పుస్తకం ప్రియం ప్రియం!!

రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు మనం. అలాగే గొప్పవాళ్లను, దీనావస్థలో ఉన్న వారి జీవితాల్ని చూడలేకపోవచ్చు. కానీ ఆ అనుభవాన్ని కలిగించే అద్బుతాలు కొన్ని ఉన్నాయి. ఈమధ్య కాలంలో ట్రావెల్ vlogs అలాంటి అసంతృప్తిని కొంతవరకు తీరుస్తున్నా వారి విశ్లేషణ సమయానికి తగ్గట్టు చాలా క్లుప్తంగా ఉండటం వల్ల ఎక్కువ విషయలు తెలియకపోవచ్చు. ఇది కేవలం ఈ ట్రావెల్ గురించి మాత్రమే కాదు. ఎన్నో  విషయాలలో ఇదే వర్తిస్తుంది. అయితే ప్రతి వస్తువు నుండి, వ్యక్తి వరకు, పరిస్థితి నుండి ప్రకృతి వరకు జీవితాల నుండి సంఘటనల వరకు అన్నిటినీ ఎంతో వివరంగా ఆవిష్కరించేవి పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు కందుకూరి విరేశలింగం పంతులు గారు. పుస్తకం ఇచ్చే జ్ఞానం అలాంటిది అని అర్థం. ఏ గొప్ప వ్యక్తిని కదిలించినా అలలు అలలుగా పుస్తక జ్ఞానం ప్రవాహంలా బయటకు వస్తుంది. పుస్తకాలు చదివి చెడిపోయిన వాడు ఎవరూ లేరు అనేది వాస్తవం. బహుశా ఆలోచనా పరిణితి ఎక్కువై అంతర్ముఖులుగా మారిపోయి అందరి దృష్టిలో మానసిక రోగులుగా ముద్రపడిన వాళ్ళు ఉంటారేమో కానీ వాళ్ళను సరిగా అర్థం చేసుకుని ఉండరు అనేది నిజం. ఇక విషయానికి వస్తే పుస్తకాన్ని ఒక మంచి స్నేహితుడిగా చేసుకున్నవాళ్ళు ప్రపంచంలో చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకు పుస్తకం ఇంత గొప్పది అంటే…. జ్ఞానానికి కేంద్ర బిందువు!! బిందువు బిందువు కలసి సింధువు అయినట్టు పుస్తకంలో పేజీ పేజీ కలసి ఒక గొప్ప జ్ఞాన తరంగం అవుతుంది. పుస్తకాలు చదివేవాళ్ళు గొప్పవాళ్ళు, పుస్తకాలను రాసేవాళ్ళు అద్బుతాలు అని చెప్పుకోవచ్చు. ఒక పుస్తకం అందులో ఉన్న విషయ సారాంశాన్ని మనిషి మెదడులోకి పాదరసంలా ప్రవహించి మనిషిని చైతన్య వంతుడిని, ఉత్తేజవంతుడిని చేస్తుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనల నుండి మనిషి పెంపొందించుకునేదే జ్ఞానం. " జ్ఞానం అంటే పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలలో విషయాలను తెలుసుకుని, వాటిని తరచి చూసుకుని తమని తాము సరిచేసుకోవడం. ఓ కొత్త పుస్తకంలా మళ్లీ పుట్టడం"   మంచి అలవాటు!! నిజానికి పది మందితో వ్యర్థమైన విషయాలు మాట్లాడటం కంటే ఒక పుస్తకాన్ని ప్రశాంతంగా చదవడం మంచిదని అనిపిస్తుంది. చిన్నతనం నుండి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఎడిగేకొద్ది పిల్లలకు తాము ఎలాంటి దారిలో వెళ్ళాలి అనే విషయం పెద్దలు ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకు నీతి కథలు, పద్యాలు వంటివి చిన్నప్పటి నుండి పుస్తకాలలో చదివిస్తూ  ఉంటే గొప్ప వాక్పటిమ పెంపొందుతుంది.  నడవడిక న్యాయబద్ద జీవితం!! వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే వినసొంపైన మాటలు ఆభరణాల్లాంటివి అని అర్థం. అలా మాట్లాడే గుణం కూడా పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రాంతీయతను వివరించే పుస్తకాల ద్వారా ప్రజల జీవన స్థితి గతులు స్పష్టం అవుతుంటాయి.   ఒంటరితనానికి వీడ్కోలు!! పుస్తకం తోడు ఉంటే ఒంటరితనం అనే ఫీలింగ్ ఎప్పుడూ, ఎవరినీ వెంటాడదు. అందుకే ఎప్పుడూ ఓ మంచి పుస్తకాన్ని వెంట ఉంచుకుంటే అంతకు మించి పెద్ద ఊరట ఉండదు కూడా. పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు చక్కగా పుస్తకాలతో రిలాక్స్ అవ్వచ్చు. వ్యక్తుల అభిరుచులను బట్టి ఎన్నో వర్గాల పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి చేరే పుస్తకాలతో జతకట్టడమే అందరూ చెయ్యాల్సిన పని. కాబట్టి పుస్తకాలతో ప్రియం ప్రియంగా మాట్లాడండి. అవి మిమ్మల్ని మాట్లాడిస్తాయి మీరు ఎలా కావాలంటే అలా!!                               ◆వెంకటేష్ పువ్వాడ.  

హ్యాపీ హోమ్!! స్వీట్ హోమ్!!

ఇదేమి కొత్త సినిమాలో పాట కాదు. అంతకు మించి ఏదో ప్రత్యేక దినానికి సంబంధించి స్లోగన్ కూడా కాదు. మరింకేమిటి అంటున్నారా?? ప్రతి ఇంట్లో సాధారణంగా ఇద్దరు అంతకు మించిన మనుషులు ఉండటం కామన్. ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు లేవు కానీ ఒకప్పుడు అబ్బో దాదాపు ఒకే ఇంట్లో పది నుండి  ముప్పై మంది, ఇంకా ఎక్కువే ఉన్న కుటుంబాలు బోలెడు ఉండేవి. ఇదంతా ఎందుకు అంటే అదే విషయమే ఇప్పుడు చెప్పేసుకుందాం. ప్రస్తుతం కుటుంబ నియంత్రణలో భార్య, భర్త, ఒకరు లేద ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కుటుంబాలే ఎక్కడ చూసినా. అయితే ఉన్న నలుగురి మధ్యనో, లేదా ఐదుగురి మధ్యనో కూడా నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇవేమీ కత్తులు, కటార్లు పట్టుకుని చేయకపోయినా మనసుల మనసుల మధ్య జరిగే మాటల యుద్ధాలే. ఫలితంగా మాటా మాటా పెరిగి అవన్నీ తూటాల్లా మారి, ముచ్చటైన కుటుంబాలు బీటలు వారే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటివేమి జరగకుండా ఉండటానికి కొన్ని చిన్న జాగ్రత్తలు చాలు. కాసింత కాంప్రమైజ్    భార్యా భర్తలు అన్నాక సర్దుకుపోవడం కామన్. అయితే అమ్మాయిలకె దీన్ని ఎక్కువగా ఆపాదించేసి పెళ్ళవ్వగానే తన ఇష్టాలను తగ్గించుకుని భర్తకు తాగినట్టు ఉండటమే సమాజ ఆమోదమనే వేదంతాలు చెప్పేసి వాళ్ళను కంట్రోల్ లో పెడతారు చాలా మంది. అయితే ఇలాంటివి వాటి వల్ల జరిగేది ఏమిటంటే బయటకు సరేనని చెప్పినా మనస్ఫూర్తిగా మార్చుకోలేని ఇష్టాల వల్ల మానసికంగా కుంగిపోతారు అమ్మాయిలు. అలాంటి వాళ్ళు ఏదైనా కాస్త  ఎమోషనల్ సంఘటన జరగగానే ఒక్కసారిగా విస్ఫోటనం అయినట్టు తన బాధ తాలూకూ సంఘటనలు తాను చంపేసుకున్న ఇష్టాలు ఇలా అన్ని ఒక్కసారి గుర్తొచ్చి పెద్ద గొడవకు దారి తీస్తాయి. కాబట్టి అమ్మాయిలు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలనే నియామాన్ని పక్కన పెట్టి సందర్భానుసారంగా భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోవడం మంచిది. అలాగే పిల్లలు కూడా దీనికి అనుగుణంగానే నడుచుకుంటే కుటుంబంలో కలకలం ఏర్పడదు.  కాసింత అండర్స్టాండింగ్  చాలా మంది విషయాన్ని అర్థం చేసుకోవడం కంటే అర్థతరంగా అట్లాగే వదిలేసి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతారు. అయితే అసలు విషయంలో సమస్య ఏమిటి?? దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి. దాని వల్ల ప్రయోజనాలు, నష్టాలు ఇలాంటివన్నీ అందరూ కలసి మాట్లాడుకుంటే సమస్య తాలూకూ ప్రభావం ఎవరి మీద ఉండదు. తప్పుకోకుండా ఒప్పేసుకోండి ఏదైనా మీవైపు నుండి తప్పు జరిగితే దాన్ని నేరుగా ఇంట్లో వాళ్ళ ముందు ఒప్పేసుకుని, దాని వెనుక కారణాన్ని విడమరిచి చెప్పాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నాది కాదు అందరిదీ  ప్రతి ఒక్కరికి నాది అనే భావన ఉంటుంది. అయితే అన్ని విషయాల్లోనూ అదే పనికిరాదు. కొన్ని విషయాల్లో మన అనే భావన కుటుంబం మొత్తానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఇలాంటి బలమే అందరూ వాటిని అధిగమించేలా చేస్తుంది. మీకు మీకు మధ్య మీ ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఇంట్లో ఉంటున్న వాళ్ళు అంటే అందరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఎంతో మంచిది. అంతే కానీ ఇరుగు పొరుగులను న్యాయం చెప్పే పెద్దలుగా మార్చేసి, చుట్టాలకు, స్నేహితులకు ఇంటి గొడవ గురించి చెప్పి తప్పెవరిది వంటి విషయాలు అడగకూడదు.  ఫ్రెండ్లీ హోమ్ ట్రెండీ హోమ్  ప్రస్తుత తరాలకు తగ్గట్టు ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య పేరెంట్స్, చిల్డ్రన్స్ అనే బంధం కంటే ఫ్రెండ్స్ అనే బంధమే ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా ఉంటేనే పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోగలరు. అంతే కాదు పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండే కుటుంబంలో అర్థం చేసుకునే వాతావరణం మరియు ఒకరికోసం ఒకరం అనే భావన  ఎక్కువగా ఉంటుంది.  ఆల్ ఈజ్ వెల్  పైన చెప్పుకున్నవి అన్ని మీ మీ కుటుంబాల్లో ఉన్నాయో లేదో సరిచూసుకుని లేకపోతే కుటుంబంలో అందరూ కలసి మాట్లాడుకుని మెల్లగా వాటిని ఫాలో అయితే ఆల్ ఈజ్ వెల్ అని హ్యాపీ గా స్లోగన్ చెప్పుకోవచ్చు.                                                                                                                             ◆ వెంకటేష్ పువ్వాడ

