జగనానందయ్య శిష్య పరమాణువు వాసిరెడ్డి పద్మ
posted on Jul 20, 2023 @ 11:16AM
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన తొలి, మలి కేబినెట్‌లోని మంత్రి పుంగవులు.. మంత్రులుగా హుందాగా తమ తమ శాఖల వారీగా.. శాఖ పరంగా ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకరు ఇద్దరు మంత్రులు అదీ కూడా మచ్చుకు ఒకటో రెండో సమావేశాలు సమీక్షలు నిర్వహించడం తప్పితే శాఖ మీద పట్టు సాధించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
అయితే మంత్రులలో అత్యధికులు మాత్రం ప్రెస్‌మీట్ లు పెట్టి ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై బండ బూతులతో విరుచుకు పడిపోవడం, తద్వారా అధినేత జగన్ మొప్పు పొందడం అన్న అంశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ విషయంలో వాసిరెడ్డి పద్మ ఒక అడుగు ముందుకు వేశారని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆమె పై సెటైర్లు వేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె పదవిని ముఖ్యమంత్రి జగన్ ఊడబీకి చాలా కాలం అయినా ఆ విషయం కూడా తెలియకుండా ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నానన్న భ్రమతో వాసిరెడ్డి పద్మ ఇస్తున్న కలరింగ్ సూపర్బ్ గా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
ఈ ఏడాది మేలో ముఖ్యమంత్రి జగన్ ఓ రహస్య జీవో తో వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఎసరు పెట్టారనీ, అయితే ఆ విషయం ఆమెకు తెలియదో.. లేక తెలిసినా అది రహస్య జీవో కనుక మరెవరికీ తెలియదన్న ధీమాయో కానీ వాసిరెడ్డి పద్మ మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో రౌండే టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేయడం వంటి చర్యలతో నవ్వుల పాలౌతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అయినా పదవి ఉందో.. ఊడిందో కూడా తెలుసుకోకుండా ఇలా నోటీసులు, జీవోలు, రౌండ్ టేబుల్ సమావేశాలంటూ హడావుడి చేయడం.. ఇంకోవైపు వరుస పెట్టి నోటీసులు జారీ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగనన్న పదవి పీకేసిన సంగతి ఇంతకీ వాసిరెడ్డి పద్మకు తెలుసా? లేదా? అనే సందేహాలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం.
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకు వాసిరెడ్డి పద్మను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ పదవిలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని అందుకు సంబంధించిన జీవోని సైతం ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అసలు లెక్క ప్రకారం 2024 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే జగన్ సర్కారు సైలెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలాన్ని రెండేళ్లు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 24న గెజిట్ ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ యాక్ట్ -2023 మే 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా జీవోఎంఎస్ నెంబర్ 23 జారీ చేసింది. ఈ ఏడాది మే 9వ తేదీన ఈ జీవో జారీ అయినట్లు తెలుస్తుంది. మే 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది.
దీంతో ఆ రోజుతో వాసిరెడ్డి పద్మ పదవి కాలం ముగిసిపోయినట్లు అయింది. అయినా ఆమె ఇవేమీ పట్టకుండా.. జగనన్న స్ట్టైల్‌లో దూసుకోపోవడం చూస్తుంటే.. గంతకు తగ్గ బొంత అనే వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్‌లో వినవస్తున్నాయి. అయినా పదవి పోయిన తర్వాత.. కూడా ఇంకా ఆ పదవిలోనే ఉన్నట్లు వాసిరెడ్డి పద్మ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి. అయినా వాసిరెడ్డి పద్మ భర్త వెస్లీకి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. పార్టీలోకి వస్తానన్న ఒకే ఒక్క కండిషన్‌తో అప్పట్లో ఆమె వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ క్రమంలో 2014లోనే కాదు.. 2019 ఎన్నికల్లో కూడా ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటు అయితే కేటాయించలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని కాంపన్ సేట్ చేయడానికే జగన్ వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారనీ, అయితే అది కూడా కూడా మూడునాళ్ల ముచ్చటే అయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా జగన్ ప్రభుత్వంలో జగనానందయ్య శిష్యులు లెక్కలు మిక్కిలి ఉన్నారని.. వారిలో వాసిరెడ్డి పద్మ అనే ఓ శిష్యు పరమాణువుగా చేరిపోయారనే ఓ వ్యంగ్య చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.