చెన్నైలో బస్సు దొంగతనం.. ఆత్మకూరులో అరెస్ట్

చెన్నై లో  తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సును దొంగిలించిన వ్యక్తి ఆత్మకూరులో పట్టుబడ్డాడు. విషయమేంటంటే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన  రంజన్ సాహు అనే వ్యక్తి చెన్నైలోని కొయ్యం బెడ్ వద్ద నిలిపి ఉంచిన తమిళనాడు ఆర్టీసీ బస్సును దొంగిలించి.. అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ.. ఆ రాష్ట్ర సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాడు. కాగా నిలిపి ఉంచిన బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీసులు బస్సు ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు వైపుగా వెడుతున్నట్లు గుర్తించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో ఆత్మకూరు అలర్ట్ అయ్యారు.   నెల్లూరుపాలెం వద్ద ఆ బస్సును పట్టుకుని  ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు తరలించి.. విషయాన్ని చెన్నై పోలీసులకు తెలిపారు. దీంతో చెన్నై పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఆత్మకూరు వచ్చి బస్సును దొంగిలించిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని..  టీఎన్ఆర్టీసీ బస్సును చెన్నై తీసుకువెళ్లారు.   

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ దొంగ దొరికాడు

తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో హుండీలో సమర్పించే కానుకలను దొంగిలిస్తూ ఓ దొంగ పట్టుబడ్డాడు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు చోరీ చేసిన దొంగను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.  తమిళనాడుకు చెందిన వ్యక్తి  శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును చోరీ చేశాడు. నాలుగువేల రూపాయలను సదరు దొంగ హుండీ నుంచి చోరీ చేయడాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే విజిలెన్స్, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండి మరీ తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా వారాంతం సమీపిస్తుంటే భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 11) శ్రీవారిని మొత్తం 66 వేల 312 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 728 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 81 లక్షల రూపాయలు వచ్చింది. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. పది మంది మావోలు మృతి

నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. మృతులలో  మావోయిస్టు పార్టీ కీలక నేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ అలియాస్ మనోజ్‏ కూడా ఉన్నారు.   గరియాబాద్ జిల్లా అడవులలో మావోయిస్టుల కదలికలపై అందిన స్పష్టమైన సమాచారం మేరకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కూంబింగ్ లో మెయినాపూర్ ప్రాంతంలో నక్సల్స్ తారసపడ్డారు. భద్రతా దళాలను చూసి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు గాయపడి ఉంటారనీ, దీంతో మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందనీ చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఈ ఎన్ కౌంటర్ లో మరణించి మోడం బాలకృష్ణది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా గణపురం..   స్పెషల్ టాస్క్ ఫోర్స్ , కోబ్రా, సీఆర్‎పీఎఫ్, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదు నెలల కాలంలోనే నాలుగువందల మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు, కేంద్ర కమిటీ సభ్యులు భాస్కర్, సుధాకర్, చలపతి వంటి వారు కూడా ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మావో యిస్టులు లొంగిపోయారు. 

నోరు తెరిచిన మ్యాన్ హోల్.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని ఆ మ్యాన్ లో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోవడం గమనించిన ఆమె తల్లి వేగంగా స్పందించి బాలికను సకాలంలో బయటకు లాగేసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాలిక పుస్తకాల సంచిని బయటకు తీశారు. మ్యాన్ హోల్ లో పడిన బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన చార్మినార్ జెనల్ కమిషనర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన గురించి హైడ్రాకు సమాచారం అందించారు. బాలిక నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  

భారీ వర్షాలకు నిలిచిన రవాణా.. కుళ్లిపోతున్న యాపిల్ పండ్లు

దేశంలో  వివిధ ప్రాంతాల్లో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిరైతులు, జమ్మూ కశ్మీర్ లో యాపిల్ రైతులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపిలో ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా  యాపిల్ పండ్ల రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనివల్ల పండ్లు కుళ్లిపోయి రైతులు నష్టాల పాలౌతున్నారు.   జమ్మూ కాశ్మీర్ లో గత ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల  రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో యాపిల్ పండ్ల రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయింది. యాపిల్ పండ్లలోడుతో బయలుదేరిన లారీలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. ఒకవైపు వర్షాలు.. మరోవైపు రోజుల తరబడి దిగుమతి చేయకుండా ఉండటంతో యాపిల్ పండ్లు కుళ్ళిపోతున్నాయి. దీనివల్ల యాపిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సూపర్ విక్టరీతో ఆసియాకప్ లో శుభారంభం చేసిన టీమ్ ఇండియా

