అప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పుడు ములుగు సీతక్క
posted on Dec 7, 2023 @ 1:46PM
కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో నూతనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 2004లో చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదిన ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే.
రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో సీతక్క ఆయన వెంట నడిచారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సుయాత్ర కూడా చెల్లెలు సెంటిమెంట్ తో ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయంలో ప్రారంభమైంది. ములుగు నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ నిర్వహించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ వంతంగా అధికారంలోకి రాగలిగింది.
సబితా ఇంద్రారెడ్డిని సెంటిమెంట్ గా భావించిన రాజశేఖర్ రెడ్డి నాడు సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కృతజ్ఞత చాటారు. మరి రేవంత్ రెడ్డి సీతక్క కు ఏకంగా డిప్యూటిసీఎం పదవి ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అది కూడా కీలక శాఖ బాధ్యతలు అప్పగించడం ఈ చర్చకు దారి తీసింది.
సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం ఎన్నుకోబడ్డారు. అంతే కాదు ఆమె అఖిల భారత మహిలా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు.
ధనసరి అనసూయ పూర్వాశ్రమంలో నక్సలైట్. 13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. సీతక్క 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు ఏడో తరగతి విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణతో సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరారు. నక్సలైట్ గా ఉన్న సమయంలో జననాట్య మండలి కళాకారులు గద్దర్, విమలక్క ఆమె గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే నాటకాలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపు, అధికవడ్డీలకు వ్యతిరేకంగా ఆమె విరోచితంగా పోరాడారు. గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.గిరిజన రైతాంగ పోరాటానికి బాసటగా నిలిచారు. పెత్తందార్లు గిరిజన అమాయకులపై కాల్పులు జరిపి చాలా మందిని చంపివేశారు, స్త్రీలను అవమానించారు. భూస్వాములు చేసిన ఈ హత్యలపై అప్పట్లో పాలకులు కానీ, పోలీసులు కాని ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో గిరిజన సాయుధపోరాటం అనివార్యమైంది. ఈ పోరాటానికి సీతక్క నాయకత్వం వహించారు. బెంగాల్ లోని నక్సల్బరీ ఉద్యమం ఆమెకు ప్రేరణగా నిలిచింది.
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు. దీంతో పోరుబాట వదిలి లొంగిపోయారు. ఆరోగ్య కారణాలరీత్యా ఆమె జనజీవన స్రవంతిలో కలిసారు. సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు. ఈ సమయంలో వరసకు ఆమె బావ అయిన దళకమాండర్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు. ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి కల్సిన తర్వాత హైదరాబాద్లో న్యాయవాదిగా మారారు. సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండటంతో అప్పటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ములుగు టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం చెందారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైంది. ఈ సమయంలో చంద్రబాబు రెండోసారి ములుగు టికెట్ ఇచ్చి సీతక్కను గెలిపించుకున్నారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014లో టీడీపీ అభ్యర్థినిగా బరిలో దిగారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.తెలంగాణవాదం బలంగా ఉండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే ములుగు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ నక్సలైట్ నాగజ్యోతిపై గెలిచారు.