ఏపీ అంతటా.. ఒకే మాట.. ఏపీ డొంట్ నీడ్ జగన్!
posted on Dec 14, 2023 @ 2:37PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో సారి అధికార పీఠం ఎక్కాలని స్కెచ్ వేసుకుంటున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అంతా తనపైనే ఉందని స్పష్టంగా తెలిసినా, తప్పు పార్టీ ఎమ్మెల్యేలపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. బటన్ నొక్కుతున్నందున జనం తన వెంటే ఉన్నారనీ, అయితే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నారనీ చెబుతూ వారిని మార్చేస్తే మళ్లీ అధికారం మనదే అంటూ పార్టీ కార్యకర్తలను నమ్మించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఏకంగా 90 మంది సిట్టింగులను నియోజకవర్గాలు మార్చేయడమో, లేదా టికెట్ నిరాకరించి వారిని పోటీకి దూరంగా ఉంచడమో చేయాలని డిసైడ్ అయిపోయారు. అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా? వారి వ్యతిరేకత కేవలం ఎమ్మెల్యులు, మంత్రుల మీదా? అంటే కాదు అనే సమాధానమే వస్తోంది. జనాగ్రహం అంతా జగన్ మీదే అని వైసీపీ నేతలో గుసగుసలాడుకుంటున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు తెలియడం లేదో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఇక ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేసిన తరువాత కూడా జగన్ తాను తప్ప పార్టీలో మిగిలిన వారంతా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న భావనలోనే ఉంటే వైనాట్ 175 కాదు కదా పట్టుమని పాతిక స్థానాలలో కూడా పార్టీ గట్టెక్కడం అసాధ్యమని వైసీపీలో సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే విషయం సీఎం ముందుకు తీసుకువెళ్లే ధైర్యం లేక ఆయన అన్నదానికల్లా అవుననీ, చెప్పిన దానికల్లా సై అంటూ తలలాడించేస్తున్నరారు. ఇక ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను సానుకూలంగా ముఖ్యమంత్రి ఆలోచన అంటూ పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఒక్క సారిగా పార్టీలో కట్ట తెగిన గోదారిలా అసమ్మతి భుగభగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత విధేయుడైన ఎమ్మెల్యేయే పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు. ఆయన బాటలో ఇంకింత మంది నడిచే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.
సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు మళ్ళీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని, జగన్ ఆశ పడుతున్నారు. అయితే., క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ, సంతృప్తి చెందిన దాఖలాలు లేవని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్ఫుటంగా బయటపడిందని చెబుతున్నారు. అయినా జగన్ ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే కదా.. తన పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఏదన్నది తెలియడానికి అని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. పరదాల మాటున పర్యటనలు సాగించేసి, హడావుడిగా బటన్ నొక్కేసి వెళ్లడం తప్ప ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ జగన్ చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే జగన్ మరో చాన్స్ అంటుంటే, జనం మాత్రం నో చాన్స్ అంటున్నారని వైసీపీ నాయకులే అంటున్నారు.
మాట తప్పను, మడమ తిప్పాను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెబుతున్నారు. రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితికి కారణం జగన్ విశ్వసనీయత కోల్పోవడమేనని అంటున్నారు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి అడ్వర్టైజ్మెంట్’ బిల్లులు వస్తున్నాయే, తప్ప టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లు కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.
కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు నామినేషన్ పనులు కేటాయించినా, క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక చేసిన అప్పులు తీర్చడం అటుంచి వాటికి వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని నష్టపోయిన పార్టీ కేడర్, నాయకులు నామినేషన్ పనులంటేనే వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం లేదనడానికి ఇంతకు మించి నిదర్శనమేం కావాలని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
వైసీపీ గ్రామా సర్పంచ్ లు గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలై మీరిఇచ్చిన పదవికో దండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే తాజాగా ప్రభుత్వ భూములు ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే కనిపించడం లేదు. అది కూడా ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది లేక దరఖాస్తు గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.. ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’ ప్లాట్స్ కథే చేపుతోందని అంటున్నారు.
రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు.
నిజానికి, రేపో మాపో రాజదాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ, వైజాగ్’లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్ ను నమ్మడం లేదని, వైసీపీ నాయకులు అప్పట్లోనే అన్నారు. ఇలా జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. మరో చాన్స్ చచ్చినా ఇవ్వమని చెప్పేస్తున్నారు. మీటలు నొక్కి నోట్లు వేశాం.. ఓట్లేందుకు వేయరు అంటూ సీఎం తమ పేదరికాన్ని చులకన చేస్తున్నారని లబ్ధిదారులు భావిస్తున్నారు. అందుకే జగన్ కి మరో అవకాశం ఇచ్చేది లేదని తమ ముఖం మీదే చెప్పేస్తున్నారని వైసీపీ క్యాడర్ చెబుతోంది. అందుకే సామాజిక సాధికార యాత్ర వంటి పార్టీ కార్యక్రమాలకు కూడా క్యాడర్ ముఖం చాటేస్తోంది. వైసీపీ క్యాడర్ ఇప్పటికే జగన్ పై ఆశలు వదిలేసుకుంది. పార్టీకి దూరంగా ఉండటమే మేలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ల మార్పు అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు పార్టీని మరింత బలహీనం చేయడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశాలు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.