టీఎస్పీఎస్పీ చైర్మన్ రాజీనామా ఆమోదానికి గవర్నర్ నో.. ఎందుకంటే?
posted on Dec 12, 2023 @ 11:44AM
టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా ను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టారు. జనార్దన్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ వర్గాలు మంగళవారం (డిసెంబర్ 12) వెల్లడించాయి. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. అనంతరం టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. ఆయన రాజీనామాను వెంటనే గవర్నర్ ఆమోదించేశారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది.
పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారనీ, పేపర్ లీకేజీకి జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ డీవోపీటీకి తమిళిసై లేఖ సైతం రాసినట్లు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ నిర్వహించిన పలు పోటీ పరిక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ఓడిపోవడంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలు కూడా ఒక కారణం అని పరిశీలకులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం దానిని గవర్నర్ ఆమోదించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేపర్ లీకేజీ బాధితులపై చర్యలు రేవంత్ సర్కార్ గట్టి పట్టుదలతో ఉందనీ, ప్రభుత్వం కోరిన మీదటే గవర్నర్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టారని అంటున్నారు.