అనుకూల సర్వే చూసుకుని గెలుపు భ్రమల్లో జగన్?!
posted on Dec 15, 2023 8:59AM
ఏపీ అసంబ్లీ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. అన్ని పార్టీలూ ఎన్నికలలో విజయం కోసం వ్యూహ, ప్రణాళికా రచనలో మునిగిపోయాయి. ఎత్తులు, పొత్తులు, సీట్ల సర్దు బాటు వంటి విషయాలపై దృష్టి పెట్టాయి. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం వ్యూహాలు లేక, ప్రణాళికా రచన అన్నదే మరచిపోయి అనుకూల సర్వేలనే నమ్ముకుంటోంది. ఒకటా రెండో అంతర్గత సర్వేలు, ఐ ప్యాక్ సర్వేలు, అనుకూల సంస్థలతో చేయించుకుని ప్రచారం చేసుకుంటున్న సర్వేలతో గెలుపు భ్రమల్లో విహారం చేస్తోంది.
తాజాగా వెలువడిన టైమ్స్ నౌ నవజీవన్ ఈటీజీ ఓపినీయన్ పోల్ లోక్‌సభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక లోక్‌సభ స్థానాలకు గానూ 24 నుంచి 25 సీట్లలో అధికార వైసీపి విజయకేతనం ఎగురవేస్తుందంటూ పేర్కొంది. ప్రతిపక్షమైన తెలుగుదేశం మహా అయితే ఒక స్థానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది. నెలల కిందట ఇదే సంస్థ వెలువరించిన సర్వే కూడా మక్కీకి మక్కీ ఇలానే ఉంది. ఏ మార్పూ లేదు. ఇదే సర్వే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా అవుతారని కూడా చెప్పింది. అది పక్కన పెడితే ఏపీ విషయంలో మాత్రం టైమ్స్ నౌ సర్వే ఏ మాత్రం విశ్వసించదగ్గదిగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ పాలన పట్ల, ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తుంటే ఎక్కడో కూర్చుని వండి వార్చిన సర్వేను వదలడం వెనుక ప్రజలలో గందరగోళం సృష్టించాలన్న కుట్రే కనిపిస్తోందని అంటున్నారు. ఇది పూర్తిగా పెయిడ్ సర్వేగా అభివర్ణిస్తున్నారు. జారిపోతున్న నేతలను, క్యాడర్ ను కాపాడుకోవడం కోసం జగన్మాయలో భాగమే ఈ సర్వే అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో జనసేన, బీజేపీ, ఇతరులకు ఒక్కంటే ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొనడం చూస్తుంటే, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, రాజకీయ, కుల సమీకరణాలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత మారిన పరిస్థితి, తెలంగాణ ఎన్నికల ప్రభావం, లోకేష్ పాదయాత్ర పాదయాత్ర, వంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా సర్వేను వండి వార్చేసిందని అంటున్నారు.
ఒక వైపు టైమ్స్ నౌ సర్వే వచ్చే లోక్ సభ ఎన్నికలలో వైసీపీ పాతికకు పాతిక ఎంపీ సీట్లూ గెలుచుకునే అవకాశం ఉందని చెబుతుంటో మరో వైపు ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడకుండానే జగన్ ఓటమిని అంగీకరించేసి, నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను మార్చేస్తూ తనలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టుకుంటున్నారు. తాను ఇంత కాలం బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ములు, సంక్షేమం పేరిట అమలు చేసిన పథకాలు ఏవీ కూడా ప్రజలను రంజింపలేదని గ్రహించిన జగన్, దింపుడు కళ్లెం ఆశగా నియోజకవర్గాలలో కొత్త ముఖాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రజెంట్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మార్చిన 11 మందే కాకుండా రానున్న రోజుల్లో ఈ జాబితా కొండవీటి చాంతాడంత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ సర్కార్ పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తినీ, రాజధాని అమరావతి, ఏపీ జీవనాడి పోలవరం, ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీ కరణ వంటి అంశాలలో జగన్ సర్కార్ నిర్వాకంపై ప్రజాగ్రహం, ఇక అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి, అందుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలపై ఉక్కుపాదం మోపి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉందనిపించేలా అమలు చేసిన ఆంక్షల పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని టైమ్స్ నౌ సర్వే కనీసం పరిగణనలోనికి కూడా తీసుకున్నట్లు కనబడటం లేదు. అందుకే పరిశీలకులు టైమ్స్ నౌ సర్వేను ఓ పెయిడ్ సర్వేలా పరిగణిస్తూ పట్టించుకోవడం లేదు. ఎవరో కొత్తగా వచ్చి ఏపీలో వైసీపీ భవిష్యత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ, జగనే స్వయంగా తన ప్రభుత్వం మరో సారి అధికారంలోకి రావడంపై ఆశలు వదిలేసుకున్నారనీ, అందుకు నిదర్శనమే మంత్రులు సహా నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు కార్యక్రమమనీ విశ్లేషిస్తున్నారు.