ఆసియా కప్‌ను సూపర్ విక్టరీతో ఆరంభించింది టీమిండియా. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఘన విజయాన్నందుకుంది సూర్యకుమార్   సేన. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య చేధనలో భారత్ 4.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. యూఏఈ ఓపెనర్ అలీషన్.. 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరొకరు డకౌట్‌గా వెనుదిరిగారు.  టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆతిధ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.  9వ ఓవర్‌లో కుల్దీప్ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 8 వికెట్లను యూఏఈ కేవలం 10 పరుగుల వ్యవధిలో కోల్పోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్‌ చక్రవరి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత 58 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో.. టీమిండియా ఫస్ట్ ఓవర్ నుంచే దాటిగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. అభిషేక్ వర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.  గిల్ 20 పరుగులతో.. సూర్యకుమార్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లలో టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసియాకప్ టీ 20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యంత వేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించి అగ్రస్దానంలో ఉంది.

ఫలిస్తున్న లోకేష్ కృషి.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు క్షేమంగా వెనక్కు!

లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతంగా సాగుతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి లోకేష్ బుధవారం (సెప్టెంబర్ 10) నుంచి నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ వాసులు స్వరాష్ట్రానికి బయలు దేరారు సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని నేపాల్ గంజ్ విమానాశ్రయానికి తరలించారు.   అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి విమానాంలో వారిని హైదరాబాద్ తీసుకువస్తారు. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండూ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, పర్యవేక్షించడం కోసం ఆయన అనంతపురం వేదికగా జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు కూడా వెళ్ల లేదు. ఇక పోతే విజయనగరం జిల్లా నుంచి మానససరోవర యాత్ర కోసం  వెళ్లి నేపాల్ లో  చిక్కుకుపోయిన 61 మందిని కూడా సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోకేష్ ఆదేశం  మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వాయా ఆ యాత్రికుల యోగక్షేమాలు విచారించారు.  ఇక పొఖారాలో చిక్కుకున్న తెలుగువారిని తరలించడానికి ప్రత్యేక విమానం  ఖాట్మండు చేరుకుంది. ఇప్పటి వరకూ 176 మంది తెలుగు వారు అక్కడి విమానాశ్రాయానికి చేరుకున్నారు.    ​మొత్తంగా..  ఖాట్మండు, హేటౌడా, పొఖారా, సిమికోట్ సహా నేపాల్‌లోని 12 ప్రదేశాల్లో సుమారు 217 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. వీరిలో చాలా మందిని విమానాలు, రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, ఇతరత్రా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మంత్రి లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ద్వారా రెండు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు.  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో  హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. చిక్కుకున్న ప్రజలందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ చేర్చడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అనుచరుడి దారుణ హత్య

అమెరికాలో రాజకీయ హింసకు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ్య అనుచరుడు ఒకరు బలయ్యారు. ట్రంప్ అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ బుధవారం (సెప్టెంబర్ 10) ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ హత్య జరిగింది. వివరాల్లోకి వెడితే  తన ఆధ్వర్యంలో పని చేసే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే యువజన సంస్థ  ఓరెమ్‌ నగరంలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో  ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో  చార్లీ కిర్క్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఒక వ్యక్తి తుపాకీ హింసకు సంబంధించి ప్రశ్నలు అడుగుతుండగా, కిర్క్ సమాధానం ఇస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఒకే ఒక్క తూటా కిర్క్ మెడ ఎడమ భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి తొలుత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడు నిందితుడు కాదని తేలింది. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చార్లీ కిర్క్ ఒక గొప్ప వ్యక్తి, అమెరికా యువత హృదయాన్ని ఆయన అర్థం చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేరు అంటూ డోనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు.   

