ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు తోడు తీరప్రాంతాలలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలలో శుక్ర, శని (సెప్టెంబర్ 12, 13)వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రజలకు సూచించింది.