మాయ చేసి గెలిచేద్దామనే?
posted on Dec 12, 2023 @ 3:41PM
ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాలు కాస్త చల్లబడ్డాయి. అదే సమయంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం నుండి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టగా.. మరోవైపు తెలుగుదేశం-జనసేన ఉమ్మడి కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీలో కొందరు ప్రముఖ నేతలు పార్టీరాజీనామా చేశారు. కరుడుగట్టిన వైసీపీ వాదిగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. వైసీపీ ఏకంగా 11 మంది నియోజకవర్గాల సమన్వయ కర్తలను మార్చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇంచార్జీల మార్పు వివరాలు వెల్లడించారు. దీంతో ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ చేపట్టిన ఈ ఇంచార్జీల మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ లాంటి కీలక నేతలను కూడా నియోజకవర్గాలను మార్చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్పు చేయడం ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. మొత్తం 11 మందికి ఈ స్థానభ్రంశం కలుగగా.. నలుగురు కొత్త వారికి ఏడుగురు పాతవారికి నియోజకవర్గాలు మార్చి బాధ్యతలు అప్పగించారు. మంత్రులు విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ లను సిట్టింగ్ స్థానాల నుండి తప్పించడం ఆసక్తి రేపుతోంది. ఇది ఒకరకంగా వైసీపీ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఎంత భయపడుతోందా అర్ధం అయ్యేలా చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నలుగురు మంత్రులకు వారి వారి స్థానాలలో మళ్లీ విజయావకాశాలు లేవని ఇప్పటికే ఐ-ప్యాక్ సర్వే తేల్చేయడంతోనే ఇప్పుడు ఇక్కడ వారి స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించాని చెబుతున్నారు. అలాగే ఈ నలుగురికి కేటాయించిన స్థానాలు టీడీపీకి కంచుకోటలు కాగా ఇక్కడ ఈ నలుగురు మంత్రులు ఓడిపోవడం గ్యారంటీ అని రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ స్థానాలలో ఈ మంత్రులు ఓడినా నష్టం ఉండదని, వీరి సిట్టింగ్ స్థానాలలో మరొకరికి అవకాశం ఇస్తే అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని వైసీపీ ఈ స్థానాలు కేటాయించినట్లు కనిపిస్తున్నది.
కాగా, మార్పు చేసిన 11 స్థానాలలో ఒక్క ఉమ్మడి గుంటూరు నుంచే 8మంది ఉండటం చూస్తుంటే ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడం పార్టీలో కూడా కలకలం రేపుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంఛార్జిల మార్పు పట్ల పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నది. కొత్త స్థానాలకు వెళ్తే ఓడిపోవడం ఖాయమని తేలిన ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాడర్ తో సమావేశాలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే సిట్టింగులకు ఎసరు పెట్టుతుండడంతో వైసీపీలో మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైనట్లు తెలుస్తున్నది. పల్నాడు జిల్లాలో మంత్రి రజినిని గుంటూరు పశ్చిమకు మార్చగా కొత్త అభ్యర్థి రాజేష్ నాయుడును తెరపైకి తెచ్చారు. సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా రాజేష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇప్పటికే తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వీరు కూడా తట్టా బుట్టా సర్దుకోక తప్పదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పీకే సర్వేలలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారో వారందరిపై వేటు తప్పదని భావిస్తున్నారు. ముందుగా జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే ఈ మార్పులు మొదలు పెట్టగా, ఈ జిల్లా తర్వాతనే మరో జిల్లాలో కూడా మార్పులు తప్పవని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. వైసీపీ ఇంచార్జీల మార్పుపై రాజకీయాల వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరుగుతున్నది. ఇలా క్యాండిడేట్లను మారిస్తే ప్రభుత్వ తప్పిదాలను మర్చిపోయే స్థితిలో ప్రజలు లేరని.. ఎవరు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెటిజనులతు మొహమాటం లేకుండా చెబుతున్నారు. కొత్త వారిని తీసుకొచ్చినా ప్రజలకు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఒక్కటే కనిపిస్తుందని.. ప్రభుత్వపై వ్యతిరేకత ఎవరు ఎక్కడ ఉన్నా ప్రజలు ఓడించడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.