పాత తరపు విలువల పాఠశాల, ఈ బుర్ర కథ వేదిక.....
ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన జనాలకి ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారు. అప్పట్లో బుర్ర కథని మించిన వినోదం లేదనే చెప్పాలి. అలాంటి బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన షేక్ నాజర్ ఒక గొప్ప నటుడు, ప్రజారచయిత, గాయకుడు. బుర్రకథ కోసం ఆయన చేసిన కృషివల్ల బుర్రకథా పితామహుడయ్యాడు. “ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ,సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడాయన.. ఈ రోజు ఆయన జన్మదిన సంధర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే.....
షేక్ నాజర్ జీవిత విశేషాలు.....
ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో, 1920, ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. హార్మోనిస్టు ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. కానీ పేదరికం వల్ల నాజర్ అక్కడ ఉండలేకపోయాడు. తరువాత అతను బాలమహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. టైలరుగా కూడా పని చేశాడు. ఆర్యమత సిద్ధాంతం నచ్చటంతో మాంసాహారం తినటం మానేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు.
తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు చారిత్రక కథలకి సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. నాజర్ ఆత్మకథ ‘పింజారి’ చిన్న పుస్తకమే అయినప్పటికీ తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్చుకోవటానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చింది అనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు. తనను చేరదీసి, అన్నం పెట్టిన, విద్య నేర్పిన మహా పండితుల నుండి విద్యలో తనకంటే చిన్నవారి
నుంచి కూడా తానేం నేర్చుకున్నానో పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. చివరికి నలబై సంవత్సరాల నాటక ప్రస్థానం ముగిస్తూ, 1997లో ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.
కళకే ‘కళ’ తెచ్చిన ఆయన ప్రతిభ ......
షేక్ నాజర్ తన హావభావాలతో, ఆటపాటలతో జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే అనే పాత సినిమాల్లో నాజర్ బుర్రకథలు కన్పిస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి పూలరంగడు సినిమా కోసం ఈ విద్యని నేర్పించాడు. అతని గళ గాంభీర్యానికి , మాధుర్యానికి మంత్రముగ్ధులైన సినీ ప్రముఖులు సినీ రంగంలో స్థిరపడమని చెప్పినా కూడా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆయన రాసిన ఆసామీ నాటకానికి 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ లభించింది.
ప్రశంసలు- సత్కారాలు.....
తెలుగు సినీ నటకిరీటుల్లో ఒకరైన ఎన్‌టిఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు నేను మీ అభిమానినని నాజర్ చెప్పిన మాటకి ‘నేను... మీ అభిమానినని’ చెప్పి అందరినీ ఆనందపరిచారు. ప్రముఖ రచయిత శివప్రసాద్ "నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు" అని అన్నారు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.
నేటి తరం మన జాతి కోసం కృషి చేసిన ఇలాంటి మహానుభావులెవరినీ మరవకూడదు. మన ప్రాచీన సంస్కృతిని, జానపద కలలని అసలే మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మన ఉనికిని మనం మర్చిపోతున్నట్టే.
*రూపశ్రీ