కూకట్ పల్లిలో మహిళ దారుణ హత్య

మైనర్ బాలిక సహస్ర హత్య ఉతంతాన్ని మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి కూకట్ పల్లిలో  జరిగింది. కూకట్పల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లోని 13వ అంతస్తు లో ఒక మహిళను అతి దారుణంగా హత్య చేశారు.  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి కుక్కర్ తో  తలపై గట్టిగా మోది అతి కిరాతకంగా హత్య చేశారు. నెలరోజుల కిందట కార్మికులుగా వచ్చిన జార్ఖండ్ వాసులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు మహిళ హత్య తర్వాత జార్ఖండ్ వాసులు కనిపించ కపోవడంతో వారిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కూకట్పల్లిలోని లేక్ స్పాన్ అపార్ట్మెంట్ లో 13 వ అంతస్తు లో రేణు అగర్వాల్(50) అనే మహిళ తన భర్త , కొడుకు తో కలిసి నివాసం ఉంటున్నారు. రేణు అగర్వాల్ భర్త , కొడుకు వ్యాపారం చేస్తుంటారు. ఇంటిలో పని కోసమని ఝార్ఖండ్ నుంచి హర్ష, రోహన్  లను తీసుకొని వచ్చారు.  ఈ ఇద్దరు కార్మికులు నెల రోజుల నుంచి వీరితో పాటే నివాసం ఉంటు న్నారు. కాగా బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం యధాప్రకారం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు  షాపుకు వెళ్లిపోయారు. సాయంత్రం నుంచి రేణు అగర్వాల్  ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏడు గంటల సమయంలో భర్త , కొడుకు ఇంటికి వచ్చారు.ఎంత కొట్టినా   తలుపులు తెరవక పోవడంతో.. భర్తవెంటనే బ్యాక్ డోర్ నుంచి లోపలికి ఒకరిని  పంపించి తలుపులు ఓపెన్ చేయించి చూడగా...ఇంటి హాల్ లో రేణు అగర్వాల్ రక్తం మడుగులో పడి ఉన్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొ ని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమేరా ఫుటేజీల ఆధారంగా  హర్ష, రోహన్ లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిరువురూ బైక్ పై బ్యాగ్ తీసు కొని వెడుతన దృశ్యాలు  సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  వాటిని ఆధారంగా వారిని పట్టుకునేందుకు ఇద్దరినీ పట్టుకు నేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

కాకినాడ ఎంపీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలలో సొమ్ములను కొట్టేస్తున్నారు. వీరి సైబర్ నేరాలకు సామాన్యులే కాదు బడాబాబులు కూడా బలౌతున్నారు. తాజాగా వాట్సాప్ డీపీ మార్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఈ సారి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నది ఏకంగా కాకిడాన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సిబ్బంది. కాకినాడ జనసేన ఎంపి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసి  ఏకంగా 92.5 లక్షలు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.  తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైమ్ వ్యవస్థాపకుడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి  జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే తాజాగా సిఎఫ్ఓ శ్రీనివాసరావు గంగిశెట్టి కి ఆగస్టు 22వ తేదీన ఓ సైబర్ మోసగాడు వాట్సాప్ లో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని మెసేజ్ చేశాడు.అది కొత్త నెంబర్ అని ఎంపీ లాగా  నేరగాడు పరిచయం చేసుకున్నాడు. దీంతో అది తన బాస్ ఉదయ శ్రీనివాస్ నెంబర్ అని సీఎఫ్ వో  శ్రీనివాసులు   నమ్మారు. ఈ క్రమంలో ఆ సైబర్ మోసగాడు ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు చెప్పి అత్యవసరంగా డబ్బులు కావాలని వండర్లా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించమని చెప్పాడు. శ్రీనివాసరావు కూడా తన యజమాని డబ్బులు పంపమ న్నడని భావించి.. డబ్బులు పంపించాడు.ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 11 సార్లు ఎంపీ పేరు చెప్పి రూ.92.5 లక్షలు వసూలు చేశారు.  అయితే ఈ నెల 8న ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు   సిఎఫ్ఓ శ్రీనివాస రావు కలుసుకోవ డంతో అసలు విషయం బయట పడింది. డబ్బులు పంపమని తానెన్నడూ కోరలేదని ఎంపీ చెప్పడంతో  ఇది సైబర్ మోసమని  గుర్తించిన   శ్రీనివాసరావు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంపీ పేరుతో ఈ మోసం జరగడంతో  దీంతో హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు  సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఇప్పటివరకు పోలీ సులు ఏడు లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బును వెనక్కి తీసుకురా వడానికి పోలీసులు ప్రయత్ని స్తున్నారు. పోలీసులు ఒకవైపు డబ్బులు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసు కునేందుకు బ్యాంక్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, ఐపీ అడ్రస్ లను పరిశీలిస్తూనే.... మరోవైపు  నిందితు లను పట్టుకునేం దుకు ప్రయత్నం చేస్తున్నారు. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అదే విధంగా గురువారం (సెప్టెంబర్ 11) కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 10) శ్రీవారిని మొత్తం 70 వేల 86 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది. 

