సీఎం రేవంత్.. కాంగ్రెస్ కు అన్నీ మాంచి శకునములే!
posted on Dec 7, 2023 9:03AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే వారెవరు? వారి పేర్లేమిటి, శాఖలేమిటి అన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మంత్రివర్గ కూర్పు విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం అదీ కాంగ్రెస్ పార్టీలో ఆయన కన్నా సీనియర్లు, వయస్సులో ఆయన పెద్దవాళ్లు, తొలి నుంచీ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. అయినా హైకమాండ్ రెండో ఇలోచన చేయకుండా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. సిఎల్‌పి నేతగా రేవంత్ రెడ్డి ఎంపికైనట్లు ప్రకటన చేసిన సందర్భంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని డైనమిక్ లీడర్‌గా అభివర్ణించారు. ఆయన కన్నా పార్టీలో సీనియర్లు, వయస్సులో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అదే ప్రధాన కారణమని వేణుగోపాల్ చెప్పకనే చెప్పేశారని భావించవచ్చు.
వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014లోనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాల్సి ఉంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రుపులు కుమ్ములాటలు, ఆధిపత్యంపై యావే తప్ప రాష్ట్ర నాయకులు పార్టీ పటిష్ఠత, బలోపేతం గురించి పట్టించుకోకపోవడం వంటి కారణాలతోనే నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అధికారానికి దూరంగా మిగిలిపోవలసి వచ్చిందని పార్టీ అధిష్ఠానం బలంగా నమ్ముతోంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అత్యంత దయనీయ పరిస్థితిలో మిగిలింది. గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధికులు చేతికి హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి పార్టీకి అనూహ్యంగా ఒక హైప్ తీసుకువచ్చారు. క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. నిత్య అసంతృప్తి వాదులుగా ఉండే పార్టీ సీనియర్లను అధిష్ఠానం అండతో ఏకతాటిపైకి తీసుకువచ్చారు. మూడు నాలుగు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో అధికారం అన్న భావన పార్టీలోనే ఎవరిలోనూ కనిపించలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి అధికారాన్ని చేతికి అందించారు. ఈ నేపథ్యంలోనే ఎంత మంది సీనియర్లు రేసులో నిలిచినా, హస్తినలోనే మకాం వేసి ప్రయత్నాలు సాగించినా అధిష్ఠానం రెండో ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డినే సీఎంగా ప్రకటించింది. ఇక పార్టీ హైకమాండ్ రేవంత్ నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వెనుక వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక ముఖ్యకారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో, అదీ నిత్య కుమ్ములాటలతో ఒకరి కాళ్లు ఒకరు లాగేసేందుకు ఇసుమంతైనా వెనుకాడని నేతలున్న తెలంగాణలో కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన రేవంత్ ను సీఎంగా ఎంపిక చేయడం అంటే పార్టీ అధిష్ఠానం అత్యంత సాహసోపేతంగా నిర్ణయం తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది.
ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరింది 2017లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టింది 2021లో. చేపట్టిన క్షణం నుంచే పార్టీలో సీనియర్ల గోల మొదలైంది. రేవంత్ కు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ కు సహాయ నిరాకరణా చేశారు. పార్టీలో అత్యంత జూనియర్ అయిన రేవంత్ కింద మేం పని చేయడమేమిటంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే రేవంత్ అందరినీ కలుపుకుని పోవడానికి యధాశక్తి ప్రయత్నించారు. అధిష్ఠానం అండ కూడా తోడు కావడంతో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తూనే ధిక్కారాన్ని సహించననే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ దూకుడు ప్రదర్శించారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ పై నిప్పుల వర్షంలా విమర్శలూ కురిపించారు. సైమల్టేనియస్ గా తన పని తీరుతో తొలుత వ్యతిరేకించిన సీనియర్లలో పలువురి ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక అధికారం అన్నది ఊహకు కూడా అందని స్థితిలో రేవంత్ ను నమ్మి, రేవంత్ పై విశ్వాసంతో ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ గూటికి వచ్చారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి హనుమంతరావు బిజెపిలోకి వెళ్లాలని తొలుత భావించినప్పటికీ రేవంత్ రెడ్డి చొరవ కారణంగా వారు కాంగ్రెస్ చేయందుకున్నారు. ముఖ్యంగా పొంగులేటి రాకతో కాంగ్రెస్ పట్ల రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందన్న సంగతి స్పష్టమైంది. పార్టీలో అసమ్మతి, అసమ్మతి వాదులకు కూడా రేవంత్ నాయకత్వ సమర్థతపై విశ్వాసం పెరిగింది. ఇక బీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడంలో రేవంత్ నాయకత్వ సమర్థత ఏమిటన్నది పార్టీలో ఆయన వ్యతిరేకులకు కూడా అర్ధమైంది. మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ కు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేలా పార్టీ హైకమాండ్ ను ఒప్పంచడం ద్వారా, ఇంకా పార్టీలో అక్కడక్కడా ఉన్న అసమ్మతి, అసంతృప్తికి రేవంత్ చెక్ పెట్టారు. పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడి ఏమిటన్నది పార్టీలోని తన వ్యతిరేకులకు ప్రస్ఫుటంగా చూపారు. అందుకే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఎలాంటి పొరపచ్చాలూ, ఇబ్బందులూ, చీకాకులూ లేకుండా సజావుగా సాగింది. స్టార్ క్యాంపెయినర్లుగా ఎందరున్నా.. ప్రచారం మొత్తం రేవంత్ సారథ్యంలోనే సాగింది.
సీనియర్లం అంటూ చెప్పుకున్న నేతలంతా తమతమ నియోజకవర్గాలకే పరిమితమైతే, స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీకి దిగిన రేవంత్ మాత్రం రాష్ట్రమంతా చుట్టేశారు. అతడే ఒక సైన్యం అన్న తీరులో ఆయన ప్రచారం సాగింది. బీఆర్ఎస్ కు కంచుకోటలనదగ్గ నియోజకవర్గాలలో రేవంత్ ప్రచారం తర్వాత ఆ కోటలు బీటలువారాయి. ఈ వాస్తవాలన్నీ పరిగణనలోనికి తీసుకున్న అధిష్ఠానం రెండో ఆలోచన లేకండా రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. తామూ రేసులో ఉన్నామంటూ హస్తిన వచ్చి మరీ హడావుడి చేసిన వారికి తత్వం బోధపరిచింది. మంత్రివర్గ కూర్పులో కూడా రేవంత్ కే స్వేచ్ఛ ఇచ్చింది. రేవంత్ ఇదే దూకుడుతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన స్థైర్యాన్నిచ్చింది.