరిస్థితి సరిగ్గా ఆ సామెతకు తగినట్టు సరిపోతుంది. ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా ఎందుకు మారిపోతోందో.. బీజేపీ నాయకత్వానికి జేవీఎల్ కారణంగానే స్పష్టంగా అర్థమైపోయింది. ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు గురించి బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కానీ తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న సమయం నుంచీ.. రాష్ట్ర పరిస్థితుల గురించి తనదైన శైలిలో రిపోర్టులు ఇస్తూ హైకమాండ్ కు దగ్గరైన జీవీఎల్. ఆ ఫిర్యాదులన్నిటినీ పూర్వ పక్షం చేసేలా పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించారు.
2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం, వైసీపీ విజయంతో జీవీఎల్ సమాచారంపై అధిష్టానం నమ్మకం పెంచుకుంది. అందుకే పలుకుబడి ఉన్న కన్నాను తప్పించి మరీ సోము వీర్రాజుకు జీవీఎల్ సిఫారసుపై పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో ఏకంగా అధికార పార్టీ నేతలు బీజేపీ సీనియర్ నేతలపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలతో అధిష్ఠానం బీజేపీపై దృష్టి సారించింది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడవాడలా చార్జ్ షీట్లు వేయాలంటూ సాక్షాత్తూ మోడీ ఇచ్చిన ఆదేశాలే అమలుకు నోచుకోకపోవడంతో బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. స్వయంగా రంగంలోకి దిగడంతో అనివార్యంగా చార్జ్ షీట్ల కార్యక్రమం చేపట్టింది.
కానీ అది తూతూ మంత్రంగానే సాగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే మోడీ 9 ఏళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే అమిత్ షా ఏపీలో పర్యటించారు. నడ్డా శ్రీకాళహస్తిలో, అమిత్ షా విశాఖలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారం కంటే తమతమ ప్రసంగాల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పించారు. నడ్డా ప్రసంగంపై వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. అది పక్కన పెడితే విశాఖలో అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన జీవీఎల్ కు అ సభావేదికపైనే ఘోర పరాభవం జరిగింది. తన ప్రసంగ అనువాదంలో జీవీఎల్ సొంత పైత్యం జోడిస్తున్నారని అర్థమైన అమిత్ షా వేదికపైనే నేనేం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారంటూ నిలదీశారు.
దీంతో ఒక్కసారిగా కంగుతిన్న జేవీఎల్ అవమానంతో తలదించుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే అమిత్ షా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వాడిని తగ్గించి.. అమిత్ షా ప్రసంగ సారాన్ని నిర్వీర్యం చేసేలా జీవీఎల్ అనువాదం ఉంది. ఆ విషయాన్ని అమిత్ షా గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో జీవీఎల్గత్యంతరం లేక అమిత్ షా ప్రసంగ పాఠాన్ని ఉన్నదున్నట్లుగా అనువాదం చేసి చెప్పాల్సి వచ్చింది. అయితే అప్పటికే జగన్ పై అమిత్ షా చేసిన ఎన్నో విమర్శలను జీవీఎల్ సభలో చెప్పలేదు. వాటిని స్కిప్ చేశారు. షా నిలదీసిన తరువాతే.. ఒక ప్యాడ్ తీసుకుని ఆయన మాటలు రాసుకుని అనువాదం చేశారు.
ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం వద్ద కానీ, పార్టీ రాష్ట్ర శాఖలో కానీ జీవీఎల్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జీవీఎల్ కు ఇప్పుడు లోక్ సభ స్థానం కాదు కదా.. కనీసం త్వరలో ముగియనున్న ఆయన రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించే అవకాశం కూడా లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిథి హోదా కోల్పోయిన జేవీఎల్ కు ముందు ముందు బీజేపీలో మరిన్ని పరాభవాలు తప్పవని పార్టీ నేతలు చేబుతున్నారు.