భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ పనులు చేయాలట..!
జీవిత ప్రయాణంలో ప్రేమకు, పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా సింగిల్ గా ఉండటం, తల్లిదండ్రులు కుటుంబ తోబుట్టువులుతో కలసి జీవించడం వేరు.. జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చాక ఆ మనిషితో జీవితాంతం ఒక దృఢమైన బంధాన్ని నిర్మించుకోవడం వేరు. వైవాహిక జీవితం ఇద్దరి మధ్య సామరస్యం, విశ్వాసం, పరస్పర గౌరవం, నమ్మకం మొదలైన వాటితో వృద్ధి చెందుతుంది. కేవలం ఇవి మాత్రమేకాదు.. వాస్తు శాస్త్రం, పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం, ఇంటి వాతావరణం మొదలైనవి కూడా ఇంటిలో సానుకూల వాతావరణాన్ని, భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకాన్ని, ఇద్దరి సంతోషాన్ని పెంచుతాయి. భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండటానికి శాస్త్రీయంగానూ, భారతీయ వాస్తు పరంగానూ ఎలాంటి టిప్స్ ఫాలో కావాలంటే..
భారతీయ వాస్తు శాస్త్రంలో దిక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కనీసం భోజనం చేయడం నుండి నిద్రించడం వరకు ఈ దిక్కులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు అందరూ. వాస్తు ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఉండే గది ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయ దిక్కులలో ఉండకూడదట. ఈ దిక్కులలో ఉంటే భార్యాభర్తల మధ్య చిన్నవిషయాలలో విభేదాలు, వివాదాలు, గొడవలకు దారితీస్తాయట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతోషం, సానుకూల వాతావరణం ఉండాలంటే భార్యాభర్తల గది వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలలో భార్యాభర్తలు నిద్రించే గది ఉంటే వారిద్దరి మధ్య ఒకరి నుండి మరొకరికి మంచి సహకారం ఉంటుంది. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఇద్దరూ కలసి పరిష్కరించుకోగలుగుతారు.
రంగులతో జరిగే మ్యాజిక్..
రంగులు భావోద్వేగాల మీద , మనిషి మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం, ఇద్దరి మధ్య అవగాహన పెరగడానికి పడక గదిలో రంగులు కూడా సహాయపడతాయి. పింక్, ఎరుపు, ఊదా రంగులు భార్యాభర్తల మధ్య ప్రేమను, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.మృదువుగా ఉండే పాస్టెల్ లు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
గదిలో ఇవి ఉంచండి..
భార్యాభర్తలు నిద్రించే గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పడకగది నైరుతి మూలలో ప్రేమను, బంధం మధ్య బలాన్ని తెలిపే విధంగా ఉండే పావురాల జంట బొమ్మలు లేదా ఫొటో ఫ్రేమ్ వంటివి ఉంచవచ్చు. లేదంటే బాతుల జంటలకు సంబంధించినవి కూడా ఉంచుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే పువ్వుల పెయింటింగ్ లు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన కళాకృతులు ఉంచుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటిని, పడక గదిని చిందర వందరగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవడం, పడక గదిలో మంచి సువాసన ఉండేలా తాజా పువ్వులు లేదా ఎయిర్ ఫ్రెషర్ లు ఉపయోగించాలి. ముఖ్యంగా భార్యాభర్తలు తమ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అయిన మొబైల్ ఫోన్ లను తమ గదిలో ఉంచడం మానేయాలి. నిద్ర లేవాలనే నిబంధన ఉండే అలారం వాచ్ ను ఉపయోగించాలి.
*రూపశ్రీ.