ప్రశాంతంగా వినాయక నిమజ్జనం...సీఎం రేవంత్ అభినందనలు
posted on Sep 7, 2025 @ 12:11PM
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్దలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
అలాగే భాగ్య నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు పోటెత్తాయి.
దీంతో ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రధాన మార్గంలో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనాల కోసం క్యూలో వేచి ఉన్నాయి. గ్రేటర్‌లో వినాయకుడు మోత మోగించేశాడు. నిమజ్జనం వేళ డీజీలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది.