తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ?
posted on Dec 13, 2023 @ 4:55PM
తెలంగాణ శాసనసభా స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌కు కావాల్సిన బలం ఉన్నందున స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక లాంఛనం కానుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్నందున స్పీకర్ పదవిని గడ్డం ప్రసాద్ సమర్ధవంతంగా నిర్వహిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.అధికార కాంగ్రెస్ పార్టీకి 64మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది, సాధారణ మెజారిటీ కావడంతో సభా నిర్వహణ అత్యంత కీలకం కాబోతోంది. గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యాక స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, ఎల్లుండి ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. డిసెంబర్ 16న గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ శాసనసభ ధన్యవాదాలు తెలపనుంది.
కాగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్ సి వర్గానికి చెందిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ పదవిని అధిరోహించిన ప్రతిభా భారతి ఎస్ సి వర్గానికి చెందిన వారే. తాజాగా గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఎస్ సి వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం.