ఔను ఇది నిజం.. తెలుగుదేశం విజయం తథ్యం!
posted on Dec 12, 2023 @ 3:14PM
గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నీ, ఆ ప్రభుత్వ పాలననూ చూస్తున్న వారికీ, అనుభవిస్తున్నవారికీ. వీళ్లూ వాళ్లూ అనేమిటి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలోనూ అసలిలాంటి పార్టీని ఎందుకు ఎన్నుకున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాం అన్న ప్రశ్నే మెదులుతోంది.
ఔను నిజం.. రాష్ట్ర విభజనతో పేరు తప్ప మరేం లేకుండా, కనీసం రాజధాని ఇదీ అని చెప్పుకోలేని రాష్ట్రంగా ఏర్పడిన ఏపీ ఆ తరువాత ఐదేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. ప్రపంచం మొత్తం ఏపీవైపు తొంగి చూసేలా అద్భుత రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టి శరవేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యంగా మారింది. రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాలు అసూయపడేలా ప్రగతి, సంక్షేమాలలో పురోగమించింది. ఏ నమ్మకంతో అయితే ప్రజలు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించారో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది. అపార అనుభవం, అనితర సాధ్యమైన విజన్ తో చంద్రబాబు రాష్ట్ర ప్రగతిని దేశానికే రోల్ మోడల్ అన్నట్లుగా పరుగులు తీయించారు.
ఆ తరువాత 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. జగన్ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసలు తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది? అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఎవరికీ సమాధానం దొరకడం లేదనే చెప్పాలి. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తమ అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు. రాజధాని అమరావతిని, గ్రోత్ ఇంజిన్ నగరంగా అభివృద్ధి చేసేందుకు అంత వరకూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా భూసమీకరణ చేశారు. నిర్మాణాలు మొదలయ్యాయి. రాష్ట్రం నలుచెరుగులా అభివృద్ధి మెలకలెత్తింది. మరో ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే.. రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు, రాష్ట్రం అన్ని రంగాలో నూ పురోగమించి అగ్రగామిగా నిలిచేది. అయితే, దురదృష్టవశాత్తు, 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఒడి పోయింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అభ్యర్ధన సృష్టించిన సింపతీతో వైసీపీ గెలిచింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది కళ్ళ ముందు కదులుతున్న నడుస్తున్న చరిత్ర.
రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో 3 శాతం కంటే దిగువకు పడిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటి? ఎంత అన్నది తెలుసుకోవడానికి ఈ గణాంకం చాలదా? అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్లు, రాష్ట్రం ఎంతగా వెనుకబడిపోయిందో చెప్పడానికి దిగజారిన వృద్ధి రేటు తెలిస్తే చాలు. నిజానికి జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. నష్టం అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారు. అందుకే ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు కావాలి, చంద్రబాబు రావాలి అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యటనల కు గమనిస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో, ఎంతగా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, కోరుకుంటున్నారో అర్థమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం .. చేసుకున్న అదృష్టం చంద్రబాబు అయితే దురదృష్టం ..జగన్ అని సామాన్య ప్రజలు కూడా నిర్ద్వంద్వంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం ‘అస్తిత్వం’ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసేపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం, తెలుగుదేశం కేవలం 23 స్థానాలకు పరిమితం కావడంతో ఇక పార్టీ పుంజుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషణలు వినిపించిన వారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అంత చురుకైన పాత్రను పోషించలేరనీ, అలాగే, పార్టీని ముందుకు నడిపించడానికి లోకేష్ అనుభవం సరిపోదని చాలా చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు అటు చంద్రబాబు, ఇటు లోకేష్ విషయంలో తమ అంచానాలు తప్పాయని నాడు సందేహాలు వ్యక్తం చేసిన వారంతా అంగీకరిస్తున్నారు.
వైసేపీ అరాచక పాలనను తట్టుకుని టీడీపీ అస్తితాన్ని నిలుపుకోవడమే కాదు, పడిలేచిన కెరటంలా చంద్రబాబు దూసుకొచ్చిన తీరు పట్ల సర్వత్రా విస్మయం, సంభ్రమాశ్చర్యాలూ వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడికి సంక్షోభం నుంచి సరికొత్త ఎత్తులకు ఎదగడం కొత్తేమీ కాదు. చంద్రబాబు నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ప్రతీ ఓటమి నుంచీ గుణపాఠాలు నేరుస్తూ.. గెలుపు తలుపులు తెరిచారు. ఇప్పడు మళ్ళీ అదే చేస్తున్నారు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేననీ, ఉత్సాహం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించోచ్చని నిరూపిస్తున్నారు. 70 ఏళ్ల నవయువకుడిగా చంద్రబాబు కదులుతున్న తీరు పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాయి. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలులో 52 రోజుల పాటు నిర్బంధించిన సమయంలో ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ లక్షలాదిగా బయటకు వచ్చి చంద్రబాబు ఔన్నత్యం, గొప్పతనం బయటకు చాటారు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు అరెస్టైతే ఆయన పాల్పడిన స్కాములు, అక్రమాలు, అవినీతి వంటి వాటిపై జనంలో చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు అరెస్టైనప్పుడు ఆయన దార్శనికత, ఆయన చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన పడిన తపన వంటి వాటిపై చర్చ జరిగింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఒక నానుడి ప్రచారంలో ఉండేది. అదేమిటంటే చంద్రబాబు నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు అని. ఇప్పుడు ఆయన అక్రమంగా అరెస్టైన సమయంలో జనం నోటి వెంట వచ్చిన మాట చంద్రబాబు తప్పు చేయరు.. ఎవరినీ తప్పు చేయనివ్వరూ అన్నదే. అటువంటి చంద్రబాబు అరెస్టుతో జగన్ లో ఏక్కడో మిణుకుమినుకు మంటున్న గెలుపు ఆశ పూర్తిగా ఆవిరైపోయింది. అందుకే, 2024 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ జగన్ కు మరో చాన్స్ లేదని పరిశీలకులు సైతం గట్టిగా చెబుతున్నారు. తెలుగుదేశం విజయం వందశాతం తథ్యం అంటున్నారు. జనం కూడా తధాస్తు అంటున్నారు.