జాగ్రత్త.. ఈ అలవాట్లు జీవితాన్ని  నాశనం చేస్తాయ్..!

  జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో సంతోషం, సామరస్యం, సానుకూలత ఉన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ కొన్ని అలవాట్లు జీవితాన్ని దెబ్బతీస్తాయి.  సంతోషంగా సాగాల్సిన జీవితాన్ని  నాశనం చేస్తాయి.  ఇంతకీ జీవితాన్ని నాశనం చేసే ఆ అలవాట్లు ఏమిటో.. అవి ఎందుకు జీవితాన్ని నాశనం చేస్తాయో తెలుసుకుంటే.. సెల్ఫ్ డబ్బా.. ఎవరూ ఇతరుల ముందు  తమను తాము తక్కువ చేసుకుని చెప్పుకోవాలని అనుకోరు. కానీ తమ గురించి తాము ఇతరుల ముందు అదే పనిగా పొగుడుకోవడం మంచి అలవాటు కాదు. తమను తాము పొడుగుకునేవారు, తమలో లోపాలను సమర్థించుకుని,  కవర్ చేసుకునేవారు ఎప్పటికీ తమలో లోపాలను తెలుసుకోలేరు. తమ తప్పులను తాము తెలుసుకోలేరు. దీని వల్ల వారు వ్యక్తిగతంగా వెనుకబడతారు.   కోపం.. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు.. కానీ కోపాన్ని ఎక్కువగా ప్రదర్మించేవారు , చిన్న విషయాలకు కోపం తెచ్చుకునేవారు  ఇతరులు చెప్పే మంచిని వినలేరు.. ఇతరులు చెప్పిన మంచి వెనుక దాగిన భవిష్యత్తును అర్థం చేసుకోలేరు. కోప స్వభావులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా చాలా నష్టపోతారు. సహాయ గుణం లేకపోవడం.. మనుషులు, జంతువులు మాత్రమే కాదు.. సకల ప్రాణి కోటి పట్ల భూత దయ ఉండాలని అంటారు.  నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం,  ఇబ్బందులలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల అందరితో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి.  కానీ ఎవరికీ ఎలాంటి సహాయం చేయకుండా ఉండటం వల్ల జీవితంలో తమకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవారు ఉండరు. ఇది జీవితాలను సంకటంలోకి నెట్టివేస్తుంది. హింస గుణం.. ఇతరులకు సహాయం చేయడానికి బదులుగా ఇతరులు బాధపడితే చూసి సంతోషించే శాడిస్ట్ గుణం ఉన్నవారు జీవితంలో చాలా కష్టాలపాలవుతారు. ఒక మనిషిలో ఉండే హింస గుణం ఆ మనిషి జీవితాన్ని ఎప్పటికైనా  వినాశనం వైపుకు తీసుకువెళుతుంది. బలం.. ప్రతి వ్యక్తిలో ఉండే బలం ఆ వ్యక్తికి మంచి చేసేది.. కొన్ని పరిస్థితులలో సహాయంగా ఉండేది కావచ్చు. కానీ ఇతరులు సహాయం కోసం వచ్చినప్పుడు,  ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు తమకున్న బలాన్ని ప్రయోగించి ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇది ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని దెబ్బతీస్తుంది. చెడు ప్రవర్తన.. ఇతరులతో, స్నేహితులతో చెడుగా ప్రవర్తించడం వల్ల  మంచి సలహాలు ఇచ్చేవారు, మంచి చెప్పే వారు దూరం అవుతారు. అందుకే ఎవరితోనూ చెడుగా ప్రవర్తించకుండా సంతోషంగా ఉంటే  వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే వినాశనమే. అత్యుత్సాహం జీవితంలో పనులు చక్కబెట్టాలంటే ఉత్సాహం మంచిదే.. కానీ అత్యుత్సాహం మాత్రం మంచిది కాదు.. దీని వల్ల జీవితం గందరగోళంలో పడిపోతుంది. కొన్ని సార్లు ఈ అత్యుత్సాహం వల్ల జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.                                      *రూపశ్రీ. 

ఆందోళనను గుర్తించాల్సిన సమయమిదే!

