మాజీ మంత్రి చిలకూరి రాంచంద్రారెడ్డి ఇక లేరు
posted on Jul 21, 2023 @ 11:06AM
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిలకూరి రాంచంద్రారెడ్డి (82) గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ఆయన్ను ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. రాంచంద్రారెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శస్త్ర చికిత్సలు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన హఠాన్మరణం చెందినట్లు వైద్యులు తెలిపారు. రాంచంద్రారెడ్డి స్వస్థలమైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాంచంద్రారెడ్డి నాలుగు సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించారు. రాంచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు పలువురు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. రాంచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రేవంత్ అన్నారు.