అగ్నివీర్ అరెస్ట్ . ముంబై నేవీకి చిక్కిన ఇద్దరు అగంతకులు

  అతను ఒక అగ్ని వీర్.. నావి అగ్ని వీర్ గా సెలెక్ట్ అయ్యాడు.. ముంబై నేవీ ప్రధాన కేంద్రంలో పనిచేస్తు న్నాడు ..ఇటీవల కాలంలో అతన్ని ముంబై నుంచి కేరళకు బదిలీ చేశారు.. కారణాలు ఏంటో తెలియదు.. కానీ ముంబై నుంచి కేరళ కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయి వచ్చాడు .. ఇక్కడ వరకు బాగానే ఉంది ..కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.. రెండు రోజుల క్రితం నేవీ ముంబై ప్రధాన కేంద్రానికి తిరిగి ఈ అగ్ని వీరు వెళ్లారు.. ఈసారి ఏకంగా యూనిఫాంలో పోయాడు..రాత్రి సమయంలో వెళ్లిన ఈ నావి అధికారి ఉమేష్, సెంట్రీ పోస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ..డ్యూటీ చేంజ్ అయ్యే సమయం ..అక్కడ డ్యూటీలో ఉన్న గార్డ్ దగ్గరికి వెళ్లి తాను డ్యూటీలో చేరుతున్నానని నీకు రిలీవ్ ఇస్తున్నానని చెప్పాడు.. 10 గంటల సమయం లో అక్కడ ఉన్న గార్డ్ రిలీవ్ అయి పోయి...నావి అధికారి ఉమేష్ కి బాధ్యతలు అప్పగించాడు. ఆ సమయంలో అతను దగ్గర ఉన్న ఒక ఇన్సాస్ వేపన్ తో పాటు 40 బుల్లెట్స్  కూడా ఉమేష్ కి అప్పగించి సదర్ అధికారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ..అయితే ఉమేష్  తో పాటు రాకేష్ ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు ..రాకేష్ ని గేటు పక్కన నిలబెట్టాడు.. ఉమేష్ చేతిలోకి వెపన్ తోపాటు బుల్లెట్లు రాగానే అక్కడ అధికారుల కళ్ళు కప్పి పక్కనే.. అప్పటికే అక్కడ ఉన్న రాకేష్ కి వెపన్ ఇచ్చేశాడు. కొద్దిసేపు పాటు అక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నట్లుగా నటించాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమై పోయాడు.. నేవీ ప్రధాన కార్యాల యంలో కొట్టేసిన ఇన్సాస్ వెపన్ తో పాటు బుల్లెట్స్ ను తీసుకొని ఈ ఇద్దరు  చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కు  చేరుకున్నారు.  అక్కడ ట్రైన్ ఎక్కేసి నేరుగా హైదరాబాద్ వచ్చాడు... హైదరాబాద్ నుంచి తన సొంత ఊరైన ఆసిఫాబాద్ ఎలుక పల్లి కి చేరుకున్నాడు.. తాను తెచ్చిన వెపన్స్  తమ్ముడికి  ఇచ్చి వేశాడు .. డ్యూటీలో ఉండాల్సిన గార్డు అక్కడ లేకపోవడంతో అధికారు లకు అనుమానం వచ్చింది.. వెంటనే రిలీవ్ అయిన అధికారిని పిలిపించారు. మరొకరికి డ్యూటీ బాధ్యతలు అప్ప గించి వెళ్ళిపోయా నని చెప్పాడు.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఉమేష్ గన్‌తో సహా వెళ్లిపోయి నట్లుగా విషయం బయటపడింది .. దీంతో ఇది ఉగ్రవాద కుట్ర ఏదో జరగబోతుందని అనుమానం అధికారులకు వచ్చింది ..వెంటనే నేవీ ఇంటెలిజెన్స్ అధికారులతో  పాటు ముంబై ఏటిఎస్ , ఎన్‌ఐ రంగంలోకి దిగారు. చివరికి ఆసిఫా బాద్‌లో ఉమేష్ వెప్పన్‌తో సహా చిక్కాడు..తెలంగాణ పోలీసులు ఉమేష్, రాకేష్ ను పట్టుకొని ముంబై పోలీసులకు అప్పగించారు.. అయితే ఉమేష్ ఈ వెపన్ దొంగలించ డానికి అసలు కారణం ఏంటి? అనేదానిపై  అధికారులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టు లేదంటే ఉగ్రవాదులతో ఉమేష్ కి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుగుతుంది..  