మనిషికి శారీరక రుగ్మతలు ఎన్ని ఉన్నా.. వాటిని ఔషధాలతో తగ్గించుకోవచ్చు. కానీ శరీరానికి నొప్పి లేకుండా మనిషిని వేధించే సమస్యలు మానసిక సమస్యలు. మానసిక సమస్యలలో ఆందోళన ఒకటి. ప్రతి నిమిషం మనిషిని భయానికి, సంఘర్షణకు లోను చేసి జీవితంలో అల్లకల్లోలం పుట్టించే ఈ ఆందోళన మనిషి పాలిట పెద్ద శాపమే అని చెప్పవచ్చు. కానీ దురదృష్ట వశాత్తు తాము అనుభవిస్తున్నది మానసిక సమస్య అని, దాని పేరు ఆందోళన అని చాలామందికి తెలియదు. తెలుసుకోకుండానే ఎంతోమంది జీవితంలో నలిగిపోతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు.  చాలామంది మానసిక సమస్య అంటే పిచ్చి అనే ఒకానొక భావనతో ఉంటారు. అందుకే తమకు మానసిక సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ ఈ సమస్యను గుర్తించడం చాలా అవసరం, దీనికి సరైన పరిష్కారాలు వెతకడం, దీని ప్రభావాన్ని తగ్గించడం, నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయడం ఎంతో అవసరం.  చరిత్రలోకి చూస్తే.. 19వ శతాబ్దం చివరలో ఆందోళన అనేది ఒక ప్రత్యేక అనారోగ్యంగా వర్గీకరించబడలేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వేర్వేరు పేర్లతో పిలిచారు. మానసిక రుగ్మతల గురించి సగటు మనిషికి అవగాహన లేని కాలంలో దీని దీని ప్రభావం ఇప్పుడున్న ప్రభావవంతంగా లేదు.  18వ శతాబ్దంలో, బోయిసియర్ డి సావేజెస్ పానిక్ అటాక్స్, సాధారణీకరించిన యాంగ్జయిటీ డిజార్డర్‌ని 'పనోఫోబియాస్'గా గుర్తించిన నోసోలజీని ప్రచురించారు. తర్వాత 19వ శతాబ్దంలో, అలసట, తలనొప్పి, చిరాకుతో కూడిన వైద్య పరిస్థితిని లక్షణాలుగా వర్ణించి 'న్యూరాస్తెనియా' అనే పదాన్ని రూపొందించారు. ఈ ఆందోళన లక్షణాలు కొత్త వ్యాధి నిర్మాణాలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.  ఇక భారతదేశంలో ప్రజలు ఆందోళన అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన రుగ్మతగా భావించారు. మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని సానుకూలంగా మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా అనేక ఆయుర్వేద మూలికలను ఉపయోగించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి బ్రాహ్మి, అశ్వగంధ. వైద్యశాస్త్రంలో పురోగతికి సాధించడానికి ముందు, పురాతన చికిత్సలలో వైద్యం అందించేవారు. వీటిలో  మూలికలు, ఔషధతైలం మధ్యయుగ కాలంలో సాగింది. హైడ్రోపతి విధానంలో చికిత్స అందించడం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇందులో  శరీరాన్ని విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా..  అత్యంత చల్లని ప్రవాహాలు, నదులలో స్నానం చేయడం, హెల్త్ స్పాలు, జలగలను ఉపయోగించి రక్తాన్ని తీయడం వంటివి ఉన్నాయి. అయితే మనోవిశ్లేషణలో క్రమంగా  ఫ్రాయిడ్ పరిశోధనల ఆధారంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు.  అన్నిటిలోకీ.. ఈమధ్య కాలంలోనే మానసిక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిమీద దృష్టి పెట్టడం, వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం సగటు వ్యక్తులలో కూడా కనబడుతోంది.  మానసిక సమస్యలు కూడా ఈమధ్య కాలంలో చాలా దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా కాలం మనుషుల్లో ఆందోళనను పెంచిందని చెప్పాలి. మానసిక సమస్యలున్నవారితో సామరస్యంగా మాట్లాడటం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా ఇప్పించడం, వారి ఆందోళనను పోగొట్టడానికి చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఆందోళన అనే సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది.                                       ◆నిశ్శబ్ద.

దీపావళి పండుగ అంతరార్థం!

  మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు. జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'. దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'. మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి. దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..  శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు  దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది.   'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది.  అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది.  "ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు. వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.                                   *నిశ్శబ్ద.

దీపమంత ఆశ!! 

తాను వెలుగుతూ చుట్టూ వెలుగును అందిస్తూ ఆశను పెంచి, ఆశావహ జీవితానికి ప్రేరణగా నిలిచేది దీపం. ప్రతి ఇంట్లో దీపం తప్పనిసరి. అది ఏ కులం అయినా హిందువులు దేవతా విగ్రహాలు పటాల ముందు, ఇస్లాం మతస్తులు దర్గాలలో, వారి ఇళ్లలో వారి దేవుడి ముందు, క్రిస్టియన్స్ వారి యేసు ప్రభువు దగ్గర కాండీల్స్ వెలిగించడం అన్ని చోట్లా కనబడుతుంది. దీపారాధన మనిషిలో కొన్ని కల్మషాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుందని చెప్పుకుంటారు. ఇక హిందూ మతంలో దీపావళి ముగిసి ప్రారంభమయ్యే కార్తీకమాసం మొదలు నుండి మాసం ముగింపు దాకా దీపాల సందడి కొనసాగుతూనే వుంటుంది. మనుషులందరూ సుమారు పట్టణాలకు తరలిపోయినపుడు, పల్లెలు పట్టణాల రంగులోకి మారుతున్నపుడు కొన్ని సాంప్రదాయాలు తగ్గిపోతున్నా దాన్ని కాపాడుకుంటున్నామంటూ పలుచోట్ల దీపాల మిణుకులు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇకపోతే మునుపు దీపాలు వెలిగించడంలోనూ ఇప్పుడూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల కాండీల్స్ పెదుతుంటారు. కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రయోజనం అంటే దేవుడి పుణ్యమో మరేదో కాదు.  దీపాలు వెలిగించడం వెనుక శాస్త్రీయత!! కార్తీకమాసం నవంబర్ డిసెంబర్ నెలల్లో సాగుతుంది. ఆ సమయంలో వర్షాలు సరేసరి, చలి మొదలవుతుంది. ప్రతి ఇంట్లో ముందు నూనె వేసి, వత్తితో, మట్టి ప్రమిధల్లో దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపం కాలుతున్నపుడు వచ్చే వాసనే క్రిమికీటకాలను ఇంట్లోకి వెళ్లకుండా చేస్తుంది. కానీ ఇప్పట్లో అంతా కృత్రిమంగా తయారైపోయారు. నూనె ముట్టుకుంటే చేతికి జిడ్డు అంటారు, వత్తులు చేయడం చాలమందికి రానే రాదు. మట్టి ప్రమిధలు కొనాలంటే నామోషీ!! పెద్దవాళ్లే ఇట్లా ఉంటే ఇక పిల్లలకు ఏమి వస్తాయి ఈ అలవాట్లు హిందుత్వాన్ని సంప్రదాయాలను కాపాడుకోవడానికి కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తే సమాజంలోని బీదరికం, వెనుకబడిన వాళ్ళ ఆకలి గుర్తొస్తాయి నాస్తికులకు, వైజ్ఞానిక వేత్తలకు. కానీ వేలంటైన్స్డే, న్యూ ఇయర్ లకు మాత్రం పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు గుర్తుకురారు. ఎందుకంటే వీళ్ళందరూ పాశ్చాత్య సంస్కృతిని దాని విశిష్టత. దాని గొప్పదనాన్ని ఎప్పుడూ మైక్ పట్టుకుని చెబుతుంటారు మరి!! ఇంకొక శాస్త్రీయ కారణం ఏమిటంటే కార్తీక మాసం మొదలైనపుడు పగటి కాలం తక్కువగానూ చీకటి కాలం ఎక్కువగానూ గడుస్తూ ఉంటుంది. ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల చీకటిని దీపాల వెలుగుతో తరిమినట్టే. దీపాలు ఉపయోగించే నూనె, పత్తి కాలడం వల్ల వచ్చే పొగ, వాసన ఎంతో గొప్ప పలితాన్ని చేకూర్చుతాయని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అలాంటి గొప్ప సంప్రదాయం, ఆరోగ్య విశిష్టత నిండి ఉన్న మన వారసత్వాన్ని చేతులారా నిర్లక్ష్యం చేస్తే మనం నష్టపోవడం మాత్రమే కాకుండా పరోక్షంగా నాటి బ్రిటిష్ బానిస బతుకులు మొదలవుతాయి. నాడు ప్రత్యక్షంగా అయితే నేడు వ్యాపారమనే వలయంలో వాళ్ళ గుప్పట్లో భారతాన్ని బంధించే ప్రయత్నాలు ఎన్నో!! అందుకే మన సంప్రదాయంలో ఉన్న అన్నిటినీ పిల్లలకు వివరిస్తూ, మనమూ పాటిస్తూ ఉంటే చిన్ని చిన్ని చేతులు వెలిగించే దీపాలు రేపటి కొండంత జీవితానికి ఆశావహ దృక్పథాన్ని ఎంతో ఉన్నతంగా మారుస్తాయి. ఆలోచనా విధానాన్ని విస్తృతం చేస్తాయి. చిన్ని చిన్ని ఆశ, ఈ దీపమంత ఆశ అని పాడుకుంటూ దీపాల సందడిలో మునిగిపోండి. ◆వెంకటేష్ పువ్వాడ  

దీపావళి పండుగ రోజు ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకూడదు..!

