జయంట్ కిల్లర్ యశస్విని రెడ్డి.. ఎవరీమె?
posted on Dec 7, 2023 @ 11:26AM
సీనియర్ నేత, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి, పాలకుర్తి నుండి పోటీచేసిన ఎర్రబెల్లి దయాకరరావు ఈసారి చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి అనే 26 ఏళ్ల యువతి యర్రబెల్లిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమికి ముందు ఎర్రబెల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఒకసారి ఎంపీగా గెలిచారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓటమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కూడా తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి సునాయాసంగా గెలిచి సత్తా చాటారు. అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను కాంగ్రెస్ అభ్యర్థి, 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు. అమెరికా నుండి వచ్చిన యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓటమి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం చర్చ అంతా యశస్వినీ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎవరు? రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం నెటిజనులు అంతర్జాలంలో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. యశస్విని రెడ్డి బిటెక్ పూర్తి చేసి అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వరంగల్ వచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఏకంగా మంత్రిపైనే గెలిచి సంచలన విజయం అందుకున్నారు.
ఒక్క ఎర్రబెల్లి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ ప్రదీప్ రావును ఓడించారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు. అది వేరే సంగతి. తన రాజకీయ అనుభవం అంత వయస్సుకూడా లేని యువతి చేతిలో పరాజయం అంటే ఎర్రబెల్లికి పరాభవమే అనడంలో సందేహం లేదు. మూడున్నర దశాబ్దాలుగా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా ఉన్న వ్యక్తికి ప్రత్యర్థిగా పోటీలో దిగడమంటే ఆషామాషీ కాదు. బాగా పాపులారిటీ, సత్తా ఉన్న నేతలే వెనక్కి జంకుతారు. కానీ అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించి యశస్విని రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి దయాకర్ ట్రాక్ రికార్డును బద్దలు కొట్టారు.
నిజానికి యశస్వినీ స్థానంలో ఆమె అత్త ఝాన్సీ రాణి పోటీ చేయాల్సి ఉంది. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె ఎన్నారై కావడం.. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఎదురైంది. ఆమె భారత పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల సమయానికి పౌరసత్వం రాకపోవడంతో.. ఆమె తన స్థానంలో యశస్వినీ రెడ్డిని దింపారు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎర్రబెల్లిపై యశస్విని పోటీకి దిగడంతో.. ఆమె విజయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు.. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ ఒక సారి నినాదం చేసి ఇబ్బంది పడ్డారు కూడా.
అయితే ఆరంభంలోని తడబాటును అధిగమించి ప్రచారాన్ని జోరెత్తించారు. ప్రజాభిమానాన్ని గెలుచుకుని ఎర్రబెల్లి ట్రాక్ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించారు. సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రిగా ఎర్రబెల్లి ప్రజలకు సుపరిచితుడే అయినప్పటికీ, యశస్విని రెడ్డి వైపే జనం మొగ్గు చూపారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తీరుపై నియోజకవర్గ ప్రజలలో అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తాయి. దానికి తోడు కాంగ్రెస్ వేవ్.. అన్నిటికీ మించి కొత్త ముఖం, పిన్న వయస్సు, రాజకీయ అనుభవం లేని ప్రత్యర్థిపై విజయం సునాయాసమన్న అతి విశ్వాసంతో ఎర్రబెల్లి ఆరంభంలో పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితి గమనించి రంగంలోకి దిగేటప్పటికే చేయిదాటిపోయింది. నియోజకవర్గంలో అనుచరుల ఆగడాలు దయాకర్ రావుపై ప్రజలలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అదే యశస్వినికి ఓటు బ్యాంకుగా మారింది. అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డికి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు ప్లస్ అయ్యింది. ఫలితాలలో యశస్విని మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించగా దయాకర్ రావు ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయారు.