ముసుగులు తొలగిపోతున్నాయా?
posted on Dec 12, 2023 @ 12:25PM
బీఆర్ఎస్, బీజేపీ జుగల్ బందీ విషయంలో ఇక దాపరికం అక్కర్లేదనుకున్నారా? వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క సారి ఓడిపోగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అంటోందా? ఆ పార్టీకి అటువంటి సంకేతాలే ఇస్తోందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం నుంచి లోక్ సభ స్థానాల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తామని చెప్పకనే చెబుతోందా? అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ఒక ట్వీట్ ఔననే సమాధానమే వచ్చేలా చేస్తోంది.
ఔను అయోధ్య రామమందిరంపై కవిత చేసిన ట్వీట్ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. అయోధ్యలో సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతోపాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అంటూ కవిత చేసిన ఒక్క ట్వీట్ బీఆర్ఎస్ బీజేపీల జుగల్ బందీని తేటతెల్లం చేసింది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉన్న తరుణంలో కవిత చేసిన తాజా ట్వీట్ దానిని ధృవీకరించేలా ఉంది. బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టి మళ్లీ అధికారంలోకి రావడమే బీఆర్ఎస్ టార్గెట్. అంటే బీఆర్ఎస్, బీజేపీల టార్గెట్ కాంగ్రెస్. ఆ లక్ష్య సాధన కోసమే.. తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఆ రెండు పార్టీలూ ఎన్నో వ్యూహాలు పన్నాయి. ఎత్తులు వేశాయి. ఒక దశలో రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం బీజేపీయే తప్ప కాంగ్రెస్ కాదని కేసీఆర్ బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. సరే అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీల వ్యూహాలు, ఎత్తులూ బెడిసి కొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అది పక్కన పెడితే.. ఇక నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలోనైనా కాంగ్రెస్ కు చెక్ పెట్టి, రాష్ట్రంలో జమిలిగా బలోపేతం కావాలన్న వ్యూహంలో భాగంగానే కవిత రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనపై ట్వీట్ చేశారన్న చర్చ జోరందుకుంది. ఈ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లేందుకు ఈ ట్వీట్ తొలి అడుగు అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.