తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. ఆదివారం నాడు ఏకాంత సేవ ముగిసిన వెంటనే, ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆలయానికి తాళాలు వేశారు. సన్నిధి గొల్ల బంగారు వాకిలికి తాళం వేయడంతో ఆలయ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రభావంతో సుమారు 12 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం  వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.  అనంతరం ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి నిర్వహించే నిత్య సేవలను ఏకాంతంగా పూర్తి చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను సోమవారం వేకువజామున 2 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని ఇతర ఉప ఆలయాలను కూడా మూసివేశారు. అంతేకాకుండా, భక్తులకు నిరంతరం సేవలు అందించే లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రాలను కూడా గ్రహణం ముగిసే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. చంద్ర గ్రహణం కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. సుమారు 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచింది. కాగా, ఆదివారం శ్రీవారిని 27,525 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండరామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్ని  మూతపడ్డాయి.  

ఎట్టకేలకు 13న మణిపుర్‌కు ప్రధాని!

  ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది.  ప్రధాని పర్యటనకు సంబంధించి మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపూర్ అల్లర్ల చెలరేగినప్పటి నుంచి ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. 2023 మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య హింస చెలరేగిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు రెండు ప్రముఖ కుకీ-జో గ్రూపులతో ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది.  మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతను కొనసాగించడం, దుర్బల ప్రాంతాల నుంచి శిబిరాలను తరలించడం, రాష్ట్రంలో శాంతి-స్థిరత్వం పునరుద్ధరణ కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంపై కేఎన్‌వో(కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌), యూపీఎ్‌ఫ(యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌) సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ, మణిపుర్‌ ప్రభుత్వం, కేఎన్‌వో, యూపీఎఫ్‌ ప్రతినిధులు  ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.  

ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

  సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆర్చర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు.ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను 235-233 తేడాతో ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్‌ గెలిచింది.  రిషభ్‌ యాదవ్‌, అమన్‌ సైనీ, ప్రథమేశ్‌ త్రయం ఈ ఘనత సాధించింది. దీంతో దేశం తరుపున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడీ రజతంతో సరిపెట్టుకుంది.తొలుత ఆస్ట్రేలియాను, ఆ తర్వాత అమెరికాను చిత్తుచేసిన భారత త్రయం.. సెమీస్‌లో టర్కీని ఓడించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై భారత్‌ విజయం సాధించింది.  

హైదరాబాద్‌లో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు... యువతి మృతి

    హెల్మెట్ పెట్టుకోవాలని ,రాంగ్ రూట్లో వెళ్లకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, కార్ డ్రైవ్ చేసినప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పోలీసులు ఎన్నో మార్లు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. కానీ యువత వాటిని పట్టించుకో కుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ... రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతూ ఉంటారు. ద్విచక్ర వాహనం పైన వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ దానికుండే క్లిప్పు మాత్రం పెట్టుకోరు. అలాగే కార్ లో ప్రయాణం చేసేటప్పుడు అసలు సీట్ బెల్ట్ వాడరు.  ఇది యువత చేసే నిర్లక్ష్యం.... అందుకు ఫలితం రోడ్డు ప్రమాదంలో నిండు జీవితాలు బలి.... నిన్న గణేశుని నిమజ్జనం కనుల పండగ జరిగింది. గణేశుడు నిమజ్జనం అనం తరం కొందరు యువతీ,  యువ కులు  కలిసి ఒక కారులో పీకలదాకా మద్యం సేవిస్తూ...  యమ స్పీడ్ గా వాహనం నడిపారు. ఫలితంగా ఒకరు మృతి... పలువురికి తీవ్ర గాయాల య్యాయి... ఈ ఘటన హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.   లంగర్ హౌస్ దర్గా సమీపంలో మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. పోలీసులు సహా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఉన్న పోలీసు వాహన్ని ఒ కారు వెను నుంచి బలంగా ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందన్న పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం...సీఎం రేవంత్ అభినందనలు

  హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్దలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు  తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే భాగ్య నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు పోటెత్తాయి.  దీంతో ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రధాన మార్గంలో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనాల కోసం క్యూలో వేచి ఉన్నాయి. గ్రేటర్‌లో వినాయకుడు మోత మోగించేశాడు. నిమజ్జనం వేళ డీజీలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది.

