కొడాలి నానికి కౌంట్ డౌన్ ?.. ఫలించిన చంద్రబాబు వ్యూహం!
posted on Dec 15, 2023 @ 10:56AM
ఉమ్మడి కృష్ణా జిల్లా జనం తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో తొలి నుండి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనాదరణ ఉంది. జిల్లా పార్టీకి కంచుకోటగా నిలిచింది. అయితే 2019 ఎన్నికలలో మాత్రం పార్టీ పట్టు కోల్పోయింది. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా దెబ్బతింది. అయితే ఈసారి ఎలాగైనా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం బేస్ తిరిగి పొందాలంటే ఇక్కడ ఇద్దరు నేతలను దెబ్బకొట్టాలి. తెలుగుదేశంకు పంటి కింద రాయిలా మారిన ఈ ఇద్దరు నేతల స్థానాలను దక్కించుకోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఆ రెంటిలో ఒకటి గన్నవరం కాగా రెండోది గుడివాడ. వీటిలో ఒకటి మాజీ మంత్రి కొడాలి నానీ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం అయితే రెండోది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గన్నవరంలో వల్లభనేనికి టార్గెట్ సెట్ చేసింది. అంగ బలం, ఆర్ధిక బలం ఉన్న యార్లగడ్డ వెంకట్రావును ఇక్కడ రంగంలోకి దిగడంతో ఇప్పటికే వంశీ ఓటమి ఖాయమైనట్లేనని పరిశీలకులు అంటున్నారు.
ఇక కొడాలి నానీ విషయానికి వస్తే తాజాగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో టార్గెట్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. నిజానికి గత ఎన్నికలలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం కోల్పోయిన స్థానాలలో ఎక్కువ శాతం పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని పార్టీ శ్రేణులే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా చెబుతారు. కారణంగా చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు అభ్యర్ధిని మార్చడం, అలాగే టీడీపీ నేతల్లోనే కొందరు ప్రత్యర్ధులకు సాయంచేయటం వంటి కారణాలతో నే జిల్లాలో తెలుగుదేశం ఓటమి పాలైంది. అయితే, ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా చంద్రబాబు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గుడివాడ విషయంలో కూడా చంద్రబాబు ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడివాడ నుండి తెలుగుదేశం టికెట్ కోసం ఇరువురు నేతల మధ్య పోటీ ఉంది. వారిలో ఒకరు రావి వెంకటేశ్వరరావు కాగా మరొకరు ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాము. రావి గత ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని పని చేస్తున్నారు. ఈ పరిస్థితులలో వెనిగండ్ల తెలుగుదేశంలో చేరి సేవా కార్యక్రమాలతో ప్రజలలోనూ, పార్టీలోనూ గుర్తింపు పొందారు.
దీంతో ఇప్పుడు ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందన్నవిషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఇరువురిలో ఒకరికి పార్టీ టికెట్ ఇస్తే మరొకరు అసంతృప్తి చెందడం కూడా ఖాయం. అది అంతిమంగా పార్టీకే నష్టం చేస్తుంది. అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా చంద్రబాబు ఇరువురు నేతలనూ పిలిపించి మాట్లాడి ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేయాలని, టికెట్ దక్కని రెండో వ్యక్తికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని, అలా ఇద్దరికీ న్యాయం చేస్తాననీ చెప్పి ఒప్పించారు. అయితే గుడివాడలో పార్టీ విజయం సాధిస్తేనే ఇరువురికీ రాజకీయంగా అవకాశం ఉంటుందని నచ్చచెప్పడంతో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా గుడివాడ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వెనిగండ్ల పోటీ దాదాపుగా ఖరారైనట్లేననీ, ఇందుకు రావి కూడా అంగీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. . వెనిగండ్ల గెలుపుకు పూర్తి సహకారం అందిస్తాననీ కూడా రావి చెప్పారంటున్నారు. అలాగే తెలుగుదేశం అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటున్నారు.
వెనిగండ్ల రాము గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో ఎంపిక కావడమే కొడాలి నానికి సగం పరాజయం ఖరారైపోయినట్లేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వెనిగండ్ల రాము ఆర్ధిక పుష్టి ఉన్న నేతే కాకుండా.. సామజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన రాము భార్య దళితురాలు కావడం కూడా తెలుగుదేశంకు కలిసి వచ్చే అవకాశం అంటున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నానీ మధ్య అంతర్గత కుమ్ములాట వైసీపీకి మైనస్ అవుతుందంటున్నారు. అలాగే కొడాలి నాని వ్యవహారశైలి, జగన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత తెలుగుదేశంకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా రాజధాని అమరావతి ఫ్యాక్టర్ కూడా కొడాలి నానికీ, విజయానికి మధ్య అడ్డుగోడగా నిలుస్తుందని అంటున్నారు. మొత్తంగా కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందనే అంటున్నారు.