ప్రజాస్వామ్య విలువలకు బాబు పట్టం!
posted on Jun 15, 2023 @ 10:00AM
హత్యా రాజకీయాలే రాజ్యమేలుతున్న నేటి రోజులలో వాటికి దూరంగా ఉంటూ రాజకీయాలలో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు పాల్పడాలని కోరుకునే సొంత పార్టీ నేతలను సైతం మందలిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రసారమాధ్యమాలలోనూ వైరల్ అయ్యింది.
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం కీలక నేత, ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబును తన నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఒక విపక్ష నేత ఎలిమినేషన్ ప్రతిపాదన చేశారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ గా స్పందించారు. ఏం తమాషాగా ఉందా.. హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఉండవు. అటువంటి ఆలోచనలనే నీ మనసులోంచి తుడిచేయ్ అని మందలించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రత్యర్థే తన నోటితో చెప్పారు. ఇంతకీ తన ప్రత్యర్థిని ఎలమినేట్ చేయాలన్న అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరంటే ప్రస్తతం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన హత్య చేయమన్నది ఎవరినంటే.. అప్పట్లో ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ భర్త కొండా మురళిని. ఈ విషయాన్ని కొండా సురేఖ దంపతులు స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ నోటితో చెప్పారు. ఇంతకీ కొండ మురళీ, కొండ సురేఖ.. సదరు ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..
ప్రస్తుతం చంద్రబాబు పాలనతో వైయస్ జగన్ పాలన పోల్చుకుంటే. చంద్రబాబు పాలన వంద శాతం గుడ్ అని వారు స్పష్టం చేశారు. అలాగే తనను ఎన్‌కౌంటర్ చేయాలన్నప్పుడు..ఓ ఎమ్మెల్యే భర్త విషయంలో తాను అలా చేయలేనని చంద్రబాబు కరాఖండీవగా చెప్పారని.. అదే వీరైతే.. అంటే వైయస్ జగన్ ప్రభుత్వం తనను వందశాతం ఎన్ కౌంటర్ చేయించేదని కొండా మురళి వివరించారు. సరిగ్గా అదే సమయంలో కొండా సురేఖ జోక్యం చేసుకుని ఎర్రబెల్లి దయాకర్ పోయి.. సీఎం చంద్రబాబు కాళ్ల మీద పడితే.... ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎం మాట్లాడుతున్నావ్ దయాకర్.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఓ ఎమ్మెల్యే భర్తను చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఏమైనా మాట్లాడు కానీ.. ఇది కుదరదని ముఖం మీదే చంద్రబాబు క్లియర్ కట్‌గా చెప్పారని.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు.. ఆ తర్వత తమతో ఈ విషయం చెప్పారని కొండా సురేఖ స్వయంగా స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అయితే... మురళిని ఎన్ కౌంటర్ చేసేసేవారని కొండ సురేఖ అదే ఇంటర్వ్యూలో చెప్పారు.
తెలుగుదేశం అధినేత , విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటే.. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి, సైబరాబాద్ నిర్మాణానికి దోహదపడిన వ్యక్తిగా అంతా భావిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గత నాలుగేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులే కాదు.. జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తమ మాటలతో విరుచుకుపడిపోతారన్న విషయం విదితమే. అలాంటి వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలినే కాదు.. వీరిద్దరి మధ్య తారతమ్యాలను సైతం కొండ మురళి దంపతులు వివరించిన విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.