యూరియా పోరు...సొమ్మసిల్లిన రైతు

  పంటలకు సమయానికి యూరియా వేయకపోతే పంటలు పూర్తిగా నష్టపోతాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు తెల్లవారు జామునుండే విక్రయ కేంద్రాల వద్ద రైతులు క్యూలైన్లో వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దీంతో ఓ మహిళ రైతు సోమ్మసిల్లి కింద పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా, నర్సంపేట పిఎస్‌సిఎస్ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం నుండే రైతులు యూరియా కోసం బారులు తీరారు. 444 బస్తాలతో యూరియా లోడు రాగా సుమారుగా 1000 మంది రైతులు . లైన్లో నిల్చొని ఉన్నారు. రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. సాగు చేసి పంటలకు యూరియా చల్లకపోతే పంటలు పాడైతయని.. పెట్టుబడులు పెట్టి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పదకొండు గంటలైనా యూరియా బస్తా దొరకపోవడంతో బిచ్చానాయక్ తండా కు చెందిన అజ్మీర అరుణ సోమ్మసిల్లి కిందపడింది. మరోవైపు పక్కనే ఉన్నతోటి మహిళా రైతులు సపర్యాలుచేయడంతో స్పృహలోకి వచ్చింది.. పర్షనాయక్ తండాకు చెందిన అజ్మీర కమలమ్మ అనే వృద్ధురాలు సోమ్మసిల్లి పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ యువకుడు,పోలీసులు  సిపిఆర్ చేయడంతో ఆ వృద్ధురాలికి మేలుక వచ్చింది. తెల్లావారు జామునుండి  వచ్చిన రైతులకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ సకాలంలో యూరియా అందించి తమ పంటలను కాపాడాలని అన్నదాతలు అధికారులను వేడుకొనుచున్నారు

చంద్రగ్రహణం ఎఫెక్ట్... ప్రఖ్యాత ఆలయాలు మూసివేత

  చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను మూసివేశారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సోమవారంఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అలాగే, అన్నదానం, లడ్డూ ప్రసాద కేంద్రాలను మూసివేయనున్నారు. ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూలైనులోకి వెళ్లకుండా నిలిపివేశారు టీటీడీ అధికారులు.  ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది. శుద్ధి, పుణ్యవహచనం నిర్వహించిన అనంతరం రేపు ఉదయం మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరువనున్నారు అర్చకులు. ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచే స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత అభిషేకాలు, పరోక్షసేవలు, స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిలిపివేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.  రేపు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం ఆలయంలో ప్రాత:కాల పూజలు 7:30 నుంచి స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతులు, మహా మంగళ హారతులు ఇవ్వనున్నారు. అలాగే, రేపు మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2:15 నుంచి 4 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీశైలం ఆలయ ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి దర్శనాన్ని ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా సింహాచలం దేవస్థానంలో భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8:00 గంటల నుంచి తిరిగి అప్పన్న స్వామి దర్శనాలను ప్రారంభిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7:30 గంటల నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి రేపు ఉదయం 3:30 గంటల నుంచి తెరువనున్నారు ఆలయ అధికారులు. రేపు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా నిత్యా కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు అర్చకులు, అధికారులు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, రేపు ఉదయం సుప్రభాత సేవను రద్దు చేసినట్లు ద్వారకా తిరుమల ఆలయ అధికారులు పేర్కొన్నారు.

వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షం

  వరంగల్‌ను భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ మార్గంలో వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అన్నారం, మహబూబాద్‌ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. 

సీపీ సుధీర్ బాబుపై ప్రశంసలు వెల్లువ

  కఠినంగా కనిపించే కాకి యూనిఫామ్ వెనుక మనసున్న మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారు కమిషనర్... అవునండి ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే ఓ కమిషనర్ రోడ్డుపై గాయాలు పడి ఉన్న దంపతులను చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి వారికి సేవలు చేసిన ఘటన మన హైదరాబాదు నగరంలో జరిగింది. ఒకవైపు గణనాథుడి మహా నిమజ్జనోత్సవం పనుల్లో ఊపిరి సలపని బిజీ లో ఉన్నప్పటికీ కూడా గాయపడిన వారికి చికిత్స అందేలా ప్రత్యేక చొరవ చూపారు ఆ కమిషనర్... ఇంతకు ఆ కమిషనర్ ఇవ్వరా అని ఆలోచిస్తున్నారా అదేనండి మన రాచకొండ సిపి సుధీర్ బాబు....ఈరోజు ఉదయం బాలాపూర్ గణేషు డిని దర్శించుకోవ డానికి ఒక జంట టూ వీలర్ మీద వెళ్తున్న క్రమంలో వాహనం ఒక్కసారి గా అదుపుతప్పి కిందపడిపోయారు.  ఘటనలో వారికి గాయాలయ్యాయి. అదే సమయంలో అదే రోడ్డులో వెళ్తున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు వారిని గమనించి... వెంటనే వాహనాన్ని నిలిపివేసి సిబ్బంది చేత వారికి ప్రథమ చికిత్స చేయించారు. బిజీ సమయంలో కూడా స్వయంగా కమిషనర్ దగ్గరుండి వారికి ప్రథమ చికిత్స చేయించి క్షేమంగా వారు అక్కడినుండి వెళ్లేవరకు చొరవ చూపించడం చూసిన స్థానికులు కమిషనర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమె అధికారిక నివాసంలో రాష్ట్రపతితో ప్రధాని సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్యాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. అధ్యక్షుడు మాక్రాన్‌ తో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడాడు.  అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. అధ్యక్షుడు మాక్రాన్‌‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని మేము సమీక్షించాము మరియు సానుకూలంగా అంచనా వేసామని పేర్కొన్నారు.  ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది." అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు 

