12 మందితో కొలువుదీరనున్న రేవంత్ కేబినెట్
posted on Dec 7, 2023 @ 10:02AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్ 7) సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిముషాలకు ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు రాజ్ భవన్ కు అందాయి.
కాగా రేవంత్ కేబినెట్ లో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికీ చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కింది. ఆ తరువాత నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవకాశం లభించింది.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావులు రేవంత్ కేబినెట్ లో ఉంటారు. కాగా తన కేబినెట్ లో ఉన్న వారికి రేవంతే స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించినట్లు చెబుతున్నారు.