సీమ నేలకు లోకేష్ వందనం
posted on Jun 14, 2023 @ 10:12AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలలో ముగిసింది. సీమలో లోకేష్ ను అడుగుపెట్టనీయం అంటూ సవాళ్లు చేసిన వైసీపీ నాయకులకే దిమ్మతిరిగేలా ఆయన పాదయాత్ర కు సీమ జిల్లాల్లో జనం నీరాజనాలు పలికారు. తనదీ సీమేననీ, తనలో ప్రవహించేదీ సీమ రక్తమేననీ లోకేష్ బద్వేల్ సభలో వైసీపీ నేతల చెవుల్లో మారుమ్రోగేలా చెప్పారు.
తనను సవాల్ చెయ్యాలన్నా, అడ్డుకోవాలన్నా దమ్ముండాలి... ఆ దమ్ము వైసీపీకి లేదని లోకేష్ సీమ జిల్లాల్లో జన ప్రభంజనంలా సాగిన తన పాదయాత్ర ద్వారా నిర్ద్వంద్వంగా రుజువు చేశారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది... కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా అంటూ ఎద్దేవా చేశారు.
సీమ జిల్లాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం (జూన్ 13)తో ముగిసి నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. నెల్లూరు జిల్లాలో లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు అంటే లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు ఆయన రాయలసీమ నేలకు శిరస్సు వంచి నమస్కరించారు.