కడెం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో
posted on Jul 21, 2023 @ 10:55AM
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో కడెం నది ఉప్పొంగుతోంది. గోదావరి నదీ జలాలు వచ్చి చేరే కడెం ప్రాజెక్ట్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దాదాపు కడెం ప్రాజెక్టులోకి లక్షా 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 12 వరద గేట్లు ఎత్తి వేసి లక్షా 30 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో 6 వరద గేట్లు మొరాయిస్తున్న పరిస్థితి. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 70వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో లక్షా 30వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అయితే ప్రాజెక్టు సరైన మరమ్మత్తులు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రాజెక్ట్ ప్రమాదానికి గురైనప్పటికీ మరమత్తులు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ఆవేదన చెందుతున్నారు. కడెం ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గత సంవత్సరంలాగే ప్రాజెక్టు ప్రమాదభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.కడెం ప్రాజెక్ట్ నది నీటి మట్టానికి 31 మీటర్ల ఎత్తులో ఉంది. 174 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. క్యాచ్ మెంట్ ఏరియా 2,590 చదరపు కిలోమీటర్లు ఉంది.