సైన్స్ రంగంలో మహిళల విజయ పతాకం..
posted on Feb 11, 2025 @ 9:30AM
ఆడవారు చదువుకి కూడా నోచుకోని ఆటవిక కాలం నుంచి మగవారితో సమానంగా ఉన్నతవిద్య పొందే కాలానికి వచ్చింది మన సమాజం. అయితే ఇప్పుడు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ఉంటున్నప్పటికీ ఇంకా వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అందుకే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM) రంగాల్లో మహిళలు, అమ్మాయిలు సాధించిన విజయాలని, వారి కృషిని గౌరవించటానికి, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారతకున్న ప్రాముఖ్యతను గుర్తుచేయటానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి11న ‘అంతర్జాతీయ మహిళలు, బాలికల విజ్ఞానశాస్త్ర దినోత్సవం’ జరుపుకుంటారు. శాస్త్రీయ రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి ఎదురైన అడ్డంకులను, దురభిప్రాయాలను తొలగించడమే ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. మరి ఈ దినోత్సవం మహిళా పురోగతికి ఎలా సాయపడుతుందో తెలుసుకుంటే...
ఎప్పుడు మొదలైందంటే..
మొదటి నుంచీ సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM) వంటి రంగాలలో లింగ అసమానత్వం చాలా ఎక్కువగా ఉంటూ వస్తుంది. అయితే మహిళల సాధికారత, లింగ సమానత్వం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి భావించింది. 2015లో జనరల్ అసెంబ్లీ ద్వారా అంతర్జాతీయ మహిళలు, బాలికల విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్థాపించింది. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. మహిళా శాస్త్రవేత్తలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త ఐన మేరీ క్యూరీ జన్మదినాన్ని గౌరవిస్తూ ఈ రోజుని ఎంచుకున్నారు. ఈ దినోత్సవం గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచ సమాజంలోని మహిళలు, బాలికలను విజ్ఞానశాస్త్రంలో భాగస్వాములని చేసేందుకు ప్రేరేపించింది.
సైన్సు రంగంలో మహిళా పురోగతి ..
2700బిసి కాలానికి చెందిన మెరిట్-ప్తా సమాధిపై “చీఫ్ ఫిజీషియన్” అని రాసి ఉండటంతో ఆవిడే మొదటి మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచింది. 1876లో ఎలిజబెత్ బ్రగ్ అనే మహిళ తొలి ఇంజనీరింగ్ పట్టా పొందటంతో మహిళల ఉన్నత విద్యకి తొలి అడుగు పడినట్టయింది. మన ఇండియాలో అయితే 1919లో అయ్యల సోమయాజుల లలిత మొట్టమొదటి మహిళా ఇంజినీరుగా పట్టా పొందారు. రేడియోధార్మికత మీద విశేష ప్రయోగాలు చేసిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1903లో మొట్ట మొదటి మహిళా నోబెల్ గ్రహీతగా నిలిచారు. 1970ల నాటికి ఇంజనీరింగ్ డిగ్రీలు పొందుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. 1980ల నాటికి యూనివర్సిటీల్లో సుమారు 37శాతం మహిళలు కంప్యూటర్ సైన్సుని ప్రధానంగా ఎంచుకున్నారు. మన భారతదేశానికి చెందిన ప్రతిభావంతులయిన మహిళలు చాలా మంది సైన్సురంగంలో దేశపురోగతికి ఎంతగానో దోహదం చేశారు. బ్రిటీష్ కాలం నుంచి నేటివరకూ ఎంతోమంది భారత మహిళలు తమకున్న అడ్డంకులన్నీ దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య చదవటంతో పాటూ, మన దేశ పురోగతిలో సాయపడ్డారు. నేడు మన దేశం గర్వంగా చెప్పుకునే ఇస్రో సంస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం బాగా పెరిగింది. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక భాద్యతలు చేపట్టారు. డిఆర్‌డిఓ లో కూడా వీరి కృషి అమోఘం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టరుగా పనిచేసిన టెస్సి థామస్ ‘మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా”గా పేరు పొందారు. ఇలా ఎంతోమంది మహిళలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు.
విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితశాస్త్రం(STEM) రంగాల్లో లింగ భేదం లేకుండా పురుషులతో పాటూ మహిళలు, బాలికలు కూడా శాస్త్రీయ విద్య-వృత్తుల్లో సమాన అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా శాస్త్రవేత్తల విజయాలను, పరిశోధనలో సాంకేతిక పురోగతికి వారు చేసిన కృషిని గుర్తించి చాటి చెప్పటం కూడా దీని ముఖ్య ఉద్దేశమే. ఆయా రంగాల్లో విశేషంగా రాణించిన మహిళల విజయాలకి గుర్తింపు, గౌరవమివ్వటం ద్వారా మరెంతో మంది ఈ రంగాల వైపు వెళ్లడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునేలా, నాయకత్వం వహించేలా మహిళలని మరింతగా ప్రోత్సహించడం, యువతకు స్ఫూర్తిని అందిస్తూ, STEM రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించేలా చేయడం వంటివి కూడా ఈ దినోత్సవ లక్ష్యాల్లో ఉన్నాయి.
*రూపశ్రీ.