గంగమ్మ ఒడికి బాలాపూర్ గణనాథుడు

  హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు క్రేన్ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి భాగ్య నగర ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హుస్సేన్‌ సాగర్‌లో బాలాపూర్ గణేశుడిని నిమజ్జన ప్రక్రియ పూర్తయింది.   మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు భారీగా గణనాథులు, భక్తులు తరలి వస్తున్నారు. సచివాలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు బాలాపూర్ నిమర్జన ఏర్పాట్లను సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో లింగాల దశరథ్‌ గౌడ్‌ అనే వ్యక్తి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నాడు. బాలాపూర్‌ గణనాథుడి లడ్డూను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.30.01 లక్షలు పలికిన విషయం తెలిసిందే. సాయంత్రం వాతావరణం చల్లబడటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.నగరవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు రహదారులపై బారులు తీరారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్, ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. మహగణపతితో పాటు అనేక వినాయక విగ్రహాలు ఒకేసారి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. 'గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా' నినాదాలతో గణపయ్యను కీర్తిస్తూ నినాదాలు చేశారు. 'జై జై గణేశా... బై బై గణేశా' అంటూ ఏకదంతునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అపుర్వ ఘట్టాన్ని వేలాది మంది ప్రజలు స్వయంగా వీక్షించగా.. కోట్లాది మంది టెలివిజన్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయారు

గుజరాత్‌లో రోప్‌వే తెగి ఆరుగురు మృతి

  గుజరాత్‌లోని పావ్‌గఢ్‌లో ఘోరప్రమాదం జరిగింది. రోప్ వే తెగి ఆరుగురు మృతి చెందారు. ప్రసిద్ధ శక్తిపీఠం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కార్మికులు సామాగ్రిని తరలిస్తుండగా రోప్‌వే తాడు తెగిపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా.. ఆ ప్రాంతంలో కాళీదేవి ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి యాత్రికులు చేరుకోవాలంటే 2000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే కేబుల్ కార్లను ఉపయోగించుకోవాలి. శనివారం రోప్ వే రూట్ ను వాడేందుకు ప్రతికూల వాతావరణం ఉండటంతో ఉదయం నుంచి మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ రోప్ వే రూట్ వాడకంలో ఉండి ఉంటే.. భక్తులు ప్రమాదంలో చిక్కుకునే వారని, మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందని స్ధానికులు తెలిపారు.

పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ మణికంఠ

  చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఎస్పీ  వి.ఎన్. మణికంఠ చందోలు సందర్శించి, శిక్షణా కేంద్రంలోని వివిధ సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖకు కొత్త శక్తిని అందించబోయే రిక్రూట్ల శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలలో తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.  మొదటగా ఎస్పీ  బ్యారక్స్ విభాగాన్ని పరిశీలించారు. రిక్రూట్లు నివసించే వసతి గదులు పరిశుభ్రంగా, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు. మంచాలు, మెత్తలు, దుప్పట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. తరువాత బాత్రూములు, టాయిలెట్లు పరిశీలించి, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు.  డైనింగ్ హాల్ పరిశీలనలో ఎస్పీ ఒకేసారి వందలాది మంది భోజనం చేయగల సదుపాయం ఉందో లేదో తనిఖీ చేశారు. రిక్రూట్ల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడంపై అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు.  తరువాత కిచెన్ బ్లాక్‌ను పూర్తిగా పరిశీలించారు. ఫ్రిజ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా, వంట పాత్రలు శుభ్రంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. తాగునీటి సదుపాయం సమృద్ధిగా ఉండాలని, నీటిని శుద్ధి చేసి అందించాలని ఆదేశించారు. కిచెన్ వెనుకభాగం పరిశీలించి, చెత్త నిల్వ కాకుండా వ్యర్థాలను సరైన విధంగా పారబోసే విధానం అమలు చేయాలని సూచించారు. అదే విధంగా, రిక్రూట్ల ఆరోగ్యం దృష్ట్యా వైద్య బృందం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. శిక్షణా కేంద్రంలో సీసీ కెమెరా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. MTO చంద్రశేఖర్ మరియు డి.టి.సి. సిబ్బంది పాల్గొన్నారు.

