జనం గుండెల్లో నాన్న.. షర్మిల

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారని, ఆయన మరణించి 16 ఏళ్ల అయినా నేటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు  షర్మిల అన్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా  నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహానేత వైయస్సార్   ఆరోగ్యశ్రీ ,ఉచిత విద్యుత్తు, ఫీజు రీయంబర్స్మెంట్, పథకాలు తీసుకువచ్చారనీ, అవి  వైయస్సార్ గుండెల్లో నుంచి పుట్టిన పథకాలని అన్నారు.  వైఎస్ఆర్ కు ఇంత ఆదరణ ఇచ్చిన  ప్రతి ఒక్కరికి కృతజ్ణతలు తెలిపారు.  వైయస్సార్ చనిపోయాక ఆ బాధ భరించలేక 700 మంది చనిపోయారని ఆ కుటుంబాలకు కూడా నివాళులర్పిస్తున్నానని తెలిపారు

ఇడుపులపాయలో తండ్రి వైయస్ కు జగన్ నివాళులు

  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా  కడపజిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్  వద్ద ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఘన నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు , వైసీపీ ముఖ్యనేతలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులర్పించిన జగన్.. ఆ తరువాత   ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.తల్లి విజయమ్మతో పాటు భార్య వైఎస్ భారతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో  ఇడుపులపాయ ఘాట్ ప్రాంతం మార్మోగింది.

ఏసీబీ కస్టడీకి ఐఏఎస్ అధికారి సంజయ్

ఐపీఎస్ అధికారి సంజయ్‌ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీ   కస్టడీకిఅనుమతిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 1) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి ఏసీబీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. జగన్ హయాంలో  అగ్నిమాపక శాఖ, ఆ తరువాత ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ పని చేసిన సంగతి తలిసిందే. ఆయన అగ్నిమాక శాఖలో ఉన్న సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సంజయ్ ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పై గత వారం వాదనలు ముగియగా, కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు అంటే సోమవారం (సెప్టెంబర్ 2) సంజయ్ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 4 వరకూ ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ సంజయ్ ను అదుపులోనికి తీసుకుని విచారించనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఏరోజు కారోజు విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం ఆరుగంటలకు విజయవాడ జిల్లా జైలులో అప్పగించనుంది. ఇదిలా ఉండగా ఆరోగ్య కారణాలు చూపుతూ సంజయ్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది.  

ప్రధాని మోదీ కోసం వెయిట్ చేసిన పుతిన్

    ఇండియా-రష్యా సంబంధాలు ఎలా ఉంటాయో.. రెండు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉంటుందో.. ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. దాన్ని మరింత బలంగా చాటేందుకు.. భారత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇంట్రస్టింగ్ మీటింగ్ ఒకటి జరిగింది. షాంఘై సహకార సదస్సు వేదిక నుంచి.. ప్రెసిడెంట్ పుతిన్, పీఎం మోడీ ఇద్దరూ.. ఒకే కారులో ప్రయాణించారు. SCO మీటింగ్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్‌కి.. మోడీతో కలిసి వెళ్లాలనుకున్నారు పుతిన్.  అంతేకాదు.. ప్రధాని మోడీ వచ్చే దాకా.. పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు కారులో ప్రయాణిస్తూ.. వివిధ అంశాలపై సంభాషించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ దగ్గరకు చేరుకున్న తర్వాత కూడా.. ఇద్దరు నేతలు మరో 45 నిమిషాల పాటు కారులోనే గడిపారు. దీని తర్వాతే.. పుతిన్, మోడీ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇదొక.. గంటకు పైగా కొనసాగింది. అయితే మోడీ కోసం పుతిన్ వెయిట్ చేయడం, తన కారులోనే ఆయన్ని తీసుకెళ్లడమే అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. పైగా మోడీ, పుతిన్ ఇద్దరూ 45 నిమిషాల పాటు కారులో దేని గురించి చర్చించారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలనే దానిపై.. మోడీ ఏమైనా పుతిన్‌తో మాట్లాడి ఉంటారా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయ్. ఎందుకంటే.. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ దేశంలో ఉన్న తాజా పరిణామాలపై.. ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతియుత మార్గాల్లోనే.. సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని.. మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు మోడీ. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.  అందువల్ల.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై.. మోడీ ఏమైనా మాట్లాడారా? ఆ 45 నిమిషాల భేటీలో.. ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే గనక జరిగితే.. యుద్ధం ముగించడంలో మోడీది కీలకపాత్రే కాబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇక.. మోడీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహానికి, రాజకీయపరమైన సాన్నిహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు. భారత్-రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటిచెప్పే.. బలమైన రాజకీయ ప్రకటనగా చెబుతున్నారు.  కారులో ప్రయాణించిన సమయంలోనే కాదు.. తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ.. ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతం లాంటి.. ఆర్థిక అంశాలపై చర్చించారు. అమెరికా విధించిన అదనపు సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం గురించి కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చలు జరిగాయి. తమ మధ్య ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిగినా.. లోతుగా, ఫలవంతంగా ఉంటాయని.. ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.

అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు

  అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటయించింది. ప్రభుత్వ సంస్ధగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలందిస్తుంది. రెండు వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్‌, 5కే గేట్స్‌ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.  చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయించింది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఉచిత కంప్యూటింగ్‌ టైమ్‌ను ఐబీఎం సంస్థ ప్రభుత్వానికి కేటాయించనుంది. ప్రభుత్వ సంస్థలు, విద్యపరమైన అంశాలకు గానూ ఈ కంప్యూటింగ్‌ టైమ్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విట్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.6కోట్ల వ్యయంతో బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్‌ కంపెనీ మరో చిన్న క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటుచేయనుంది.అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్‌ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

రాజకీయ జీవితంలో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు: సీఎం చంద్రబాబు

  రాజకీయ జీవితంలో తాను ఏనాడు రెస్ట్ తీసుకోలేదని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో దివ్యాంగురాలు యడవల్లి సుమిత్రమ్మ అనే మహిళకు పింఛను అందించారు.  అక్కడ విధుల్లో ఉన్న రజకులతో కాసేపు ముచ్చటించారు. పనిలో కష్టాలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరైనా పింఛను తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలని చెప్పారు. ప్రజలు ఆశీర్వదీస్తే తాను కొండలనైనా పిండి చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. నదుల అనుసంధానంతోనే రైతుల అభివృద్ధి సాధ్యం. గంగా నది నుంచి కావేరి నది వరకు అనుసంధానం జరగాలి అని ఆయన అన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు సంజీవని ప్రాజెక్టు తీసకొస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత చూపించారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారు. దేశాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని సీఎం తెలిపారు

ఎవరైతే మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు : గడ్కరీ

  నేటి తరం రాజకీయలపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసే వారినే గొప్ప నాయకులుగా పరిణిస్తారని తెలిపారు. మహారాష్ట్ర  నాగ్‌పుర్‌లో అఖిల భారత మహానుభావ పరిషత్తు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. అయితే ఏదైనా సాధించడానికి ఒక షార్ట్ కట్ ఉంటుందని, కానీ షార్ట్ కట్ వాడితే  అది మనల్ని షార్ట్‌గా కట్ చేస్తుందన్నారు. అందుకే నిజాయతీ, విశ్వసనీయత వంటి విలువలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.  దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ నిజంపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ధర్మమే  గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు’ అని గడ్కరీ పేర్కొన్నారు. తన దైనందిన జీవితంలో(రాజకీయాల్లో) నిజం మాట్లాడటం నిషేధమని వ్యాఖ్యానించారు. ‘నేను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషధమని తెలిపారు. ఇటీవల గడ్కరీ మాట్లాడుతూ కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, పరిపాలన అద్భుతంగా జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే వారి కారణంగా రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తాయని గడ్కరీ తెలిపారు

రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోటీ చేస్తున్న : జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

  ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి  ఆయన ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనకు ఏపార్టీలో సభ్యత్వం లేదని తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాను ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతు కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని తెలిపారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ.. తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మాజీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు  

స్మిత సభర్వాల్ పై చట్టపరమైన చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫారసు!

