ఎవరీ గెడ్డం ఉమ?.. ఏమా కథ?
posted on Aug 19, 2023 @ 3:58PM
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు గెడ్డం ఉమ పేరు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. గెడ్డం ఉమ లగ్జరీ సామ్రాజ్యం పేరుతో కొన్ని చిత్ర రాజాలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటనే ఓ చర్చ జోరుగా సాగుతోంది. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గెడ్డం ఉమ హోదా అమాంతంగా పెరగిపోవడమే కాకుండా.. ఆమె పేరు సైతం మంచి ఫేమస్ అయిపోయిందనే ఓ ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది
జగన్ పార్టీ అధికారంలోకి రాక ముందు.. ఓ సాధారణ మహిళగా ఆమె వస్త్ర దుకాణాన్ని నిర్వహించేవారనీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఆస్తులు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయాయని, ప్రస్తుతం గడ్డం ఉమ కోట్లకు పడగలెత్తారన్న ప్రచారం సామాజిక మాధ్యమంలో మరో లెవల్ లో సాగుతోంది. మరోవైపు గతంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌ఛార్జీగా పని చేసిన, జగన్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి గెడ్డం ఉమ అత్యంత సన్నిహితురాలనే ఓ ప్రచారం సైతం ఉంది. అలాగే విజయసాయిరెడ్డి సహాయ సహాకారాలతోనే గెడ్డం ఉమ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవిని దక్కించుకున్నారని కూడా అంటున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరవాడలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన గెడ్డం ఉమ ప్రస్తుతం డూప్లెక్స్ ఇంటితో పాటు రెండు లగ్జరీ కార్లు ఉన్నాయని.. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకోవైపు ఉత్తరాంధ్ర నుంచి గంజాయి అక్రమ రవాణాలో ఈ గెడ్డం ఉమ హస్తం ఉందని.. ఇందులో ఆమెకు వైసీపీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటే.. అందుకు మహిళ కమిషన్ పదవిని అడ్డం పెట్టుకొని.. గడ్డం ఉమ చేస్తున్న దందాయే కారణమన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అదీకాక ఉత్తరాంధ్ర ఇన్‌చార్జీగా ఉన్న విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని.. సెటిల్‌మెంట్ల దందాతో గెడ్డం ఉమా బాగా సెటిల్ అయ్యారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.
అయినా సీఎం జగన్ గురించి కానీ.. ఆ పార్టీలో ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు కీలక చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి గురించి కానీ.. ఈ గెడ్డం ఉమా మాటాల్లో వింటే.. ముఖ్యంగా విజయసాయిరెడ్డి సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లండంలో ఆమె గారు నూటికి నూరు శాతం సఫలీకృతులయ్యారనే ఓ ప్రచారం సైతం ఉత్తరాంద్ర జిల్లాలో కొనసాగుతోంది. అంతేకాదు.. విజయసాయికి ఉత్తరాంద్ర ఇన్‌చార్జీ పదవి గోల్ మాల్ గోవిందం అయిందంటే.. ఆ వెనుక గెడ్డం ఉమా గారి హస్తం ఉందనే ఓ ప్రచారం సైతం నేటికి వాడి వేడిగా నడుస్తోంది. అంతే కాదు.. ఈ గెడ్డం ఉమ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారని.. ఆ క్రమంలో టీవీ డిబెట్లు, చర్చ కార్యక్రమాల్లో సైతం పాల్గొని.. జగన్ పార్టీపై ఈగ వాలనివ్వకుండా ఉంటారనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.