దటీజ్ రేవంత్.. అనుకుంటే సాధించేస్తారంతే!
posted on Dec 6, 2023 @ 1:59PM
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి గురువారం (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలతో పాటు తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులూ కూడా హాజరౌతున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులు కూడా హాజరుకానున్నారు. అదలా ఉంచితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనీ, అదీ ఈ సారి ఎన్నికలలోనే సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందనీ, మూడు నాలుగు నెలల ముందు ఎవరూ కనీసం ఊహించనైనా ఊహించి ఉండరు. కానీ అసాధ్యం అనుకున్న దానిని అనితర సాధ్యుడిగా రేవంత్ సాధ్యం చేశారు. చేసి చూపించారు. ఇందు కోసం కలిసి వచ్చిన అంశాలు ఎన్నైనా ఉండనీ కానీ.. అసలు సూత్రధారి మాత్రం రేవంత్ రెడ్డే అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.
అయితే, మనసు పెట్టి నిబద్దతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడి అసలు రాజకీయాలలోకి వచ్చిందే ముఖ్యమంత్రి కావాలని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నిజం అదే . అసలు రాజకీయాలలో ఓనమాలు నేర్చుకొనే సమయంలోనే రేవంత్ ఈ విషయాన్నీ సహచరులకు చెప్పారట. తాను ఏ రోజుకైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అప్పట్లోనే ధీమాగా చెప్పేవారట. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రేవంత్ రెడ్డి లాంటి ఒక నూతన రాజకీయ నేత సీఎం కావాలనుకోవడం అత్యాశే అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్దండులైన నేతలెందరో అప్పుడు రాజకీయాలలో ఉన్నారు. అసలు సహజంగా కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన నేత మహా అయితే తాను మంత్రి కావాలని ఆశిస్తారు. కానీ, రేవంత్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సమయంలోనే తాను ముఖ్యమంత్రి కావాలని బలంగా నిర్ణయించుకొని రాజకీయాలలో అడుగు పెట్టారు.
రేవంత్ తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో పొలిటికల్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్సీగా అసెంబ్లీలో ఉన్నారు. రేవంత్, నాగేశ్వర్ ఇద్దరూ అసెంబ్లీలో ఒకే బెంచ్ లో కూర్చొనేవారు. ఆ సమయంలోనే రేవంత్ నాగేశ్వర్ తో తానెప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతాను సార్ అని చెప్పారట. తాజాగా ఎన్నికలకు ముందు రేవంత్ తో నాగేశ్వర్ ఇంటర్వ్యూలోనే ఈ విషయం పంచుకున్నారు. అంటే రేవంత్ ఎంత కాన్ఫిడెన్స్ తో, ఎంత ఆత్మవిశ్వాసంతో రాజకీయాలలో అడుగు పెట్టారో అర్ధమౌతుంది. ఆయన ఎదిగిన తీరు చూసినా ఆయన ఏ స్థాయిలో హార్డ్ వర్క్ చేశారన్న విషయం అవగతమౌతుంది. 1969 నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి.. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో గెలిచి.. ఆ తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తెలుగుదేశం గూటికి చేరారు. అక్కడ నుండే మొదలైంది రేవంత్ రెడ్డి అసలు సిసలైన రాజకీయ ప్రయాణం.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అతి కొద్ది కాలంలోనే చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడంలో తర్ఫీదు ఇచ్చారు. 2014-17 మధ్య కాలంలో తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ చంద్రబాబును కలిసి తన పరిస్థితిని వివరించి సామరస్యపూర్వకంగానే 2017 అక్టోబరులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడాదికే అంటే 2018లో ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగారు. కేసీఆర్ సర్కార్ కంట్లో నలుసై పోరాటం చేశారు. అందుకే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది.
ఏకంగా ముగ్గురు మంత్రులు ఒక్క కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, అక్కడే మకాం వేసి ప్రచారం చేసి రేవంత్ ను ఓడించారు. కానీ అనూహ్యంగా 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. అక్కడే రేవంత్ పొలిటికల్ కెరీర్ మరో మలుపు తిరిగింది. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు పెరిగాయి. రేవంత్ క్యాలిబర్ ఏంటో తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు 2021 జూన్ 26న ఆయనను టీపీసీసీ అధ్యక్ష్యుడిగా ప్రమోట్ చేశారు. 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్.. సరిగ్గా రెండేళ్లలోనే పార్టీని గాడినపెట్టడమే కాదు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దటీజ్ రేవంత్.