ఇటీవలే లాంగ్ లీవ్ లో వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు కాళేశ్వరం ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో స్మితా సభర్వాల్ పాత్ర ఉందని కాళేశ్వరం అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీల వ్యవహారంలో స్మితా సభర్వాల్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.   ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి  సిఫార్సు చేసింది. పీసీ ఘోష్ కమిషన్  నివేదికలో స్మితా సభర్వాల్ విచారణకు సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారా? అన్న కమిషన్ ప్రశ్నించగా తొలుత  అవును అని బదులిచ్చిన ఆమె తరువాత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ లో మాత్రం  తనకేమీ తెలియదని బుకాయించినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఆరోగ్యకారణాలు చూపుతూ లాంగ్ లీవ్ పై వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సభర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించారు.  ఇప్పుడు కమిషన్ నివేదికలో ఆమె తీరును తప్పుపడుతూ పీసీ కమిషన్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీ ముందుకు రావడానికి ముందే ఆమె ఆరోగ్య కారణాలు చెబుతూ లాంగ్ లీవ్ లో వెళ్లారన్న చర్చ నడుస్తోంది. 

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలంటే స్థానికత తప్పనిసరి.. సుప్రీం

వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పని సరి అని పేర్కొంది. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టేసింది.   సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణలో  వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల  స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే,  కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూనే..  గతేడాది ఇచ్చిన మినహా యింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను మాత్రం అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.    

స్త్రీశక్తి పథకం ఇప్పుడు ఆ బస్సులకు కూడా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించిన  స్త్రీ శక్తి  పథకానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ పథకం ద్వారా ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఎంపిక చేసిన బస్సులలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా, చంద్రబాబు సర్కార్ ఇప్పుడు దీనిని విస్తరించింది. ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ విధానంలో నడిచే బస్సులలోనూ అంటే.. కండక్టర్ లేకండా నడిపే బస్సులలో కూడా స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణానికి మహిళలకు అవకాశం ఉంటుంది. అంటే రెండు మూడు బస్టాండ్ లలో మాత్రమే ఆగే  సర్వీసులలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.   అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘాట్ రోడ్డులపై వెళ్లే బస్సులలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది.  సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సుల్లోనూ  స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. యాత్రికుల ఇబ్బందులు తలెత్తకుండా ఆ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు మినహాయించాలని ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకి లేఖ రాసి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.  

టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్లో మంటలు

విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా తలెత్తుతునన లోపాలు, సంభవిస్తున్న ప్రమాదాలతో జనం విమాన ప్రయాణమంటూనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం గాల్లో  ఎగురుతుండగానే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆదివారం (ఆగస్టు 31) ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో   టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణీకులు  ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి  ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.  విమానం ఇంజిన్లో మంటలు రావడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.  

ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి.. లంక గ్రామాలకు ముంపు ముప్పు

ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉధృత ప్రవాహం లంక గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటితో పోటెత్తుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు బ్యారేజి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీని 10,92 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. బ్యారేజీ గేట్లు ఎత్తివేసి అధికారులు 10 లక్షల ఒక వేయి 410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ముంపు గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద ప్రవాహం తీవ్ర స్థాయిలో ఉండటం, నీటి మట్టం 48 అడుగులు దాటి వూయడంతో  అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 

భద్రాచలం వద్ద గోదావరి వరద.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇక్కడ గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఆదివారం ఉ(ఆగస్టు 31) ఉదయం 9 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అగుడులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల మెట్లు నీట మునిగాయి. భక్తులు ఎవరూ గోదావరిలో స్నానాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండగా వరద ఉధృతితో తూరుబాక వద్ద ప్రధాన రహదారి నీట మునిగింది. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే  పలు ఏజెన్సీ మండ లాలు ముంపునకు గురయ్యాయి.  వీఆర్ పురం, కూనవరం, చింతూరులు జలదిగ్బంధంలో ఉన్నాయి.   

దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం

  ఆగస్టు 29 నుండి పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ 24వ వార్షిక సమావేశం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, యువ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ రంగంలో తాజా ఆవిష్కరణలు, కొత్త చికిత్సా పద్ధతులు, అధునాతన శస్త్రచికిత్సా సాంకేతికతలపై చర్చించారు. 5 వేల మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తిరుపతి బర్డ్ హాస్పిటల్ సంచాలకులు డా. గుడారు జగదీష్ ఈ సమావేశంలో పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. “యువ రోగులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా వివరించారు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న రోగులకు దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే మోకాలి సమస్యల సందర్భాల్లో మోకాలి మార్పిడి అవసరం అవుతుందని వివరించారు. చిన్న వయసులో ఇలాంటి శస్త్రచికిత్సలలో ఎదురయ్యే సవాళ్లు, ఆపరేషన్ అనంతర జీవిత నాణ్యతలో వచ్చే మార్పులను విశ్లేషించారు. అదేవిధంగా చిన్న వయసులో జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? ఆపరేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. “ఉద్యోగం చేయలేక, ఇంటికే పరిమితం అయిన రోగుల జీవితాన్ని మార్చడంలో మోకాలి మార్పిడి ఆపరేషన్ కీలకం” అని డా. జగదీష్ అన్నారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సర్జన్ నైపుణ్యం, ఆపరేషన్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, నాణ్యమైన ఇంప్లాంట్ల ఎంపిక ప్రధానమని ఆయన పేర్కొన్నారు. తన అనుభవాలు, పరిశోధనల ఆధారంగా యువ రోగులకు ఈ శస్త్రచికిత్సలో పరిగణించాల్సిన అంశాలను వివరించారు. 1999లో బర్డ్ హాస్పిటల్‌లో 21 ఏళ్ల యువతికి చేసిన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహిళ ఆరోగ్యవంతంగా, చురుకుగా జీవిస్తున్నారని వివరించారు. ఈ తరహా ఉదాహరణల ద్వారా సరైన ఆర్థోపెడిక్ చికిత్సలతో యువ రోగులు కూడా పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆయన స్పష్టం చేశారు. డా. జగదీష్ ప్రసంగం యువ వైద్యులు, పరిశోధకులకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఈ సమావేశం ఆర్థోపెడిక్ వైద్య రంగంలో కొత్త పరిశోధనలకు, మెరుగైన చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

కుప్పానికి కృష్ణ‌మ్మ‌...అప‌ర‌భ‌గీర‌థుడు చంద్ర‌బాబు

  అస‌లేంటి హంద్రీనీవా ప్రాజెక్టు దీని పూర్వాప‌రాలు ఎలాంటివి అని చూస్తే.. రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన. మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు. సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్లు  ఖరీఫ్‌ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీలు  త్రాగునీటి సదుపాయం కల్పన. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల ద‌గ్గ‌ర‌ ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు. మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. ఉంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్‌ సుమారు 672 మెగావాట్లుగా ఉంది. ప్రాజెక్టు దశల విష‌యానికి వ‌స్తే.. ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు వెళ్తుంది. ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీల నీరందిస్తుంది. ఇక ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుండ‌గా..  4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీల మేర అందిస్తుంది. మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే..  కృష్ణగిరి – 0.161 TMC కాగా,  పాతికొండ – 1.126 TMC,  జీడిపల్లె – 1.631 TMC, కాగా మరాల – 0.465 TMC,  శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMCగా ఉంది. అదవిపల్లె – 1.814 TMCలుగా ఉంది.  బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే.. గోల్లపల్లె – 1.913 TMC మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌పై, చెర్లపల్లె – 1.608 TMC పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌పై బ్రాంచ్‌ కెనాళ్లు, ఇక‌  డిస్ట్రిబ్యూటరీలు, మడకశిర బ్రాంచ్ కెనాల్  235.435 Km – 61,557 ఎకరాలు, పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు, తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు, నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు, వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ..  42.30 Km – 22,400 ఎకరాలు, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు, సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్‌ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం కానుంది. దీని పొడవు: 220.350 Km. జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు  అంటూ చిత్తూరు జిల్లా  వరకు ఉంటుంది.  ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్  పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది. 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం. పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుప్పం చివ‌ర్లోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది. దీన్నిబ‌ట్టీ చూస్తే.. చిత్తూరు జిల్లా చివ‌రి ఆయ‌క‌ట్ట వ‌ర‌కూ కృష్ణాజ‌లాలు ప్ర‌వ‌హించడం ఒక చ‌రిత్ర‌, 2014 నుంచి 2019 మ‌ధ్య వ‌ర‌కూ నాలుగు వేల కోట్ల వ‌ర‌కూ వెచ్చించిన చంద్ర‌బాబు 2024 లో తిరిగి పీఠ‌మెక్కాక‌.. నెల‌లో మెయిన్ కెనాల్ పూర్తి చేసి.. కృష్ణా జ‌లాల‌ను ఎట్ట‌కేల‌కు కుప్పం చేర్చారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను అప‌ర భ‌గీర‌థుడ‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ ప్రాంత వాసులు.