  దీపావళి అంటే వెలుగుల పండుగ. దీన్ని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దేశాలలో ఎంతో సంబరంగా జరుపురుకుంటారు.  దీపావళి పండుగ అంటే చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తు.  భారతదేశంలో చాలామంది ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడమే కాకుండా పండుగ రోజు తమ ఆత్మీయులకు, సన్నిహితులకు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు.  అయితే కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. అవేంటంటే.. దుస్తులు.. నచ్చిన వారికి, స్నేహితులకు, ఆత్మీయులకు దుస్తులను బహుమతిగా ఇవ్వడం చాలామంది చేస్తారు. అయితే నలుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వడం,  వాటిని బహుమతిగా స్వీకరించడం కూడా మంచిది కాదు.  ఇది అరిష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. బంగారు, వెండి.. దీపావళి పండుగ రోజున బంగారం, వెండి నాణేలను కొలుగోలు చేయడం చాలామంది చేసే పని. ఆ రోజు లక్ష్మి పూజ కూడా చేసుకుంటారు. అయితే దీపావళి సందర్భంగా బంగారం, వెండి కొనే వారు వారు మాత్రమే కొనుగోలు చేయవచ్చట.  బంగారం, వెండిని ఇతరులకు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదట. పదునైన వస్తువులు.. పదునైన పస్తువులు రోజువారీ చాలా ఉపయోగిస్తుంటారు.  వంటగదిలోనూ, ఇంటి ఉపయోగం కోసం ఉపయోగించేవే అయినా దీపావళి రోజు అలాంటి వస్తువులను అస్సలు బహుమతిగా ఇవ్వడం,  వాటిని బహుమతిగా అందుకోవడం అస్సలు మంచిది కాదట. పాద రక్షలు.. దీపావళి కానుకగా చెప్పులు, బూట్లు వంటివి బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదని అంటున్నారు. గడియారం.. కాలమానాన్ని సూచించే గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట.  ఆప్తులకు,  తెలిసిన వారికి చాలామంది ఇచ్చే బహుమతులలో చేతి గడియారం,  గోడ గడియారం వంటివి ఉంటాయి.  వీటిని అస్సలు బహుమతిగా ఇవ్వకూడదని అంటున్నారు.  ఇలా గడియారాన్ని ఇతరులకు బహుమతిగా ఇస్తే మన మంచి కాలం ముగిసిపోయినట్టే అని కూడా అంటున్నారు.                                                     *రూపశ్రీ.

మాట్లాడకుండానే ఇతరులకు మీ తెలివి తేటలు నిరూపించాలంటే.. ఇలా చేయండి..!

  ట్యాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఇది ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉపయోగించే వాక్యం.  ట్యాలెంట్ చాలామందికి ఉంటుంది.  కానీ దీన్ని గుర్తించుకుని సరైన విధంగా సద్వినియోగం చేసుకునేవారు తక్కువేనని చెప్పాలి.  నాకేం వచ్చు అనుకునే వారు ఎక్కువ. నీకేం తెలుసు నువ్వు ఊరుకో అని కుటుంబం నుండి స్నేహితులు, కొలీగ్స్ వరకు చాలామంది అంటుంటారు. ఈ కారణంగా కాస్తో కూస్తూ తెలివి తేటలు ఉన్నా అవి బయట పడవు. అయితే  ట్యాలెంట్ ఉన్నా సరే.. కొందరు రాణించలేరు.. ముఖ్యంగా నాకు ట్యాలెంట్ ఉంది కానీ నేను వెనుకబడ్డాను అని వాపోయేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మాట్లాడకుండా తెలివి తేటలు నిరూపించడం పెద్ద టాస్క్. కానీ కింది విషయాలు తెలుసుకుంటే మాట్లాడకుండా ప్రతిభను నిరూపించుకోవడం కష్టం కాదు అనిపిస్తుంది. స్మార్ట్ వర్క్.. కష్టపడి పని చేయడం అనేది ఒక మనిషిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది. అయితే నేటి కాలంలో కష్టపడటం అనే మాట కంటే ఎంత తెలివిగా వర్క్ చేస్తాం అనేదే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. అందుకే స్మార్ట్ వర్క్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. అలాగని స్మార్ట్ వర్క్ అనేది ఎంపిక చేసుకునే ఒక మార్గం కాదు.. కానీ అది కొన్ని సందర్భాలలో అవసరం.  అవసరమైనప్పుడు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల తెలివి తేటలను ప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ మాట్లాడే వారు అంతే తెలివిగా పని చేయలేకపోవచ్చు. కానీ తక్కువ మాట్లాడే వారు  చేసే పని చాలా సైలెంట్ గా ఉన్న ప్రదేశంలో విస్పోటనం చెందినట్టే ఉంటుంది.  ఇది చాలామందిని ఆశ్చర్యానికి,  విస్మయానికి గురిచేస్తుంది. ఇలా చేయాలంటే కొన్ని పనులు చేయాలియ.. లక్ష్యాలు.. ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి.  ఏదో ఒక విధంగా అలా పని చేస్తూ పోవడం అనే కాన్సెప్ట్ వదిలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి.  దీని వల్ల  చేయవలసిన పనుల మీద అవగాహన,  స్పష్టత పెరుగుతుంది.  అలాగే పనులను ఒకే టాస్క్ లో కాకుండా చిన్న చిన్న టార్గెట్లలో విభజించుకొని వాటిని పూర్తీ చేయాలి.   టాస్క్.. ఒకేసారి రెండు పనులను డీల్ చేయడం వల్ల మానసికంగా అలసిపోతారు.  రెండు పనుల మీద పూర్తీ స్థాయి ఫోకస్ పెట్టలేరు.  ఒక వేళ పెట్టినా అది మీ ప్రతిభకు,  సామర్థ్యానికంటే తక్కువగానే ఉంటుంది. అందుకే స్మార్ట్ వర్క్ చేసే వారు ఒకసారి ఒక పని మీదనే దృష్టి పెడతారు. దాన్ని వీలైనంత తొందరగా,  పూర్తీ స్థాయిలో  పూర్తీ చేయగలరు. ఇది ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామంచి మార్గం. ప్లానింగ్.. రేపు ఏం చేయాలి అనే విషయాన్ని ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం ఉదయం లేచిన తరువాత అయినా ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి. దీని  వల్ల చాలా వరకు పనులను సరైన సమయానికి పూర్తీ చేయగలుగుతారు. దీని వల్ల సమయం సేవ్ అవుతుంది.  మానసికంగా ఒత్తిడి ఉండదు. సమయం.. ప్లానింగ్ చేసుకున్నంత మాత్రాన టాస్క్ లు సులభంగా పూర్తీ కావు.  దీనికి సమయాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సమయాన్ని సరైన విధంగా మెయింటైన్ చేసుకునే వారు ఫెయిల్ కావడం అంటూ ఉండదు. పనులతో వ్యవహరించడం.. కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. మరికొన్ని సాధారణ పనులు ఉంటాయి.  ముఖ్యమైన పనులు పూర్తీ కావడంలో సాధారణ పనులు అడ్డంకి గా ఉంటాయి. ఇలాంటి సాధారణ పనులు,  అంతగా ప్రాముఖ్యత లేని పనులను ఇతరులకు అప్పగించడం వల్ల పూర్తీ స్థాయి ఏకాగ్రతను పని మీద ఉంచవచ్చు. ఇది పనిలో వందశాతం ఫలితం రాబట్టడంలో సహాయపడుతుంది. నేర్చుకోవాలి.. నాకు అంతా తెలుసు అనే అహం మనిషిని అట్టడుగుకు తొక్కేస్తుంది.  పని చేస్తున్నప్పుడ ఏవైనా పొరపాట్లున్నా, ఇతరులు మీ పొరపాటును చెప్పినా నాకు తెలియదా ఏంటి అని వారిని నిందించవద్దు.. నాకే చెప్తావా అని కోప్పడవద్దు. వారు చెప్పిన విషయాన్ని ఆలోచించి అందులో నిజం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. దీని వల్ల ఆయా విషయాలను మరింత సమర్థవంతంగా నేర్చుకునే వెలుసుబాటు కలుగుతుంది. విరామం.. స్మార్ట్ వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద పోకస్ ఎక్కువ ఉండటానికి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. ఇది తిరిగి పని మొదలు పెట్టినప్పుడు ఏకాగ్రతగా పని చేయడంలో సహాయపడుతుంది.                                          *రూపశ్రీ.

సంపాదనా స్వరం ఏమి చెబుతోంది??

