ప్రయోగాల పుట్ట టీడీపీ.. ఆర్టిఫిషియల్ యాంకర్‌తో యువగళంలో ప్రయోగం!
posted on Jul 20, 2023 @ 2:39PM
కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నయినా కృత్రిమ మేధతో సంపూర్ణంగా నిర్వర్తించవచ్చు. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు అయితే, మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మహోన్నతమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులూ యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా మనిషే వాటిని తయారు చేస్తున్నారు.
మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లోచేస్తాయని 1965లోనే సైంటిస్ట్, నోబెల్ గ్రహీత హెర్బర్ట్ సైమన్ చెప్పారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. మనిషి మనుగడ ఇప్పటికే సౌకర్యవంతం కాగా ఏఐతో ఇది మరింత సులభతరం అవుతుంది. ఇంకా చెప్పాలంటే సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా.. కృత్రిమ మేధా సంపత్తి మానవుడికి సవాలు విసురుతున్నది.
కాగా, తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రయోగాల పుట్టగా పేరుంది. చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే ఈ పార్టీ కార్యక్రమాలలో టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటుంది. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణానికి పునాది వేసిన ఘనుడు చంద్రబాబేనని తెలంగాణ ఈనాటి పాలకులు కూడా తడుముకోకుండా చెప్తున్న సంగతి తెలిసిందే. పార్టీ విషయానికి వస్తే 90ల్లోనే పార్టీ సభ్యులు, కార్యకర్తల వివరాలను కంపుటరైజేషన్ చేసిన చరిత్ర టీడీపీది. దేశ రాజకీయ చరిత్రలో అదే ప్రథమం. ఇలా టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు, టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఈ రోజు గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి గొప్పతనం గురించి చెప్పుకుంటుంటారు. అలాగే ప్రయోగం చేస్తే పోయేదేముంది సక్సెస్ అయితే అదే చరిత్ర అంటూ టీడీపీ మరో ప్రయోగం చేపట్టింది.
యాంకర్ లేకుండానే యాంకర్ తో యువగళం వార్తలు చదివించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో యువగళంలో వార్తలు చదివే యాంకర్‌ను రూపొందించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్ తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్ వేర్ డిజైన్ చేసింది. ఆ యాంకర్ కు వైభవి అని పేరు కూడా పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా యాంకర్.. లోకేశ్ చేపట్టిన యువగళం షెడ్యూల్ ను వివరించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలా చదివింది. కనిగిరిలో పాదయాత్ర షెడ్యూల్ వివరాల్ని వైభవి అందరికి తెలియజేశారు. ఈ వీడియో దాదాపు 1.40 నిమిషాలు పాటు ఉండగా ఈ వీడియోలో పాదయాత్ర సాగే గ్రామాలు, కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. ఇక నుంచి యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్ వైభవిని సిద్ధం చేసి ప్రయోగించారు.
టీడీపీ రాబోయే రోజుల్లో ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి ఇలాగే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఎఐ యాంకర్ కాన్సెప్ట్ తమదేనని టీడీపీ అంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉండే టీడీపీ దీంతో ఏఐ టెక్నాలజీలో కూడా ఓ అడుగు ముందుకేసినట్లయింది. కాగా, ఆర్టిఫీషియల్ యాంకర్ స్పష్టంగా తెలుగు చదవడంతో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడున్న న్యూస్ యాంకర్స్ కొందరు తెలుగును చంపేస్తుంటే ఆర్టిఫీషియల్ యాంకర్ వైభవి స్పష్టంగా వార్తలు ప్రజెంట్ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో మరికాస్త డెవలప్మెంట్ కావాల్సి ఉండగా ముందుముందు ఆ లోటుపాట్లు కూడా లేకుండా చేస్తామని టీడీపీ టెక్ విభాగం చెప్తుంది.