రాష్ట్రంలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి

  రాష్ట్రంలో పలు చోట్ల పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం శివారులో వర్షం పడుతుందటంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు చేరారు. ఈ క్రమంలో పిడుగు పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి పార్వతమ్మ(22), సర్వేశ్(20), సౌభాగ్యమ్మ(40) అనే ముగ్గురు మృతి మరణించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గేదెలను కాస్తున్న మహేష్(26), మధిరలో వీరభద్రరావు(56) అనే మరో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎంత ట్రంప‌రిత‌నం?

  ఉద‌యం ఉన్న మాట మ‌ధ్యాహ్నానికి.. మ‌ధ్యాహ్నం మాట సాయంత్రానికి ఉండ‌టం లేదు. ద‌టీజ్ ట్రంప్. ట్రంప్ ఒక మాట మీద ఎంత మాత్రం నిల‌క‌డ చూపించ‌డం లేదు. ఆయ‌న బేసిగ్గానే అంతేనా?  లేక భార‌త్ అంటేనే అలా చేస్తున్నారా? ఏం తెలీడం లేదు.  యాభై శాతం సుంకాల విష‌యంలో.. భార‌త ప్ర‌ధాని త‌న‌తో ఎప్పుడు మాట్లాడ‌తాడా? అని తాను ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు ట్రంప్. ఈ దిశ‌గా త‌న ట్రూత్ పోస్ట్ లో కామెంట్  చేశారు కూడా.  మోడీ కూడా స‌రిగ్గా ఇలాగే రియాక్ట‌య్యారు. భార‌త్ యూఎస్ మంచి ఫ్రెండ్స్ అన్నారు.  క‌ట్  చేస్తే సాయంత్రానిక‌ల్లా ట్రంప్ చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్. చైనాల‌పై 100 శాతం సుంకాలు విధించ‌మ‌ని యురోపియ‌న్ యూనియ‌న్ కి సూచించారు. ఉద‌యం మోడీ  తాను మంచి మిత్రులం అన‌డం ఏంటి? ఆయ‌న‌తో ఎప్పుడు మాట్లాడ‌దామా? అని ఎదురు చూస్తున్న‌ట్టు చెప్ప‌డ‌మేంటి? స‌డెన్ గా యురోపియ‌న్ యూనియ‌న్ కి ఇలా సూచించ‌డ‌మేంటి? ఇది ట్రంప్ త‌ప్పా? లేక ట్రంప్ ని మోడీయే స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక పోతున్నారా? ఏమీ అర్ధం కావ‌డం లేదంటారు విదేశాంగ నిపుణులు. స‌రే ఇదంతా ఎందుక‌ని చూస్తే.. ర‌ష్యాను కంట్రోల్ చేయ‌డానిక‌ట‌. ఉక్రెయిన్ లో వీలైనంత త్వ‌ర‌గా శాంతి స్థాప‌న జ‌ర‌గాల‌న్న‌ది స‌గ‌టు యురోపియ‌న్ దేశాల అభిమ‌తమ‌ట‌. అయితే వీరికి ట్రంప్ ఇస్తున్న సూచ‌న ఏంటంటే.. భార‌త్. చైనాల‌పై వంద శాతం సుంకాలు విధిస్తే మొత్తం సెట్ అయిపోతుంద‌న‌డం.  ఇదెక్క‌డి విడ్డూర‌మో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. మొన్న‌టికి మొన్న అల‌స్కాలో ఇదే ట్రంప్ పుతిన్ ని క‌లిశారు. చ‌ర్చించారు. ఆ స‌మ‌యంలో తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ఆయ‌న చేత చేయించ‌కుండా..ఈ ఇన్ డైరెక్ట్ సెన్స్ లో అర్ధ‌మేంటి? పుతిన్ త‌న‌కు ఎంతో మంచి మిత్రుడ‌ని చెబుతూ కూడా ఆయ‌న్ను దారికి తెచ్చుకోలేక పోవ‌డ‌మేంటి? ర‌ష్యాకు భార‌త్ చ‌మురు కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఆ ఆర్ధిక శ‌క్తితో ఆ దేశం ఉక్రెయిన్ తో యుద్ధం కొన‌సాగించ‌గ‌లుగుతోంద‌న‌డం ఏంటి? నిజానికి భార‌త్ ర‌ష్యా నుంచి కొంటున్న ఆయిల్ వ‌ల్ల వ‌చ్చే లాభం కేవ‌లం తొంభై ఐదు వేల కోట్ల రూపాయ‌లు. దీని ద్వారా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా కంట్రోల్లో ఉంటాయి. ఇందు వ‌ల్లే భార‌త్ ర‌ష్యా నుంచి ఆయిల్ కొంటోంది. మోకాలికీ బోడిగుండుకూ లింకు పెట్టిన‌ట్టు ఏంటీ ట్రంప‌రిత‌నం??? అన్న‌ది ఎవరికీ అంతు చిక్క‌డం లేదు.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బిగ్ షాక్