జీవితంలో రూపాయి కూడా ఎంతో విలువైనదే.ఆ రూపాయి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చేతులు, జేబులు ఖాళీగా ఉన్నపుడు. కానీ ఇప్పటి తరానికి ఆ రూపాయి విలువ పెద్దగా తెలియదు. ఏ కొందరికో తప్ప రూపాయి విశ్వరూపం కూడా తెలీదు. విశ్వరూపం అంటే పుట్టుక పూర్వోత్తరాలు కాదు. కొందరి దృష్టిలో రూపాయి అంటే పెద్దగా లెక్కలేనిది. కారణం ఏమిటని చూస్తే ఇప్పటి కాలంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు వచ్చి పడ్డాయి.  ఆ మార్గాల ద్వారా డబ్బు సంపాదన ఎంతో సులభం. కొన్ని దారులు సులభ పద్దతిలో నిజాయితీగా  ఉన్నా ఎక్కువ భాగం వక్రమార్గంలో సంపాదిస్తుండటమే నేటి యువత పెడదారిలో వెళ్ళడానికి కూడా కారణం. ఈజీ మని లేజీ యూత్ ఎందుకు కష్టపడాలి సులువైన మార్గాలు ఉండగా. హాయిగా మొబైల్ చేతిలో ఉంటేనో, లాప్టాప్ లేదా సిస్టం దగ్గర ఉంటేనో కాలు కదపకుండా, కండ కరగకుండా హాయిగా సంపాదించేయచ్చు. అది తప్పు దారి అని ఎవరైనా అంటే ప్రపంచంలో ఎన్నో తప్పులు జరుగుతుంటే మేము చేసేది తప్పు ఎలా అవుతుందనే సమర్థింపు కూడా చాలామందిలో కనబడుతుంది.  చూడటానికి జులయిగానూ, పని పాట లేక ఉండేవాళ్ళు చాలామంది ఇలాంటి ఈసీ మనికి జై కొడుతూ ఉంటారు. అయితే వీళ్ళలో సగం వరకు యువత సరైన ఉద్యోగ అవకాశాలు లేవనే ఆలోచనతో కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. పలితంగా ఒక సరైన దిశ లేక సాగుతుంది వీరి జీవితం. ఇలా ఈసీ మనీ సంపాదన తాత్కాలిక పరిష్కారమే తప్ప జీవితంలో సంపాదన అనే విషయంలో ఒక దీర్ఘకాలిక మార్గాన్ని చూపించదు అది. కానీ యువతకు ఇది అర్థం కాదు. తప్పేం కాదనే వాధన ఒకవైపు అయితే, ప్రస్తుతం హాయిగా గడిచిపోతోందనే మూర్ఖపు ఆలోచన మరొకవైపు. ఫ్యూచర్ గురించి ఒకప్పటి తరం ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచించడం లేదనేది ఒప్పుకోవలసిన వాస్తవం. ఫలితంగా కలుగుతున్నదే భారతదేశంలో నిరుద్యోగ వ్యవస్థ. చాలా చోట్ల ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ ఇంకా పలువిధాలైన కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్లో సమర్థింపే ఎక్కువ.  కష్టపడి తత్వం గురించి అర్థం చేసుకుంటే దాని ద్వారా వచ్చే సంపాదన రుచి తెలిస్తే భారతదేశంలో యువత ఎంతో మెరుగవుతుంది. లాటరీలు, క్రికెట్ బెట్టింగ్ లు, అకౌంట్స్ హాక్ చేసి అకౌంట్స్ లో డబ్బులు కాజేయడం, స్మగ్లింగ్ వంటి పనులలో పాల్గొనడం. దొంగతనాలు, బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజడాలు. ఇలాంటివన్నీ చేస్తున్నది యువతే అంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే భారతదేశ యువత ఏ పరిస్థితిలోకి దిగజారిపోతోందో అని విచారం కలుగుతుంది.  పైగా ఇలాంటి పనులన్నీ చేయడం అవి బయటపడతాయేమో అని నేరాలు చేయడం, బెదిరించడం వంటివి  ఇంకా ఉబిలోకి నెడుతూ జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నాం, అందులో నిజాయితీ ఎంత అనే విషయాలపైన ఆ వ్యక్తి జీవితం ఎంత బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది.  దీనిగురించి జాగ్రత్తలు తీసుకోవలసింది ఖచ్చితంగా పెద్దలే. ఎందుకంటే పిల్లల అవసరాలు ఏమిటి?? వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్లకు డబ్బు ఎక్కడినుండి వస్తోంది, వాళ్లెం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతేతప్ప పిల్లలు అవసరాల కోసం డబ్బు అడగడం లేదు మిగిలిపోతోందిలే అనుకుంటే వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయి ఏమి మిగలకుండా తయారవుతారు. అందుకే సంపాదించే ప్రతి రూపాయి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అది కష్టం విలువో, అవినీతి తాలూకూ గుణపాఠమో, చివరి పలితమో.  అనుభవించాల్సింది దాన్ని సంపాదించే వాళ్లే కాబట్టి ఆ సంపాదనా స్వరాన్ని కాస్త వింటూ ఉండండి. ◆ వెంకటేష్ పువ్వాడ

ఎలా బతకాలని అనుకుంటున్నారు!

  పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే! దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే! ‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది. రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు. రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది. ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు. రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు. స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా!  

వేడి టీ వల్ల క్యాన్సర్!

        చికాగుగా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగితే హాయిగా వుంటుంది అనుకునే వాళ్ళకి " జాగ్రత్త ఎక్కువ వేడి మంచిది కాదు" అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే మరీ పొగలు కక్కే టీ తాగే అలవాటు ఉన్నవారికి ఆహార నాళా క్యాన్సర్ వచ్చే అవకాశం వుందిట. చాలా వేడిగా అంటే 70 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉషోగ్రత గల టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ ప్రమాదం పొంచి వుందట. ఇరాన్ అధ్యయన బృందం తమ అధ్యాయనంలో భాగంగా ఆహారనాళా క్యాన్సర్ బారినపడిన వారితో పాటు ఆరోగ్యవంతులైన వారి టీ తాగే అలవాట్లనూ పరిశీలించారు. గోరు వెచ్చగా ఉండే టీ తాగే వారితో పోలిస్తే వేడి టీ తాగే వారిలో ఆహార నాళా క్యాన్సర్ ముప్పు రెండింతలు పెరుగుతున్నట్టు తేలిందిట. కాబట్టి మరి పొగలు కక్కే టీ కాకుండా కాస్త వేడిగా వుండే టీ తాగడం అలవాటుగా చేసుకోండి. ....రమ

లైఫ్ స్టైల్ ను ఇబ్బందిపెట్టే షుగర్ ను గుర్తించండి ఇలా!

  ఒకప్పటి కాలంలో శారీరకకష్టం ఎక్కువగా ఉండేది. అందుకే తీసుకునే ఆహారం ఎలాంటిది అయినా, ఆ ఆహారం ద్వారా శరీరానికి అందే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఏమాత్రం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శరీరంలో శక్తిని రిలీజ్ చేస్తూ కరిగిపోయేవి. అయితే శారీరక కష్టం తగ్గిపోయి కేవలం మానసికంగా మనుషులు ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో తినే ప్రతి ఆహారం చూసుకొని తినాల్సి వస్తోంది.  మనం సాధారణంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు  కలిగిన ఆహారం తిన్నప్పుడు అవి శరీరంలో చెక్కెరలుగా మారతాయి. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఆ చెక్కెరలను క్రమబద్దం చేస్తుంది. అదే శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే శరీరంలో చెక్కరలు మెల్లిగా పెరుగుతూ పోతాయి. అదే షుగర్ సమస్యకు దారితీస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువ ఉండటం చాలా ప్రమాదకరం. షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?? షుగర్ లెవల్స్ ఎక్కువ ఉండటం మొదట్లో పెద్దగా సమస్యగా ఉండకపోవచ్చు కానీ అది దీర్ఘకాలం కొనసాగితే  శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. అవి క్రమంగా తమ పనితీరును మందగింపజేస్తాయి. మెదడు పనితీరు తగ్గిపోతుంది. శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థ తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న చిన్న సమస్యలకే అనారోగ్యానికి గురవడం, వాటి నుండి కోలుకోలేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు షుగర్ స్థాయిలు చాలా ఎక్కువైపోయినప్పుడు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ షుగర్ స్థాయిలను సులభంగా గుర్తించే కొన్ని మార్గాలు అందరికోసం.  ◆ షుగర్ స్థాయిలు అధికంగా ఉన్న వాళ్లలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి. మెట్లు ఎక్కగానే అలసిపోవడం, తక్కువ దూరం నడవగానే చెమటలు పట్టడం, పని ఎక్కువగా చేయలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ◆ చాలామందిలో చిరాకు కనిపించినప్పుడు మనుషుల్ని అపార్థాలు చేసుకుంటారు. అయితే చిరాకు అనేది మానసిక మరియు శారీరక అనారోగ్య సమస్య.  చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు కలిగే మార్పుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగి చిరాకుకు దారితీస్తుంది. ◆ అతిగా దాహం వేయడం షుగర్ స్థాయిలు ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించే మరొక లక్షణం. ఈ అతిదాహం వల్ల నీరు ఎక్కువగా టాగుతూ ఉంటారు. ◆ ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లడం షుగర్ సమస్యకు సూచన. అతిగా దాహం వేయడం వల్ల మూత్రవిసర్జనకు వెళ్లడం కూడా అధికం అవుతుంది.  ◆ చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చూపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణం కంటే షుగర్ స్థాయిలు ఎక్కువున్నపుడు దృష్టి మందగిస్తుంది. ◆ ఆహారం విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోకపోయినా బరువు విషయంలో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ◆ జననేంద్రియం చుట్టూ విపరీతమైన దురద ఉంటుంది.  ◆ ఆయాసంగా అనిపించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ◆ అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ లకు తొందరగా గురవుతుంది.  పలితంగాఏమైనా సమస్యలు వస్తే తొందరగా తగ్గవు. ఈవిధంగా సాధారణ లైఫ్ స్టైల్ లో మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే చక్కెర స్థాయిలు మెల్లిగా పేరుకుపోయి అది జబ్బుగా మారి బోలెడు సమస్యలను సృష్టిస్తుంది.                                ◆ వెంకటేష్ పువ్వాడ.

