ఈ నెల 14న దాయాదుల బిగ్ ఫైట్.. ఎక్కడో తెలుసా?
posted on Sep 6, 2025 @ 5:20PM
దాయాదుల మధ్య ఈ నెల 14న భీకర పోరు జరగనుంది. ఈ యుద్ధం యూఏఈ వేదికగా జగరబోతోంది. విషయమేంటంటే.. ఈ నెల 14న టీమ్ ఇండియా పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ క్రీడా మార్గదర్శకాలను అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆసియా కప్ షెడ్యూల్ లో బాగంగా యథావిథిగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది.
అసలింతకీ ఆసియా కప్ లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తడానికి ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణం. పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత పాకిస్థాన్‌తో అన్ని సంబంధాలతో సహా క్రికెట్ సంబంధాలు కూడా తెంచుకోవాల్సిందేన్న డిమాండ్ బలంగా వినిపించింది. విశేషమేంటంటే మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు కూడా ఈ డిమాండ్ కు మద్దతు ఇచ్చారు. దీంతో టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు బలంగా ఏర్పడ్డాయి.
అయితే.. గత నెలలో కేంద్రం క్రీడావిధానంపై మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, శత్రు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేదు కానీ, బహుళ దేశాల టోర్నీలలో పాకిస్థాన్ తో ఆడవచ్చనిపేర్కొంది. ఆ మర్గ దర్శకాలకు అనుగుణంగా ఆసియా కప్ లో పాకిస్థాన్ తో ఇండియా తలపడనుంది. ఈ నెల 9 నుంచి ఆసియాకప్ టోర్నీ ప్రారంభమౌతోంది. ఆ టోర్నీలో భాగంగా 14న భారత్, కాసిస్థాన్ జట్లు తలపడనున్నాయి.