లోక్ సభ ఎన్నికలపై ఇక రేవంత్ నజర్!
posted on Dec 13, 2023 @ 10:35AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఒక వైపు పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ముద్రను చూపుతూనే మరో వైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్ లో పదవుల కేటాయింపులో తనదైన మార్క్ చూపిన రేవంత్ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని లోక్ సభ ఎన్నికలలో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు 12 మందితో రేవంత్ కేబినెట్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే రేవంత్ తన కేబినెట్ లోకి మరో ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది.
దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కూడా కేబినెట్ లో స్థానం దక్కనున్న ఆ ఆరుగురు ఎవరన్న దానిపైనే ఉంది. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ లో భాగంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోయే మంత్రులు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన వారే ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేబినెట్ లోకి తీసుకోబోయే ఆరుగురు ఎవరు? వారికి కేటాయించే శాఖలు ఏమిటి? అన్న విషయంపై పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా రేవంత్ కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణమేంటి? వచ్చే లోక్ సభ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం కావడానికీ, లోక్ సభ స్థానాలలో విజయం సాధించడానికి తీసుకోవలసిన చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి వంటి అంశాలపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక్క స్థానం దక్కకపోయినా జీహెచ్ఎంసీ పరిధి నుంచి కేబినెట్ లోకి ఒకరిద్దరిని తీసుకుని పార్టీకి బలం చేకూర్చేలా వారికి టార్గెట్ నిర్దేశించే యోచనలో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.