హెపటైటిస్ పై అవగాహన చాలా అవసరం!

మానవజీవితాన్ని ప్రస్తుతకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం అనారోగ్యం. ఎన్నో సమస్యలు మనిషిని ఒకపట్టాన ఊపిరితీసుకొనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటిలో కాలేయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయానికి వచ్చే సమస్యలలో చివరి వరకు బయటపడకుండా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సమస్య హెపటైటిస్. ప్రపంచ హెపటైటిస్ అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన జరుపుతారు. దాని సందర్భంగా ఈ హెపటైటిస్ గురించి వివరంగా అందరి కోసం. అసలు హెపటైటిస్ అంటే ఏంటి? కాలేయం వాపుకు గురయ్యి దాని పరిమాణం పెరిగిపోవడమే హెపటైటిస్ గా వైద్య శాస్త్రంలో చెబుతారు. మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక మందులు వాడటం వల్ల కాలేయానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అన్నిటికంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్ సమస్యకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్య. హెపటైటిస్ సమస్యలో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా ఒకటి. ఈ సమస్య కాలేయ కణజాల నిర్మాణానికి ప్రతిరోధకాలను తయారుచేసేటప్పుడు ఎదురయ్యే సమస్య. హెపటైటిస్ సమస్యను దాని ప్రభావాన్ని, లక్షణాలను అనుసరించి  ఆరోగ్య నిపుణులు అయిదు వర్గాలుగా విభజించారు. వాటిలో హెపటైటిస్ A, B, C, D మరియు E అని ఉన్నాయి. వీటిలో ఒక్కో హెపటైటిస్ సమస్యకు ఒకో వైరస్ కారణమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 354 మిలియన్ల ప్రజలు హెపటైటిస్ B, మరియు హెపటైటిస్ C తో బాధపడుతున్నారు. ఇది చాలా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది. ◆ హెపటైటిస్ A అనేది హెపటైటిస్ A అనే వైరస్ వల్ల వస్తుంది. ఇధి తీవ్రమైన సమస్య అయినా చాలా తక్కువకాలం మాత్రమే ఉంటుంది. ◆ హెపటైటిస్ B అనే వైరస్ కారణంగా హెపటైటిస్ B సమస్య వస్తుంది. ఇది చాలా దీర్ఘకాలిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ ప్రజలు దీనివల్ల బాధపడుతున్నారు. ◆ హెపటైటిస్ C అనే వైరస్ వల్ల హెపటైటిస్ సమస్య వస్తుంది. ఇది సాధారణంగా రక్తసంబంధ సమస్యలలో ఒకటి. అయితే దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. ◆ హెపటైటిస్ D అనేది హెపటైటిస్ B సమస్యతో కలసి వచ్చే సమస్య. ఇది కాలేయ మంటను ఎక్కువగా కలిగిస్తుంది. ◆ హెపటైటిస్ E అనేది హెపటైటిస్ E వైరస్ వల్ల వస్తుంది. ఇది పారిశుద్ధ్యం సరైన విధంగా లేకపోవడం వల్ల అంటే కాలుష్య ప్రాంతాలలో నివసించేవారిలో కనిపిస్తుంది. ఇది సాధారణమైన సమస్యగా అనిపించినా గర్భిణీలలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెపటైటిస్ లక్షణాలు! హెపటైటిస్ B మరియు C ఉన్నవాళ్ళలో లక్షణాలు బయటకు కనిపించవు. మిగిలినవి వెంటనే లక్షణాలను కలిగి ఉంటాయి. అలసట, జ్వరం, జలుబు, మూత్రం రంగు మారటం, మలం పలుచగా ఉండటం అంటే విరేచనాలు అవుతున్నట్టు. ఆకలి లేకపోవడం, పొత్తికడుపు నొప్పి, చెప్పలేనంతగా బరువు తగ్గిపోవడం, చర్మం రంగు మారడం (కొందరు ఈ లక్షణం చూసి పచ్చకామెర్లు అనుకుంటారు). హెపటైటిస్ నిర్ధారణ చేయడానికి వైద్యులు చాలా రకాల పరీక్షలు చేస్తారు. శారీరక పరీక్ష రక్త పరీక్షలు కాలేయ సమస్య పరీక్షలు బయప్సి  అల్ట్రా సౌండ్ పరీక్ష  పైన చెప్పుకున్న పరీక్షల ద్వారా హెపటైటిస్ సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు. హెపటైటిస్ కు దూరంగా ఉండటం ఇలా! హెపటైటిస్ A కు దూరంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. వ్యాప్తిని తగ్గించుకోవడం మరొక ముఖ్యమైన జాగ్రత్త. తీసుకునే ద్రవపదార్థాలు, నీరు ఇతర ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాన్ని రానివ్వకూడదు. హెపటైటిస్ A మరియు E సంక్రమించకుండా ఉండటానికి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ నీరు, ఆహారం, చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. హెపటైటిస్ B,C,E వైరస్ లు వీటి ద్వారా ఇన్ఫెక్షన్ సృష్టిస్తాయి. పైన చెప్పుకున్నట్టు హెపటైటిస్ అనేది బయటకు తెలియకుండా ప్రమాదంగా మారే సమస్య. దాని నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

