ఆర్కే ఒక్కడే కాదు.. జగన్ కు అందరూ కూరలో కరివేపాకులే!
posted on Dec 12, 2023 @ 5:04PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీలక నేత, మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా ఉరుములు లేని పిడుగులా ఆర్కే రాజీనామా చేసేసి సంచలనం సృష్టించారు. అదేదో ఆషామాషీగానో.. బెదిరించడానికో కాదు. స్పీకర్ ఫార్మాట్ లో శాసన సభ్యత్వానికి, అదేవిధంగా వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. నిజానికి ఆయన రాజీనామాను వైసీపీ నేతలెవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉండే ఆర్కే.. అదే స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ కోసం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి తెలుగుదేశం నేతలు, అమరావతిపై కూడా వ్యక్తిగతంగా కేసులు వేశారు. అలాంటి నేత ఉన్నఫళంగా జగన్ కు, ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది.
రాజీనామా అనంతరం కూడా ఆర్కే మీడియా ముందు ఎక్కడా పన్నెత్తు మాట ఎవరినీ అనలేదు. ఆర్కే లాంటి ఎమ్మెల్యే సీఎం జగన్‌కు చెప్పకుండా రాజీనామా చేశారంటే నమ్మలేం. జగన్ కు అత్యంత సన్నిహితుడైన నేతగా మెలిగిన ఆర్కే జగన్ కు ముందుగానే చెప్పి రాజీనామా చేసి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. దీంతో రాజీనామా చేయడం వెనక కారణాలు ఏంటి, అలాగే ఆర్కే లాంటి నేత రాజీనామా చేసి వెళ్లిపోతున్నా.. జగన్ లైట్ ఎలా తీసుకున్నరన్నదానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆర్కే రాజీనామా వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆర్కే పైకి చెప్పకపోయినా వైసీపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నది ఇప్పుడు అందరికీ అర్ధమౌతున్న రాజకీయ వాస్తవం. 2019 ఎన్నికల సమయంలో సాక్షాత్తూ జగనే ఆర్కేను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ మాట నిలబెట్టుకోలేదు. పోనీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనైనా ఆర్కే పేరును కనీసం పరిశీలించనుకూడా లేదు. పైగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆర్కే కంటే జూనియర్లకు కేబినెట్ లో అవకాశం ఇచ్చిన జగన్ ఆర్కేకు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.
అలాగే ఒకవైపు రాజ్యసభ సభ్యుడైన తన సోదరుడు, మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి పార్టీ ప్రాధాన్యత పెంచుతూ వచ్చింది. ముందుగా చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో ఆయన ఒక అధికార కేంద్రంగా మారిపోయారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దానిని చిరంజీవితో ప్రారంభింపచేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో గ్రూపు కట్టారు. అన్నీ తెలిసినా చూస్తూ ఉండడం తప్ప ఆర్కే ఏమీ చేయలేకపోయారు. చివరికి చిరంజీవినే తన నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించడంలో పార్టీ పెద్దలు ఒక ప్లాన్ ప్రకారమే ఆర్కేకు పొగబెట్టారని స్పష్టంగా తేలిపోవడంతోనే ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఒకరకంగా ఆర్కే తన భవిష్యత్తును కాదని మరీ జగన్ కోసం పనిచేశారు. అమరావతిలో అసైన్మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో సీఐడీకి ఆర్కేఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు పేరు చేర్చాలని, కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి బదలాయించాలని పిల్ వేశారు. అసలు తాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోయి రాజకీయంగా జగన్ కు లబ్ది చేకూర్చేందుకు పనిచేశారు. ఫలితంగా ఇప్పుడు ఆర్కే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోగా.. పార్టీ అదే వ్యతిరేకతను చూపి ఆయనను పక్కన పెట్టేసింది. ఇది ఒక్క ఆర్కేకి మాత్రమే కాదు.. అధికారంలో ఉండగా ప్రజల ప్రయోజనాలను కాకుండా జగన్ మెప్పు కోసం ఆరాటపడిన వారందరికీ ఫలితం ఇలాగే ఉంటుందన్నది ఆర్కే అనుభవం చెప్పే మాట. ఎవరినైనా తన చేతిలో పావులుగా మార్చుకొని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, ఆ తరువాత కూరలో కరివేపాకులా పక్కన పారేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలో ఆర్కే బాటలోనే మాజీ మంత్రులు, మంత్రులు సహా పలువురు ఉన్నట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.