చర్యలెప్పుడు.. కేంద్రాన్ని నిలదీసిన బాబు
posted on Jun 15, 2023 @ 11:58AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాల గురించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైపోయిందని ఆయా పార్టీల అధినేతల మాటలను బట్టి అర్ధమౌతోంది. అయితే ఇరు పార్టీల మధ్యా పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణుుల తెలుగుదేశం శ్రేణులు కలిసి పని చేయడం కనిపిస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రెపరెపలాడిన జనసేన జెండాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
సరే అది అలా ఉంచితే.. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం, జనసేనలకు బీజేపీ కూడా జత కలుస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న జనసేనాని శపథం నెరవేర్చుందుకు ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువ అవుతుందా? ఈ మేరకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసిందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. అయితే ఇటీవల ఏపీలో పర్యటించిన జేపీ నడ్డా, అమిత్ షాలు తమతమ ప్రసంగాల్లో జగన్ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై విమర్శలు గుప్పించారు.
దీంతో బీజేపీ.. వైసీపీల మధ్య ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన బంధం పుటుక్కుమందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే బీజేపీ, తెలుగుదేశం పొత్తు పై మాత్రం రెండు పార్టీల నుంచీ ఒక్కటంటే ఒక్క మాట కూడా బయటకు రాలేదు. అయితే చంద్రబాబును హస్తినకు పిలిపించుకుని మరీ అమిత్ షా, నడ్డాలు చర్చించిందేమిటన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుప్పం పర్యటనలో బీజేపీకి సూటి ప్రశ్నలు సంధించారు. గత నాలుగేళ్లుగా బీజేపీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీకి సూటి ప్రశ్నలు సంధించారు. తన కుప్పం పర్యటనలో భాగంగా నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సంచలనంగా మారాయి. అయితే ఆయన కేంద్రం విధానాలను విమర్శించలేదు. నడ్డా, షాలు ఏపీలో తమతమ పర్యటనల సందర్భంగా జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై చేసిన విమర్శలపైనే చంద్రబాబు కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. విమర్శలు సరే చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు.
సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సీఎం అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలి? అని నిలదీశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో గ్రానైట్ దోపిడీని ప్రస్తావించారు. బ్రాందీ షాపుల్లో రెండు వేల రూపాయల నోట్లను వైసీపీ నేతలు మార్చుకుంటున్న సంగతినీ ఎత్తి చూపుతూ చర్యలు ఉంటాయా ఉండవా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కుప్పం ప్రసంగంలో చంద్రబాబు జగన్ సర్కార్ పై చేసిన విమర్శలూ ఘాటుగానే ఉన్నాయి. అయితే పొత్తుల చర్చ వేళ జగన్ సర్కార్ పై చర్యలెప్పుడు అంటూ కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
పోత్తుల కోసం, ప్రయోజనాల కోసం కాకుండా ప్రభుత్వ దోపిడీని అరికట్టాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం తెలుగురాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాదిలో నిన్నటి దాకా అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకలో బీజేపీ అధికారం కోల్పోవడం, నిన్న మొన్నటి దాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల హస్తినలో అమిత్ షా, నడ్డా లు చంద్రబాబుతో భేటీ కావడానికి రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడింది. ఆ సందర్భంగా వారి మధ్య ఏం చర్చ జరిగిందన్న విషయంలో కుప్పం చంద్రబాబు ప్రసంగం ఒక క్లారిటీని ఇచ్చింది. ఏపీలో బీజేపీకి ఉన్న స్టేక్ దాదాపు జీరో అనే చెప్పాలి. అయితే ఆ పార్టీకి తెలంగాణలో ఎంతో కొంత హోప్ ఉంది. స్కోప్ ఉంది. తెలుగుదేశం సహకారం అందితే.. అక్కడ అధికారం దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయమూ కమలం టాప్ బ్రాస్ లో వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం సహకారం విషయంలోనే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో చర్చలు జరిపారని అంటున్నారు. అయితే తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే ఏపీలో బీజేపీ అధికార పక్షం అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న షరతు చంద్రబాబు షా, నడ్డాల ముందు పెట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు బీజేపీ సానుకూలంగా స్పిందించిందనడానికి తార్కానమే ఇటీవల ఏపీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు జగన్ సర్కార్ అవినీతి, కుంభకోణాలను నేరుగా ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించారని అంటున్నారు. ఆ విమర్శలను ఆసరాగా తీసుకునే మాటలు కాదు చేతలెప్పుడని చంద్రబాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారన్నది పరిశీలకుల విశ్లేషణ.