ఇచ్చిందెంత.. దోచిందెంత? నిగ్గదీసి అడుగుతున్న జనం!
posted on Aug 19, 2023 7:07AM
ఏదేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యం. రాష్ట్రంలో అన్ని వసతులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే ప్రజలకు సంక్షేమం అందుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న ప్రక్రియ. ఈ ప్రక్రియను అవలంబిస్తేనే ఏ ప్రభుత్వమైనా నిలబడేది. మాది భిన్నమైన పాలన.. కేవలం సంక్షేమమే మా నినాదం అంటే ఆ ప్రభుత్వం బొక్కబోర్లా పడడం ఖాయం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా ఉంటేనే ఆ రాష్ట్రం సుభీక్షంగా ఉంటుంది. ఇందులో ఏది వదిలేసినా ఆ రాష్ట్రంలో ప్రజల ఆర్ధిక స్థితి దిగజారడం, వలసలు పెరగడం వంటివి తప్పదు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే.
రాష్ట్రానికి ఇతర దేశాల పెట్టుబడులు చాలా అవసరం. అందుకే ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకొని.. రాష్ట్రానికి వస్తే రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తుంటారు. టీడీపీ హయంలో కూడా గన్నవరం విమానాశ్రయానికి కొన్ని మెరుగు దిద్ది అంతర్జాతీయ విమానాల రాక కోసం ప్రభుత్వం విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కొన్ని నెలల పాటు ప్రభుత్వమే కొన్ని టికెట్ల ధరను చెల్లించేలా ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు మొదలు అయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రాయతీలు ఆపేశారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక మాట చెప్పారు. విమాన సర్వీసుల కంటే తల్లీ బిడ్డల ఆరోగ్యం ముఖ్యమని, ఆ రాయితీలు ఆపేసి ఆ డబ్బును గర్భిణీ, బాలింతల పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.
ఆనాడు బుగ్గన చెప్పిన ఆ మాటలు ఆహా ఓహో అనిపించి ఉండొచ్చు. జగన్ సర్కార్ పేదల కోసమే ఆలోచిస్తుందని, సంక్షేమ ఫలాలు తమకు అందుతాయని ప్రజలు భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవంలో వైసీపీ పంచేందుకు ఇప్పుడు తగిన ఆదాయం లేదు. కొండలా పేరుకుపోయిన అప్పులతో కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడానికే పరిమితమైంది. పరిశ్రమలు రాక.. పెట్టుబడి దారులు రాష్ట్రం వైపు చూడక నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది. ఆదాయం సరిపోక ప్రభుత్వం రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రోత్సాహక రాయతీలు వంటి వాటికి మంగళం పాడేసింది. కేవలం ఏ నెలకి ఆనెల వచ్చే ఆదాయానికి తోడు మరికొంత అప్పుచేసి పెన్షన్లు, జీతాలు, సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికే పాలన పరిమితమైపోయింది.
దీంతో ఏపీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై ఒకరకమైన ఏహ్య భావన కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కొత్తగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువే సంక్షేమాన్ని అందించారు. జగన్ వాటికి పేర్లు మార్చి నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు. దానికి కూడా భారీగా ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. రేషన్ డోర్ డెలివరీ లాంటి పథకాలు హంబక్ కావడం.. ప్రకటించే ప్రతి పథకానికి వంద కొర్రీలు పెడుతూ కోతలు విధించడంతో.. ఆ ఫలాలు అందినా ప్రజలలో సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీలో అంతర్మధనం మొదలైంది.
తాము ఇంత చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదేంటి అని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పీపుల్ సర్వేలు తీసుకుంటున్నారట. అయితే, కొందరు లబ్ధిదారులు లెక్కలేసి మరీ మీరిచ్చింది ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. ఇదిగో మేము కుటుంబానికి రూ.2 లక్షల వరకూ ఇచ్చామని వైసీపీ నేతలు చెప్తుంటే.. ప్రజలు తిరిగి నేతలకు దిమ్మతిరిగే సమాధానమిస్తున్నారు. మీరిచ్చే దానిలో పెన్షనే అధిక భాగం పెన్షనే ఉందనీ.. పైగా ఉందని.. అది గత ప్రభుత్వంలోనే పెంచారని, మిగతా మొత్తం గత ప్రభుత్వంలో కూడా అందిందని.. ఇప్పుడు వాటి పేర్లు మార్చి మాయ చేసారని లెక్కలు చెప్పడంతో నేతల ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు, మీరిచ్చిన దాని కంటే వందరెట్లు ఎక్కువగా రేట్లు పెంచి మా దగ్గర నుండి లాగేసుకున్నారని గణాంకాలతో సహా చెబుతున్నారు.ఈ ప్రజా చైతన్యం వైసీపీకి కాళ్ల కింద భూమిని కదిలించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సంగతి అటుంచి.. అసలు ప్రచారం కోసం జనం ముందుకు వెళ్లడం ఎలా అన్న గుబులు వారిలో మొదలైందంటున్నారు.