ఈ నెల 14న దాయాదుల బిగ్ ఫైట్.. ఎక్కడో తెలుసా?

దాయాదుల మధ్య ఈ నెల 14న భీకర పోరు జరగనుంది. ఈ యుద్ధం యూఏఈ వేదికగా జగరబోతోంది. విషయమేంటంటే.. ఈ  నెల 14న టీమ్ ఇండియా పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కేంద్ర  ప్రభుత్వ  క్రీడా మార్గదర్శకాలను అనుగుణంగానే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆసియా కప్ షెడ్యూల్ లో బాగంగా యథావిథిగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది.  అసలింతకీ ఆసియా కప్ లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తడానికి ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణం. పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన  సంగతి  తెలిసిందే. ఈ ఘటన తరువాత పాకిస్థాన్‌తో  అన్ని సంబంధాలతో సహా క్రికెట్ సంబంధాలు కూడా తెంచుకోవాల్సిందేన్న డిమాండ్ బలంగా వినిపించింది. విశేషమేంటంటే మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు కూడా ఈ డిమాండ్ కు మద్దతు  ఇచ్చారు. దీంతో టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు బలంగా ఏర్పడ్డాయి. అయితే..  గత నెలలో   కేంద్రం   క్రీడావిధానంపై  మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, శత్రు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేదు కానీ,  బహుళ దేశాల టోర్నీలలో పాకిస్థాన్ తో ఆడవచ్చనిపేర్కొంది. ఆ మర్గ దర్శకాలకు  అనుగుణంగా ఆసియా కప్ లో పాకిస్థాన్ తో ఇండియా తలపడనుంది. ఈ నెల 9 నుంచి ఆసియాకప్ టోర్నీ ప్రారంభమౌతోంది. ఆ టోర్నీలో భాగంగా  14న భారత్, కాసిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 

లిక్కర్ స్కాం కేసులో...ముగ్గురికి బెయిల్

  ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది. మరోవైనపు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్బంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు అయింది. శనివారం సాయంత్రం రాజమండ్రి జైల్లో నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. మరోవైపు కేసులో ప్రధానింధిలుగా ఉన్న ముగ్గురికి విజయవాడ ఏసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు  లక్ష చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని పాస్ పోర్ట్ లను కోర్టులో అందజేయాలని ఆదేశించింది. 

గణేశ్ నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్

  హైదరాబాద్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్నారు. కాన్వాయ్ లేకుండా పరిమిత వాహనాలతో ట్యాంక్ బండ్ కు వెళ్లిన సీఎం.. క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను  పరిశీలించారు.  అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నిమజ్జనాల ఏర్పాట్లను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.  ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరగాల్సి ఉంది? బందోబస్త్ వివరాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. సీఎంతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. బాగా రద్దీగా ఉండే సమయంలో ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించడం అధికారులు గుబులేపింది. శనివారం ఉదయం నుంచి  విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది.   