ఎమోషన్స్ ని ఎడిట్ చేసుకుంటే మంచిది

మనుషులమండి మానులం కాదు. అసలు తొణకకుండా ఎలాంటి భావాలు బయట పెట్టకుండా ఉండలేం. మనుషుల్లో కలిగే సహాజ స్పందనలు, ప్రతిస్పందనలను ఎమోషన్స్ అని పిలుచుకుంటాం. అయితే నేటి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో ఈ ఎమోషన్స్ కూడా ఒక భాగంగా చేరిపోయాయి.  నవ్వొస్తుంది నవ్వేలేం, ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని ఏడుపోస్తుంది ఏడవలేం, ఎందుకంటే సమాజం ఏడ్చేవాళ్లను ఇంకా ఏడిపిస్తుందని కోపం, బాధ, ఆవేశం, ఈర్ష్య, అసూయ, పొంగుకొచ్చే దుఃఖం ఇవన్నీ ఎమోషన్స్ లో భాగమే. అయితే మనుషులు కోపాన్ని, బాధను, ఆవేశాన్ని చాలా తొందరగా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. దీనివల్ల చాలా తొందరగా నష్టం జరిగిపోతుంది. ముఖ్యంగా మానవసంబంధాలు చాలా దెబ్బతింటాయి. క్షణాలు నిమిషాల్లో జరిగిపోయే ఆ బీభత్సం వల్ల కొన్ని బంధాలు తెగిపోవచ్చు, మరికొన్ని బుజ్జగింపులు ద్వారా తిరిగి పెనవేసుకున్నా ముందున్నంత ఆప్యాయత ఉండకపోవచ్చు. అసలు ఎంత తొందరగా కలుస్తున్నాయో అంతే తొందరగా తెగిపోతున్నాయి ఈమధ్య కాలంలో బంధాలు. కారణాలు బోలెడు. అభిప్రాయాలు కలవకపోవడం, తమకు కాకుండా మరొకరికి ప్రాధాన్యత ఇవ్వడం, తాము ఎంతో ఆశ పడిన సందర్భం విషయంలో సరైన స్పందన రాకపోవడం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు వాటి తాలూకూ మనిషి స్పందనలు, ప్రతిస్పందనలు మాత్రం ఎమోషన్స్ గా మారిపోయి మనిషిలో ఉన్న ప్రశాంతతను అగ్గిపుల్లతో కాల్చినట్టు ఉండదూ.  ఎందుకీ ఎమోషన్స్ ప్రతి ఎమోషన్ ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి దేనిమీద అయినా ఎక్ప్పెక్టేషన్స్ పెట్టుకున్నపుడు. తరువాత కారణం ఆశించినపుడు. ఆ తరువాత కారణం తాను ప్రత్యేకం అనే భావం మనసులో పెట్టుకుని అదే విధంగా అందరూ చూడాలని అనుకోవడం. మనుషుల ప్రశాంతతను చంపే పెద్ద కారణాలు ఇవే. చాలామంది విషయంలో ఇవి ప్రాథమికంగా ఉంటాయి. ఇవి కాకుండా చాలా సహజమైన విషయాలు కూడా ఉంటాయి. చేయాల్సిన పనులు వేళకు చేయలేకపోవడం, కలవాల్సిన వాళ్ళు కలవకుండా వెళ్లిపోవడం, తమకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళు ఏదో చేసారని, తమకు తగినంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని. ఇట్లా అన్నిటినీ బుర్ర మీద రుద్దుకోవడం వల్ల ఎమోషన్స్ కాక మరింకేం వస్తాయి. ఎమోషన్ ఈజ్ ఎనిమి నమ్మండి నమ్మకపొండి ఈ ఎమోషన్ అనేది మనిషి జీవితానికి పెద్ద బద్ధ శత్రువు. మనిషిని మెల్లిగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లే భూతం ఇదే. మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసి, జీవితం మీద చాలా ఘోరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంతగా అంటే జీవితం మొత్తం తలకిందులు అయ్యేలా. ఆ తరువాత జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడం ఎంతో కష్టతరమైన పని.  ఎలా అధిగమించాలి?? భూతం అనుకుంటే భూతం, కాదు అదేదో పొగ అని అనుకుని నోటితో ఊదేస్తే మటుమాయం. ఇదంతా కూడా మనిషి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో గొప్ప పరిపక్వత కలిగిన వాళ్ళు కూడా ఒకోసారి కొన్ని విషయాల పట్ల బలహీనులుగా ఉంటారు. బలహీనతను బలంగా మార్చుకున్నపుడే మనిషి నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు శక్తివంతంగా తయారు అవుతాడు. ఈ ఎమోషన్స్ ను అధిగమించాలంటే మొదట చేయవలసింది ఇతర విషయాలకు అతిగా స్పందించకూడదు. కేవలం కాస్తాడటం, ఏదైనా వందశాతం పూర్తి శ్రద్ధ పెట్టి చేయడం ఇవి మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అన్ని మనసుకు తీసుకోవడం ఆపేయాలి. ఇక స్నేహితులు,  కొలీగ్స్, ఇతరులు వీళ్ళందరూ కేవలం తెలిసిన వాళ్ళు మాత్రమే. వీళ్ళలో స్నేహితులతో బాండింగ్ ఎక్కువగానే ఉంటుంది కానీ వల్ల నుండి కూడా ఆశించడం అనేది మానుకోవాలి. దీనివల్ల స్నేహితులు అవాయిడ్ చేస్తున్నారనో, ఇతరులు తక్కువ చేస్తున్నారనో ఫీలవ్వాల్సిన  సందర్భం రాదు.  కేవలం తమ పని తాము చేసుకుంటూ పోవడమే పెద్ద పరిష్కారం. ఇతరుల  విషయాలు ఏవీ మనసుకు తీసుకోకుండా ఉంటే ఎమోషన్స్ ను దూరంగా పెట్టేయచ్చు. ఒక్కమాట మాత్రం నిజం. ఎమోషన్స్ ను పెంచుకోకండి. టాబ్లెట్స్ వేసుకోగానే మోషన్స్ తగ్గిపోయినంత సులువు కాదు వాటి తాలూకూ డిప్రెస్ భూతాన్ని తగ్గించడం. ◆ వెంకటేష్ పువ్వాడ

వాల్మికి జీవితాన్ని మార్చేసిన రెండు ప్రశ్నలు ఇవే..!

  భారతీయ ధర్మంలో ఎందరో మహర్షులు, మరెందరో ఋషులు ఉన్నారు.  వారిలో వాల్మికి మహర్షి చాలా ప్రత్యేకమైన వారు.  రామాయణాన్ని రచించిన వాల్మికి మహర్షి ఎంత గొప్పవాడో.. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అంతే ఆశ్చర్యం వేస్తుంది. ఒక దొంగ ఒక మహర్షిగా ఎలా మారాడు అనే విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా రెండు ప్రశ్నలు వాల్మికిని మహర్షిగా మారడానికి నాందిగా మారాయని చెబుతారు.  అవేంటో తెలుసుకుంటే.. మహర్షి వాల్మికి అసలు పేరు రత్నాకర్.  ఈయనను చిన్నతనంలోనే ఒక వ్యక్తి ఎత్తుకుపోయాడు.  అతను దొంగతనాలు, దోపిడి చేసే వాడు కావడంతో రత్నాకర్ చిన్నతనం వాటి మధ్యనే గడిచింది.  రత్నాకర్ పెరిగి పెద్దవాడు అయ్యాక వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.  కుటుంబ పోషణార్థం  అతను కష్టపడకుండా ధనం సంపాదించడం కోసం దొంగతనాలు, దోపిడిలు చేసేవాడు. ఒకరోజు దోపిడి కోసం దారి పక్కన కాపు కాసిన రత్నాకర్ కు నారద మహర్షి ఆ దారిలో వెళుతూ కనిపించాడు.  నారద మహర్షి ఎవరో తెలియని రత్నాకర్ నారదుడి దగ్గర విలువైన వస్తువులున్నాయే అని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే నారదుడు రత్నాకర్ ను రెండు ప్రశ్నలు అడిగాడు.   ఎందుకు దోపిడి చేస్తున్నావు అని అడిగాడు.. కుటుంబ పోషణార్థం దోపిడి చేస్తున్నానని రత్నాకర్ సమాధానం ఇచ్చాడు. ఇలా దోపిడి చేస్తే పాపం వస్తుంది.  కుటుంబ పోషణార్థం ఈ పాపపు పనులు చేస్తున్నావు కదా.. దీని వల్ల నీకు వచ్చే పాపంలో నీ కుటుంబ సభ్యులు కూడా భాగం తీసుకుంటారా అని అడిగాడు. రత్నాకర్ ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులతో దోపిడి కారణంగా తనకు చేకూరే పాపంలో కుటుంబ సభ్యులు కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు. కుటుంబ సభ్యులు ఆ పాపాన్ని భాగం పంచుకోమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో రత్నాకర్ కు తను చేస్తున్న పనుల మీద విరక్తి పుట్టింది. తాను చేసిన పాపపు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. దీనికోసం నారదుడిని ఆశ్రయించాడు. నారదుడు రత్నాకర్ తో రాముడి నామాన్ని జపించమని చెప్పాడు.   ఆ రోజు నుండి రత్నాకర్ రామ నామాన్ని జపిస్తూ కూర్చొన్నాడు. అలా సంవత్సరాల పాటు రామ నామ తపస్సు చేస్తూనే ఉన్నాడు.  ఆయన చుట్టూ చెద పురుగులు పుట్టను కూడా కట్టేశాయి. కానీ ఆయన మాత్రం రామ నామాన్ని ఆపలేదు. రత్నాకర్ తపస్సుకు సంతోషించి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ప్రాయశ్చిత్తం చేకూర్చాడని,  రత్నాకర్ కు మహర్షిగా వరం ఇచ్చాడని కథనం.    తన చుట్టూ పుట్ట ఏర్పడటం ద్వారా  ఈయనకు వాల్మికి అనే పేరు వచ్చిందట.  

