కొండలపై కొలువైతే దేవుడైపోయినట్లేనా? రిషికొండ బాగోతం అందుకేనా?
posted on Aug 19, 2023 @ 12:35PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ వ్యతిరేకి అవునా కాదా తెలియదు కానీ ఆయన హిందువు అయితే కాదు. ఇది జగన ఒక్కరే కాదు జగమెరిగిన సత్యం. భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వం భారత డీఎన్ఏలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు దేశం నిలువెత్తు నిదర్శనం. అయితే ఏపీ విషయంలో మాత్రం జగన్ హయాంలో ఒక కొత్తా దేముడు అవతరించాడు. ఈ విషయాన్ని ఆయన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
విశాఖ రిషికొండపై నిర్మాణాల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి రోజా, మాజీ మంత్రులు తిరుమల కొండపై వెంకన్న దేవుడు కొలువై ఉండలేదా? శ్రీశైలం కొండపై బ్రమరాంబికా సమేత మల్లికార్జునుడు కొలువుదీరలేదా? అంటూ కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి కొండలపై నివాసాలు వెలిశాయి కదా అని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నివాసాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమై ఉంటే.. ఆ విషయాన్ని కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిషికొండపై నిర్మాణాలు కూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కుండ బద్దలు కొట్టింది. అయినా వాటిని వేటినీ పట్టించుకోకుండా రిషికొండకు గుండు కొట్టి మరీ జగన్ సర్కార్ నిర్మాణాలను కొనసాగిస్తోంది? అదేమిటంటే.. దేవుళ్ల ఆవాసాలను ప్రస్తావిస్తున్నారు
వైసీపీ నేతలు. ఎవరి నాయకుడు వారికి దేవుడితో సమానమైతే అవ్వోచ్చు కానీ, తామనుకుంటున్నదే సర్వ జనులూ అనుకుని తారాలంటూ మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. అయినా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిందూ ఆలయాలు, దేవుళ్లే లక్ష్యంగా జరిగిన దాడులను కాకతాళీయంగా భావించలేని పరిస్థితిని ఆయన, ఆయన పార్టీ నేతలే స్వయంగా కల్పిస్తున్నారు. హిందువులంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న చర్యలపై హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని జగన్ సర్కార్ అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకటనేమిటి.. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకలు, జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తెలియంది కాదు.
వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏడుకొందలపై ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం, టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయాల హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగానే ఉన్నాయి. హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలను టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో వ్యక్తమౌతోంది. అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వెంకన్న దేవుడిని నల్ల రాయిగా అభివర్ణించిన కరుణాకరరెడ్డిని నియమించడంతో రాష్ట్రంలో కొత్తా దేముడవతరించాని వైసీపీ ప్రచారం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.