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్ తగిలింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డికి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కోట్టివేసింది. చెవిరెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ప్రాసిక్యూషన్‌తో కోర్టు ఏకీభవించింది.  ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీంతో బెయిల్ ఇవ్వాలని తరచూ కోరుతున్నారు.  ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ సారి అయినా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయనకు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది. చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

  ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని నంద్యాల, వైజాగ్, అనకాపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు. 

బీఆర్ నాయుడితో టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు బేటీ!

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నేడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న శ్యామలరావును ప్రభుత్వం జీఏడీ ప్రధాన కార్యదర్శిగా బదలీ చేసింది. శ్యామలరావు బదలీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో ఆయనకు ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. బీఆర్ నాయుడితో శ్యామలరావు విభేదాలు    తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి. అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు.  అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన  సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది. దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.  అయితే టీటీడీ ఈవోగా రిలీవ్ అయిన తరువాత శ్యామలరావు బుధవారం (సెప్టెంబర్ 10) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈవోగా తన పదవీ కాలంలో బీఆర్ నాయుడు అందించిన సహకారానికి కృతజ్ణతలు తెలిపారు. అలాగే బీఆర్ నాయుడు శ్యామలరావును శాలువతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ణాపికగా అందించారు. 

ఫిలింనగర్ భూ వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు

  జూబ్లీహిల్స్ లోని దక్కన్ కిచెన్ వ్యవహారం ఎటు తేలడం  లేదు.. దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన ఈ కిచెన్ వ్యవహారం పైన కోర్టులో సుదీర్ఘంగా నడుస్తుంది.. దక్కన్ కిచెన్ లోకి అక్రమంగా చొరబడి తమని మోసం చేశారని చెప్పి నందకుమార్ పైన హీరో వెంకటేష్ ,సురేష్ బాబులు పిర్యాదు చేశారు.. సురేష్ బాబు స్థలంలోకి ఉన్న దక్కన్ కిచెన్ ని అధికారులు కూల్చివేసి నందకుమార్‌ను పంపించివేసి స్థలాన్ని దగ్గుబాటి కుటుంబానికి అప్పగించారు.  దక్కన్ కిచెన్ వ్యవహారంలో తాను తీవ్ర స్థాయి లో నష్టపోయానని, తనకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండా నిర్మాణాలను కూల్చి వేసి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారని హీరో వెంకటేష్ , సురేష్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు.. గతంలో దక్కన్ హోటల్ కూల్చి వేసిన విషయం తెలిసిందే... అయితే నందకుమార్ దక్కన్ హోటల్ నడుపుతున్నాడు.  నందకుమార్ ను   ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు ..కానీ నందకుమార్ కోర్టును ఆశ్రయిం చాడు. అయితే అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా సురేష్ బాబు కొంతమంది అధికారులతో కలిసి దక్కన్ హోటల్ కూల్చివేశారు.  దీంతో నందకుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెరకు కోర్టులో విచారణ కొనసా గుతున్నది.. అయితే నందకు మార్ గత 18 నెలలుగా తాను కోర్టులో పోరాడు తున్నానని, తన హోటల్ ను అన్యా యంగా కూల్చివేశారని... నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను అప్రూవర్గ మారినందుకే నా మీద 12 అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు... కోర్టు ఎన్ని మార్లు చెప్పినా కూడా సురేష్ బాబు, వెంకటేష్  కోర్టు కు హాజరు కావడం లేదు. అంతేకాకుండా సురేష్ బాబు అతని కుటుంబ సభ్యులు కోర్టు విచారణకు రాకుండా కేసును విత్‌డ్రా చేసుకోక పోతే నన్ను చంపే స్తానని బెదిరింపు లకు గురి చేస్తున్నా రని నందకుమార్ వాపోయాడు. ఇప్పటికే కోర్టు సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ లను కోర్టు కు రావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది ..అప్పుడు హీరో వెంకటేష్ తో పాటు సురేష్ బాబులు రాని పక్షంలో చర్యలకు ఆదేశాలు ఇస్తామని కోర్టు హెచ్చరించింది.