మహిళలూ జాగ్రత్త!!

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఆడపిల్ల గురించి దారుణాలు వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ దుర్ఘటన తాలూకూ అనుభవాల నుండి ఏదో ఒక చట్టాన్ని చేస్తూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లల మీద అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గొంతు చించుకొని ఎంత ఆవేదన వెలిబుచ్చినా అదంతా గాలిగీతంలా క్షణానికే మాయమవుతోంది. మరి ఇలాంటప్పుడు ఆడపిల్లలు బయటకు ఎక్కువ వెల్లకపోవడం మంచిదని చాలామంది చెబుతారు. కానీ భవిష్యత్తును వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది మరి. అయితే అమ్మాయి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడం అనేది ప్రతి తల్లిదండ్రిలో ప్రతీరోజును ఒక భయానక కాలంగా మార్చేస్తోంది. అలా కాకుండా తమ ఇష్టాలను లక్ష్యాలను  ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఇంట్లో వాళ్లకు భరోసా ఇవ్వగలిగే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి చీకు చింతా ఉండవు. దగ్గరగా…. దగ్గరగా….. చదువుకునే పిల్లల నుండి ఉద్యోగం చేసే అమ్మాయిలు, మధ్యవయసు ఆడవాళ్లు ఇలా అందరూ చూసుకోవాల్సిన మొదటి ఎంపిక స్కూల్ లేదా కాలేజి లేదా ఆఫీసు వంటివి దగ్గరలో ఉండేలా వాటికి దగ్గరలో ఇల్లు, లేదా హాస్టల్ చూసుకోవడం. దీనివల్ల అక్కడ కాస్త ఆలస్యం అయినా ఇంటికి చేరుకునే సమయం తక్కువే కాబట్టి పెద్దగా భయపడనవసరం లేదు.  కొంచం టచ్ లో ఉంటే బాగుంటుంది దూరబార ప్రయాణాలు, సిటీ లోనే కాలేజ్ లు, స్నేహితులతో ఎక్కడికైనా దూరం వెళ్లడం వంటి సందర్భాలలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అంతేకాదు రాత్రి పూట తప్పనిసరి అయి ఆటో లు, క్యాబ్ లు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. నమ్మకానికి ఆమడదురం ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం పూర్తిగా. కాలమే మారిపోతూ ఉంటుంది అలాంటపుడు మనుషులు మారకుండా ఉంటారా. అలాగని ఎప్పుడూ అనుమానంతో ఉండమని కాదు. అతినమ్మకం ఉండకూడదు అని. కాబట్టి ఎవరిని వారు పూర్తి విమర్శ చేసుకుని అప్పుడు అవతలి వారిని నమ్మాలి. ఏదో మోహమాటానికి పోయి సమస్యలలో చిక్కుకోవద్దు సుమా!! స్వీయ రక్షణే కొండంత భరోసా ఇప్పటికాలం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటి విద్యలు నేర్పడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా ప్రమాదంలో ఉన్నపుడు అవే కొండంత భరోసా ఇస్తూ తమని తాము కాపాడుకునేలా చేస్తాయి.  అంతే కాదండోయ్ ఆడపిల్లలు ఆటలలో చురుగ్గా ఉంటే వారు ఎంతో దృఢంగా తయారవుతారు. అదే వారికి స్వీయ రక్షణ గా తోడ్పడుతుంది కూడా. డోంట్ టచ్…. ఇప్పట్లో మొబైల్స్ ను చాలా సులువుగా హాక్ చేసేస్తారు. వాటి ద్వారా, బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే కెమెరా ఆక్టివేట్ చేసి అమ్మయిల ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజుతూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా  తక్కువగా బయటపడుతుంటాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫోన్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎవరైనా మీ వస్తువులను ముట్టడానికి ప్రయత్నం చేసినా సున్నితంగా డోంట్ టచ్ అని చెప్పేయండి. ఒకవేళ హెల్పింగ్ నేచర్ ఉన్నా తెలియని వ్యక్తులు అడిగినప్పుడు ఒక చిన్నపాటి కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం ఉత్తమం.  సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా చేస్తుంది. కాబట్టి తెలివిగా దాన్ని ఉపయోగించుకోగలగాలి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ లాంటివి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. రాత్రి పూట ప్రయాణాలలో వీలైనంతవరకు నిద్రను అవాయిడ్ చేయాలి. ప్రయాణం చేసి బస్ లేదా ట్రైన్ వంటివి దిగే  సమయానికి ఆయా స్టాప్ లలో కుటుంబసభ్యులు లేదా స్నేహితులు, లేదా చుట్టాలు ఇలా ఎవరో ఒకరు అక్కడికి చేసురుకుని రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి.  దేన్నీ నిర్లక్ష్యంగా చూడద్దు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరుకునేదాకా స్పృహతో ఉండాలి. పరిసరాలను గమనిస్తూ ఉండాలి.  కాలంతో పాటు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహిళల విషయంలో సమాజం దిగజారిపోతోంది. కాబట్టి జగరూకత ఎంతైనా అవసరం. ◆ వెంకటేష్ పువ్వాడ

పెళ్ళికి ముందు జంటలు ఈ ఒక్క పని తప్పక చేయాలి..!

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప దశ. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితం గురించి చాలా మార్పులు స్పష్టంగా ఉంటాయి.  ఊహకు కూడా అందని విధంగా పెళ్లి తరువాత ఇద్దరి వ్యక్తుల జీవితాలకు మార్పులకు లోనవుతాయి.  అంతేకాదు.. పెళ్లికి ముందు ప్రతి జంట మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి.  అవి వివాహం తరువాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు,  పిల్లల ప్లానింగ్ కావచ్చు,  పిల్లల భవిష్యత్తు కావచ్చు.. కాబోయే జంట ఎన్నో విషయాలలో ఎలా ఉండాలనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే పెట్టుకుని ఉంటారో.. అదే విధంగా  అవి సరిగా జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో కూడా ఉంటారు.  ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎలా సాగుతుందో.. భాగస్వామి తమతో ఎలా ఉంటారో అనే విషయాలలో కూడా బోలెడు సందేహాలు ఉంటాయి.  అందుకే పెళ్లికి ముందు కాబోయే జంట కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. అపరిచితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలసి ఒక జంటగా ఏర్పడి జీవితాన్ని కొనసాగించడం బోలెడు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. ఒకరి మీద ఒకరికి ఎన్నో సందేహాలు,  మరెన్నో అంచనాలు ఉంటాయి.  అదే ఇద్దరూ కలసి కౌన్సెలింగ్ తీసుకుంటే భార్యాభర్తల బంధం మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో.. ఏ విషయాన్ని అయినా ఎలా సంభాషించాలో అర్థం అవుతుంది. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యునికేషన్ ప్రదానమైనది.  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్  సాగాలంటే ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి.  ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు శ్రద్దగా వినగలగాలి.   పెళ్లికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల  భార్యాభర్తలు వైవాహిక జీవితంలో తమకున్న అంచనాలను చర్చించుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది.  పెళ్లి తరువాత ఈ అంచనాలకు తగ్గట్టు ఒకరికొకరు సర్దుబాటు కావచ్చు.  జీవితంలో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి.  ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ఉంటాయి.  పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే వీటి గురించి ఇద్దరికీ ఒక అవగాహన వస్తుంది. ఇద్దరూ కలిసి జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. కౌన్సెలర్ ముందు కాబోయే జంట తమ అభిప్రాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు వివరించడం వల్ల కాబోయే జంటకు భవిష్యత్తు గురించి, తాము ఇద్దరూ చేయాల్సిన విషయాల గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది. మనసులో ఉన్న చాలా సందేహాలకు అక్కడే సమాధానాలు దొరుకుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబోయే జంటలో ఎవరికైనా ఎవైనా బలహీనతలు,  సమస్యలు, లోపాలు ఉంటే వాటిని కౌన్సిలింగ్ లో బయట పెట్టడం ద్వారా భాగస్వామి తోడు, భరోసాను పెళ్లికి ముందే స్పష్టం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తరువాత కొన్ని భయాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత,  వైవాహిక జీవితంలో సంతోషం సాధ్యమవుతుంది.                                               *రూపశ్రీ.

జీవితం సంతోషంగా సాగాలంటే ఇవి ముఖ్యం..!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.