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

  తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటివరకు చిన్నాచితక డ్రగ్స్ గంజాయి ప్యాకెట్స్ లభ్యమయ్యాయి . కానీ ఓ ఫ్యాక్టరీ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఆ డ్రగ్స్ ని పోలీసుల కంట పడకుండా దేశ విదేశాలకు రవాణా చేస్తున్నారు. ఇంత పెద్ద దందా కొనసాగుతున్న కూడా ఇప్పటివరకు ఈ విషయం బయటపడలేదు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం యదేచ్ఛగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను తయారుచేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు.  అయితే థానే కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరం లోకి అడుగుపెట్టి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీపై సోదాలు చేయ డంతో తీవ్ర కలకలం రేగింది. మరో రాష్ట్రం నుండి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేయడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపో యారు. కానీ ఈ సోదాల్లో విస్తు పోయే విషయాలు వెలుగులోకి రావ డంతో అందరూ ఆశ్చర్య చకితుల య్యారు. అవునండి ఒకటి కోటి కాదు... రెండు కోట్లు కాదు ఏకంగా 12 వేల కోట్ల రూపా యల విలువచేసే డ్రగ్స్ ని తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టు కున్న ఘటన హైదరాబాద్ నగరాన్ని ఊపేసింది హైదరాబాదులోని మేడ్చల్ జిల్లాను కేంద్రంగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు కెమికల్ ఫ్యాక్టరీ మాటుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు.... మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే వారు హైదరాబాదు నగరానికి వచ్చి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 12 వేల కోట్ల విలువచేసేఅత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టిసి, మోలీ, ఎక్స్‌టీసీ మొదలగు మూడు రకాల డ్రగ్స్ ని స్వాధీనం చేసు కున్నారు.  మొత్తం 32 వేల లీటర్ల రా మెటీరియల్ ని అధికారులు స్వాధీన పరచుకు న్నారు. అనంతరం తానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు... మేడ్చల్‌ను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.  అయితే ఒక బంగ్లా దేశ మహిళను తానే పోలీసులు అరెస్టు చేసి తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో హైదరాబాదు నగరంలో ఉన్న ఈ ఎండి డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయినట్లుగా సమాచారం. అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది? ఎన్ని సంవత్సరాలు గా ఈ డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతున్నది? గుట్టు చప్పుడు కాకుండా దేశ విదేశాలకు డ్రగ్స్ ను ఎలా తరలిస్తు న్నారు? ఈ డ్రగ్స్ దందా వెనక ఎవరెవరు ఉన్నారనే వ్యవహారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అరెస్టు చేసిన 13 మందిని విచారణ చేస్తున్నారు.

ఎర్రకోటలో చోరీ... బయటపడిన భద్రతా వైఫల్యం

  రెడ్ ఫోర్టులో చోరీ అంటే నమ్మగలరా? కాని అది నిజమని బహిర్గతమైంది . ఎర్రకోటలో మరో సారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ దొంగ కోట్లు విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకెళ్లిపోయాడు. వివారాల్లోకి వెళితే.. ఎర్రకోట ప్రాంగణంలో జైన మతానికి చెందిన కార్యక్రమం ఒకటి జరుగుతోంది. మొత్తం పదిరోజుల కార్యక్రమం అది. రెండు బంగారు కలశాలతో పాటు వజ్రాలు పొదిగిన మరికొన్ని బంగారు వస్తువులను పూజల్లో ఉంచారు. ఓ దొంగ ఆ బంగారు ఆభరణాల గురించి తెలుసుకుని చోరీకి సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బుధవారం జైన సన్యాసిలా దుస్తులు వేసుకుని పూజలు జరిగే స్టేజి దగ్గరకు వచ్చాడు. నిర్వాహకులందరూ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగ తన పని మొదలుపెట్టాడు. పవిత్రమైన బంగారు వస్తువులు పెట్టిన స్టేజి దగ్గరకు వెళ్లాడు. బంగారు వస్తువుల్ని సంచిలో వేసుకుని మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు. నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి స్టేజి దగ్గరకు వచ్చారు. అక్కడ బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఆ బంగారు వస్తువుల యజమాని సుధీర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. వస్తువులు అందంగా కనిపించాలని వాటిపై విలువైన రాళ్లు పొదిగించామన్నారు. కానీ, కలశాలు మాత్రం తమ సెంటిమెంట్లకు సంబంధించినవి అని, ఆ వస్తువులకు విలువ కట్టలేమని,  దొంగను పోలీసులు గుర్తించారని,  వీలైనంత త్వరగా అతడ్ని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాలలో ఆలయాల మూసివేత

చంద్రగ్రహణం కారణంగాఆదివారం (సెప్టెంబర్ 7)   తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూడపడనుంది. ఆ రోజు సాయంత్రం మూడున్నర గంటల నుంచి మరుసటి రోజు  అంటే (సెప్టెంబర్ 8) తెల్లవారు జామున 3 గంటల వరకూ దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయ నున్నారు.  అంతే కాకుండా ఆదివారం (సెప్టెంబర్ 7)న ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు టీడీడీ ప్రకటించింది. అలాగే ఆ రోజు సాయంత్రం 3 గంటల నుంచి మరుసటి రోజు అంటే సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా మూసివేస్తున్నట్లు టీడీడీ ప్రకటించింది. అదే విధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడిని కూడా చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సోమవారం తెల్లవారు జాము వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ రెండు ఆలయాలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలోని అన్ని దేవాలయాలనూ కూడా చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాన్నం నుంచి సోమవారం ఉదయం వరకూ మూతపడనున్నాయి.