మీడియా ఎదుట సజ్జల తడబాటు.. యార్లగడ్డకు హిత వాచకాలు!
posted on Aug 19, 2023 @ 11:29AM
ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి యార్లగడ్డ సెగ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీలో , ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జలపై గతంలో కూడా ఎమ్మెల్యేలు, మాజిలైన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పుడెప్పుడూ లేని విధంగా యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరుకున పడేశాయి.
దీంతో ఆయన అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి తనను తాను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు ఆయనను ఓ ఆట ఆడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన వివరణ.. వైసీపీ ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో విధానంలోనే వాడుకుంటుందన్న విషయాన్ని మరో సారి తేటతెల్లం చేసేశాయి. ఇంతకీ వైసీపీని వీడుతూ యార్ల గడ్డ ఏమన్నారంటే.. అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి తనను నడి సముద్రంలో వదిలేశారని ఆరోపించారు.
తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతాననీ, గెలుస్తాననీ ధీమా వ్యక్తం చేశారు. అలా గెలిచిన తరువాతే.. ఒక వేళ పులివెందుల నుంచి జగన్ విజయం సాధిస్తే.. అప్పుడే అసెంబ్లీలో ఆయనను కలుస్తానన్నారు. తాను పార్టీకి ఎంతో సేవ చేశాననీ, అయినా సజ్జల తనను కూరలో కరివేపాకులా తీసి పారేశారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం అప్పాయింట్ మెంట్ కోరితే సజ్జల పడనివ్వలేదనీ, గట్టిగా అడిగితే ఉంటే పార్టీలో ఉండు.. పోతే పో అన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సజ్జల తనను అవమానిస్తూనే ఉన్నారనీ, పంటి బిగువన భరించాననీ, కానీ ఇప్పుడు ఉంటే ఉండు పోతే పో అనడాన్ని మాత్రం సహించలేకపోయాననీ వెల్లడించారు.
ఈ విషయాలన్నీ యార్లగడ్డ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సజ్జల మీడియా ముందుకు వచ్చారు. తానలా అనలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన అన్న మరో మాట ఆయన యార్లగడ్డను ఉంటే ఉండు, పోతే పో అన్నారనే అందరూ నమ్మడానికి దోహదం చేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే.. ఎవరైనా ఇలాంటి విషయాలు బహిరంగంగా చెబుతారా? అలా చెప్పడం సమజసం కాదని అనడంతో అంతా సజ్జల యార్లగడ్డకు పొగపెట్టారని నమ్మే పరిస్థితి ఏర్పడింది. తాను యార్లగడ్డకు టికెట్ విషయంలో హామీ అయితే ఇవ్వలేదనీ, అలాగని వచ్చే ఎన్నికలలో పోటీకి చాన్స్ లేదని కూడా చెప్పలేదని వివరణ ఇచ్చారు. గన్నవరంలో వంశీ, యార్లగడ్డలలో ఒకరిటే టికెట్ లభిస్తుందన్న కోణంలో మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని చెప్పుకున్నారు. అయినా ఇటువంటి చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతాయనీ, వాటిని ఇలా బహిర్గతం చేయడం మంచిది కాదంటూ యార్లగడ్డకు హితవు పలికారు.
నాలుగు గోడల మధ్య తానేం అన్నా భరించాలి అన్న చందంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సజ్జల తీరు చూస్తుంటే.. వల్లభనేని వంశీ కోసం యార్లగడ్డకు పొగబెట్టారనీ, ఆయన ఎదురు తిరగడంతో కంగారు పడుతున్నారనీ అర్ధమౌతోందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానంతోనే నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన వైసీపీ.. మాజీ ఎమ్మెల్యే మాటలకు ఎందుకు అంత ఉలిక్కి పడుతోంది. గన్నవరంలో వంశీకి అనుకూలంగా సజ్జల వ్యవహరించిన తీరు బూమరాంగ్ అవుతోందన్న భయం వెంటాడుతోందా? అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి భయమే లేకపోతే ఎన్నడూ లేనిది మీడియా ముందుకు వచ్చి.. నేనేం అనలేదు మహప్రభో అని వేడుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాలినేని వంటి వారు తనపై విమర్శలు గుప్పించినా స్పందిచని సజ్జల ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడానికి తహతహలాడారు అని నిలదీస్తున్నారు.