లేదు లేదంటూనే జగన్..!
posted on Jun 14, 2023 @ 12:03PM
ఏపీలో ముందస్తుకు అవకాశం లేదని వరుసగా జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమౌతున్నాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో సన్నాహాలు ప్రారంభించేయడమే కాకుండా ఆయా రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాల ప్రక్రియ షురూ కూడా చేసేసింది.
ఈ పరిస్థితుల్లో ఒక వేళ వద్దు వద్దు అంటున్న జగన్ ముందస్తుకు మొగ్గు చూపినా ప్రయోజనం ఉండదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కూడా ఏపీలో ముందస్తు చర్చకు తెరపడటం లేదు. ఒకరి తరువాత మరొకరుగా రాజకీయ పార్టీల నేతలే కాదు, పరిశీలకులు కూడా ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. తొలుత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆ వెంటనే ఒక రోజు వ్యవధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ మంగళవారం రచ్చబండలో రఘురామకృష్ణం రాజు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అన్నారు. సాంకేతికంగా ఏపీలో ముందస్తుకు అవకాశాలు లేవని విస్పష్టంగా తెలుస్తున్నా.. రాజకీయ నాయకులు, పరిశీలకులు, చివరాఖరికి సామాన్య జనం కూడా ముందస్తు చర్చను పదే పదే ముందుకు తీసుకురావడం విశేషం.
ఇందుకు వారు చెబుతున్న కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్నది అభివృద్ధి రహిత సంక్షేమం. ఒక్కసారి ఈ సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయంటే, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఇసుమంతైనా ఉండదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి..మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిగత సిబ్బంది చాంబర్ కు తాళం వేయడమే నిలువెత్తు నిదర్శనం. గత ఆరు నెలలుగా జీతాలు అందని కారణంగా వారీ పని చేశారు. మంత్రి వ్యక్తిగత సిబ్బందికే వేతనాలు అందడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహంతో ఉన్న కేంద్రం, దొంగ అప్పులను నివారిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది తేలిపోతుందన్నారు. ఇప్పటి వరకూ ఏదో కేంద్రం దయతో, కరుణతో అప్పులు తెచ్చుకుంటూ, తిప్పలు పడుతూ బండి లాక్కొస్తున్న జగన్ కు ముందు ముందు ఆ పరిస్థితి ఉండదు. దీంతో సంక్షేమ పథకాలు కొనసాగించి మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశ ముఖ్యమంత్రి రోజు రోజుకూ కొడిగడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు లేదు లేదంటూనే అందుకే మొగ్గు చూపుతారని, ఆయన కాదు లేదు అన్నారంటే ఔను, ఉంది అనే అర్ధమని అంటున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను షురూ చేసినా.. కేంద్రం పెద్దల వద్ద తన పలుకుబడిని ఉపయోగించుకుని జగన్ అనుకున్నది సాధించుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు గత నాలుగేళ్లుగా అడుగు కూడా ముందకు పడని జగన్ అక్రమాస్తుల కేసులను, ఎవరికీ లభించని విధంగా వివేకా హత్య కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి లభిస్తున్న వెసులు బాట్లను ప్రస్తావిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి రెండు వారాలైనా సిబిఐ ఇంత వరకూ సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లకపోవడమే కాకుండా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించినా, సిబిఐ ఇంప్లిడ్ కాకపోవడం వెనుక ఉన్న రహస్యం జగన్ పలుకుబడేనన్నది పరిశీలకుల విశ్లేషణ.
ఈ నేపథ్యంలోనే ముందస్తు నిర్ణయం విషయంలో సమయం మించిపోయినా కావాలనుకుంటే జగన్ కేంద్రం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లయెన్స్ చేసి సాధించుకోగలరని, అందుకే ముందస్తు దారులు ముగిసిపోయినా ఏపీలో మాత్రం ఆ చర్చకు తెరపడటం లేదనీ అంటున్నారు.