అవినాష్ ను జగన్ కాపాడుతున్నారు.. సుప్రీంలో సునీత
posted on Jun 14, 2023 @ 4:20PM
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలుత అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా గత ఏప్రిల్ 20 ఆమె పిటిషన్ ను సుప్రీం విచారించి.. ఆ మధ్యంతర బెయిలుపై స్టే విధించింది. ఆ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని వ్యాఖ్యానించింది.
ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఆ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉందన్న సాంకేతిక అంశాన్ని ఆసరాగా చేసుకుని అవినాష్ అప్పట్లో అరెస్టును తప్పించుకున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు విచారణ సందర్భంగా సునీత సుప్రీం కోర్టు ఎదుట పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తొలి సారిగా తన తండ్రి హత్య కేసు దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని సునీత ఆరోపించారు. అవినాష్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ కాపాడుతున్నారని కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా తన పిటిషన్ లో ఏపీ సీఎం, తన సోదరుడు అయిన జగన్ పై కూడా సునీత ఆరోపణలు చేశారు. ఒక వైపు కేసు దర్యాప్తు జరగుతుండగానే సీఎం హోదాలో అసెంబ్లీలో జగన్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వడమేమిటని పేర్కొన్న ఆమె.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల యత్నాలు చేసిందని ఆరోపించారు. మొత్తం మీద హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. సరే ఆ తరువాత అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు లభించడం, ఆయనను అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే పూచికత్తుపై విడుదల చేయాలని తెలంగాణ కోర్టు పేర్కొనడంతో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేసి ఆ వెంటనే పూచీకత్తుపై విడుదల చేసింది అది వేరే సంగతి.
అయితే సునీత సుప్రీంలో తన పిటిషన్ లో పేర్కొన్న అంశాలనే సీబీఐ తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ కేసులో జగన్ పేరును సీబీఐ తొలిసారిగా ప్రస్తావించింది. వివేకా హత్య సంగతి ఏపీ సీఎం జగన్ కు ముందుగానే తెలుసునన్నది తన దర్యాప్తులో తేలిందనీ, దానిని నిర్ధారించురకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేననీ కూడా ఆ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. అయితే అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత మళ్లీ సుప్రీంలో దాఖలు చేసిన పటిషన్ లో సీబీఐ ఇంప్లీడ్ కాలేదు. సునీత పిటిషన్ ఈ నెల 19న సుప్రీం ముందుకు రానున్న నేపథ్యంలో సీబీఐ ఏం చేస్తుందన్నదానిపై అందరి ఆసక్తి నెలకొని ఉంది.