కూటములు.. కూడికలు.. తీసివేతలు
posted on Jun 14, 2023 @ 3:36PM
రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శతృవులు ఉండరు. కానీ శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రాజకీయ శతృ, మిత్ర సంబంధాలు ఎప్పటికప్పుడు మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. వాజ్ పేయి హయాంలో దాదాపు 30 వరకూ ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పర్టీలలో చాలా పార్టీలు ఇప్పుడు బీజేపీతో కలిసి నడవడం లేదు.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి. వాజ్ పేయి మిత్ర ధర్మాన్నీ, సంకీర్ణ ధర్మాన్నీ మనసా వాచా కర్మణా అనుసరించారు. అందుకే మధ్యమధ్యలో పొరపొచ్చాలు వచ్చినా ఎన్డీయే సర్కార్ కు ఆయన అయిదేళ్లూ సారథ్యం వహించి విజయవంతంగా నడిపించారు. ఇక 2014లో సంపూర్ణ మెజారిటీ సాధించినా మోడీ కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేశారు.
2019 ఎన్నికలలో అంతకు మించి మెజారిటీ స్థానాలు సాధించినా మోడీ సంకీర్ణ ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు. అయితే ప్రస్తుత మోడీ సర్కార్ లో బీజేపీయేతర పార్టీల కు చెందిన మంత్రుల సంఖ్య రెండూ మూడుకు మించలేదు. అలాగే మోడీ హయాం వచ్చిన తరువాత ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా బయటకు వెళ్లిపోయాయి. ప్రస్తుతానికి మిగిలిన పార్టీలు చాలా చాలా తక్కువ.
వాజ్ పేయి హయాంలో బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా గుర్తింపు పొందిన తెలుగుదేశం.. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అదే పాత్ర పోషిస్తుందని భావించినా.. ఆ మైత్రి పూర్తిగా ఐదేళ్లూ సాగలేదు. ఇందుకు మోడీ వ్యవహారశైలి, అహంభావంతో వ్యవహరించడమే కారణం. ఒకప్పుడు బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు బయటకు వెళ్లి పోయాయి.
వెళ్లిపోయాయి అనడం కంటే ఆయా పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండా పొగబెట్టి బయటకు పంపారని చెప్పాలి. 2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకే మిత్రపక్షాలకు ఎన్డీయేలో ఉక్కపోత మొదలైంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటే ఆ పార్టీ తమను కబలించేయడం తథ్యమని అవగతమైంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో మోడీ షా డబులింజన్ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగా సాగనంపే వ్యూహానికి మరింత పదును పెట్టింది. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ ఇలా ఒకొక్క పార్టీ బయటకు వెళ్లి పోయాయి.
అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేయలేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది. రేపో మాపో బీజేపీలో విలీనం కావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక మహారాష్ట్రలో శివసేన పరిస్థితి తెలిసిందే. బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే శివసేన సైతం త్వరలోనే చరిత్రగా మిగిలిపోతుంది. బీహార్ ముఖ్యమంత్రి జేడీయు నేత నితీష్ కుమార్ కూ పొగపెట్టినా ఆయన తెలివిగా ముందే మేల్కొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. ఇలా సంకీర్ణ ధర్మానికి తిలోదకాలిచ్చి, మిత్రధర్మాన్ని విస్మరించి భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేసే క్రతువును గత ఎనిమిదేళ్లుగా నిర్విఘ్ణంగా కొనసాగించిన బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మరో సారి సంపూర్ణ అధికారంతో కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం కష్టసాధ్యమన్న సంకేతాలు బలంగా కనిపించడంతో మళ్లీ మిత్రపక్షాల కోసం వల విసురుతోంది.
స్వయంగా దూరం చేసుకున్న తెలుగుదేశం వంటి పార్టీలను దువ్వుతోంది. నీకిది..నాకిది అన్న చందంగా బేరసారాలు సాగిస్తోంది. అయితే గత ఎనిమిదేళ్లుగా ఎన్డీయే భాగస్వామ్యపక్షాల విషయంలో బీజేపీ తీరును గమనించిన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దగ్గరై మరో సారి బలహీనమవ్వడానికి ముందుకు వస్తాయా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాల అస్థిత్వాన్ని దెబ్బతీసి, వాటిని నిర్వీర్యం చేసే ఎత్తుగడలను గత ఎనిమిదేళ్లుగా దగ్గర నుంచి చూసిన రాజకీయ పార్టీలు సాధ్యమైనంత వరకూ బీజేపీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే బీజేపీ తనంత తానుగా స్నేహహస్తం చాచినా అందుకోవడానికి పార్టీలు ముందు వెనుకలాడు తున్నాయంటున్నారు.